
వెన్నుపోటు పాలనలో పేదలకు ఇళ్లు కలే: కాకాణి
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేస్తోందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. పేదలకు ఇళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పొదలకూరు మండలం చిట్టేపల్లి వద్ద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని లబ్ధిదారులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాకాణి సందర్శించారు. కాలనీలో పేదలకు కేటాయించిన స్థలాల్లో హద్దురాళ్లు తొలగించడం, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలించడం వంటి అంశాలను ఆయన మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ‘జగనన్న కాలనీ.. చంద్రబాబు కహానీ’, ‘జగనన్న గృహం.. చంద్రబాబు ద్రోహం’ అంటూ నినాదాలు చేశారు.
పేదల సొంతింటి కలే లక్ష్యం
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు.
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం వెనుకడుగు వేయలేదన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని చోట రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి లేఅవుట్లు అభివృద్ధి చేశామని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.18 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
పొదలకూరులో 1,500 కుటుంబాలకు స్థలాలు
పొదలకూరు పంచాయతీలో సుమారు 1,500 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని కాకాణి తెలిపారు. 1,100 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే 530 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. చిట్టేపల్లి సమీపంలో సుమారు 45 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి నివాసయోగ్యంగా తీర్చిదిద్దామని తెలిపారు. నుడా నిబంధనలకు అనుగుణంగా 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేసినట్లు వివరించారు.
రూ.2.15 లక్షల వరకు గతంలో సాయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షల ప్రభుత్వ సాయం, ఉపాధి హామీ కింద రూ.30 వేలు, డ్వాక్రా సంఘాల ద్వారా రూ.35 వేల వరకు సున్నా వడ్డీ రుణం కలిపి మొత్తం రూ.2.15 లక్షల వరకు లబ్ధి చేకూర్చామని కాకాణి తెలిపారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించి ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించామని చెప్పారు. చంద్రబాబు పాలన అవినీతి, డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కాకాణి విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని తెలిపారు. తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులను, కక్షసాధింపు చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పేదల సంక్షేమానికి అండగా నిలిచిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.
