
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వెనిజులా దేశానికి తానే 'తాత్కాలిక అధ్యక్షుడిని' అని ప్రకటించుకుంటూ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. వికీపీడియా పేజీని పోలి ఉన్న ఆ ఫోటోలో.. 2026 జనవరి నుండి ట్రంప్ వెనిజులా బాధ్యతలు చేపట్టినట్లుగా ఉంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోయినా, వెనిజులాపై అమెరికా పెత్తనం ఏ స్థాయిలో ఉందో ఈ పోస్ట్ సూచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
ఏమిటీ వివాదం? అసలేం జరిగింది?
కొద్దిరోజుల క్రితం అమెరికా సైన్యం వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణిని బంధించి అమెరికాకు తరలించింది. ప్రస్తుతం మదురో న్యూయార్క్‌లోని జైలులో ఉన్నారు. ఈ పరిణామం తర్వాత వెనిజులాలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికి ఆ దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ట్రంప్ మాత్రం ఆ దేశాన్ని తామే నడిపిస్తామని, చమురు నిల్వలను పునరుద్ధరిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
అమెరికా చేతికి భారీ చమురు నిల్వలు
తాజాగా వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా వెనిజులా నుండి 50 మిలియన్ బారెళ్ల చమురును అమెరికాకు పంపేందుకు ఒప్పందం కుదిరింది. దీని విలువ సుమారు రూ. 35,000 కోట్లు (4.2 బిలియన్ డాలర్లు). ఈ చమురు ఇప్పటికే అమెరికా ఓడరేవులకు బయలుదేరిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులాను తన నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా అమెరికా తన ఇంధన అవసరాలను తీర్చుకోవాలని చూస్తోంది.
నిధుల రక్షణకు 'నేషనల్ ఎమర్జెన్సీ'
వెనిజులా చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని కాపాడేందుకు ట్రంప్ ఒక కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికా బ్యాంకుల్లో ఉన్న వెనిజులా నిధులను ఎవరూ జప్తు చేయకుండా ఆయన 'జాతీయ అత్యవసర పరిస్థితి' ప్రకటించారు. ఈ నిధులు వెనిజులా ప్రజల సొత్తని, వీటిని అమెరికా విదేశీ విధానాలకు అనుగుణంగా ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఈ డబ్బుపై హక్కులు కోరకుండా ఈ చట్టం అడ్డుకుంటుంది.
ప్రతిపక్ష నేతకు నోబెల్ వచ్చినా 'నో' చెప్పిన ట్రంప్
వెనిజులా తదుపరి అధ్యక్షుడిగా ఆ దేశ విపక్ష నేత, నోబెల్ విజేత మచాడో పేరు గట్టిగా వినిపించింది. అయితే ఆమెకు బాధ్యతలు ఇవ్వడంపై ట్రంప్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రజల్లో తగినంత మద్దతు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందిగ్ధ పరిస్థితుల మధ్య తానే వెనెజువెలాను నడిపిస్తానన్నట్లుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి.
మదురో అరెస్ట్‌పై వెనిజులా ఆగ్రహం
తమ దేశ మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా బంధించడాన్ని డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్రంగా ఖండించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే "మాయని మచ్చ" అని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా తన అధికార బలంతో మరొక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం చట్టవిరుద్ధమని ఆ దేశ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వెనిజులా సంక్షోభం ఇప్పుడు అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.
