Let's talk: editor@tmv.in
వెనిజులా మహిళకు నోబెల్‌ శాంతి బహుమతి

వెనిజులా మహిళకు నోబెల్‌ శాంతి బహుమతి

Shaik Mohammad Shaffee
11 అక్టోబర్, 2025

ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ అరుదైన గౌరవం వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోను వరించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మచాడో చేస్తున్న అలుపెరగని, శాంతియుత పోరాటానికి ఈ అత్యున్నత పురస్కారం గుర్తింపుగా నిలిచింది.

నోబెల్ కమిటీ ప్రశంసలు

"దేశంలో పెరిగిపోతున్న నియంతృత్వ చీకట్లలో ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగిస్తూ, లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్న ఆమె ధైర్యానికి, శాంతియుత పోరాటానికి ఈ బహుమతి ఒక గుర్తింపు" అని నోబెల్ కమిటీ అభివర్ణించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు న్యాయమైన, శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం ఆమె చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో సంపన్నమైన, ప్రజాస్వామ్య దేశంగా ఉన్న వెనిజులా, నేడు క్రూరమైన, అధికార దాహంతో నిండిన ప్రభుత్వ పాలనలో తీవ్రమైన మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభుత్వ హింసా యంత్రాంగం వల్ల దాదాపు 80 లక్షల మంది దేశం విడిచి పారిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, విడిపోయిన ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో మచాడో (వెనిజులా ఉక్కు మహిళగా ప్రసిద్ధి) కీలక పాత్ర పోషించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రాతినిధ్య ప్రభుత్వం అనే ఉమ్మడి లక్ష్యం కోసం ఆమె నాయకత్వం వహించారు.

మచాడో ఎవరు?*

వెనిజులాకు చెందిన మచాడో గత 20 ఏళ్లుగా ప్రజాస్వామ్య ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఆమె స్థాపించిన 'సుమేట్' అనే సంస్థ ద్వారా "తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం" అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని అధికార ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ, ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రుటియాకు మద్దతు ప్రకటించి విజయం కోసం పనిచేశారు.

ఎన్నికల రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ఆమె నాయకత్వంలో లక్షలాది మంది వాలంటీర్లు పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడ్డారు. వేధింపులు, అరెస్టులు, చిత్రహింసలు తప్పవని తెలిసినా వారు ధైర్యంగా పోరాడారు. ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ, దేశం విడిచి వెళ్లకుండా రహస్యంగా ఉంటూనే ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని నోబెల్ కమిటీ పేర్కొంది. మరియా కొరినా మచాడో వంటి స్వేచ్ఛా సంరక్షకులను గుర్తించడం చాలా కీలకమని, ఆమె శాంతి, ప్రజాస్వామ్యం రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని నిరూపించారని కమిటీ అభిప్రాయపడింది.

ట్రంప్‌కు నిరాశ

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా నేతకు ప్రకటించడంతో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. తాను అనేక యుద్ధాలు ఆపి, ప్రపంచ శాంతిని నెలకొల్పానని, ఈ పురస్కారం తనకే దక్కాలని ట్రంప్ గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. పలు దేశాలు మద్దతు పలికినా, నోబెల్ కమిటీ ప్రజాస్వామ్య పోరాటానికి ఈ అత్యున్నత గౌరవాన్ని ఇచ్చింది.

ఈ పురస్కారం కింద మచాడోకు బంగారు పతకం, 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (సుమారు రూ.8.8 కోట్ల భారత కరెన్సీ) నగదు బహుమతి లభిస్తుంది. డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లో నగరంలో ఈ అవార్డును అందజేస్తారు. కాగా నోబెల్ పురస్కారానికి మచాడో ఎంపిక ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది.

నోబెల్ శాంతి బహుమతిని మొదటిసారిగా 1901లో ప్రకటించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడైన హెన్రీ డ్యూనాంట్ ఈ అవార్డును తొలిసారి అందుకున్నారు. 1901 నుండి 2024 వరకు నోబెల్ శాంతి బహుమతిని 105 సార్లు ప్రకటించారు. మొత్తం 142 మంది గ్రహీతలకు (111 వ్యక్తులు, 31 సంస్థలు) ఈ పురస్కారాన్ని అందించారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కారణంగా, కొన్నిసార్లు తగిన అభ్యర్థి లేనందున సుమారు 19 సార్లు ఈ బహుమతిని ప్రకటించలేదు. మన భారతదేశం నుంచి 1979లో మదర్ థెరిస్సా , 2014లో కైలాస్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారాలను అందుకున్నారు.