
వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడతాం:ఎమ్మెల్యే సౌమ్య
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, బడుగు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లపై సోలార్ గ్రిడ్ అనుసంధాన ప్రక్రియను వీరులపాడు మండలం జుజ్జూరులో ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై కూటమి నాయకులతో కలిసి సూర్యఫలకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని దానికి శాశ్వత పరిష్కారంగా ఈ సోలార్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.91 లక్షల కుటుంబాలకు 2 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు.
ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ పథకం ద్వారా మొత్తం 382 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తద్వారా 4.53 లక్షల కుటుంబాల అవసరాలు తీరుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎన్ఆర్ఈ ఆర్థిక సాయం అందిస్తుండగా మిగిలిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. దీనివల్ల ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వంపై పడే సబ్సిడీ భారం గణనీయంగా తగ్గి ప్రాజెక్టు జీవితకాలంలో దాదాపు రూ. 6,200 నుంచి రూ. 6,900 కోట్ల మేర ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కేవలం ఉచిత విద్యుత్ మాత్రమే కాకుండా అదనపు ఆదాయం కూడా లభించనుంది. తమ ఇంటి పైకప్పుపై సోలార్ పలకలను ఏర్పాటు చేసుకున్నందుకు గాను వినియోగదారులకు నెలకు రూ.150 నుంచి రూ.200 వరకు ‘రూఫ్ రెంట్’ (అద్దె) లభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీని అందించే ఈ వ్యవస్థల ద్వారా నియోజకవర్గంలో మొదటి విడతగా 2,000 మందికి లబ్ధి చేకూరుతుందని ఇందులో భాగంగా కరివేణి బక్క గ్రామంలో 175 మందికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదనంగా విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ, గృహ విద్యుత్ లైన్లను వేరు చేయడం ద్వారా లో-వోల్టేజీ సమస్యలు తొలగిపోయి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
