Let's talk: editor@tmv.in
వెనిజులా చమురు, విమాన సేవలపై అమెరికా ఆంక్షల సడలింపు

వెనిజులా చమురు, విమాన సేవలపై అమెరికా ఆంక్షల సడలింపు

Shaik Mohammad Shaffee
31 జనవరి, 2026

ప్రపంచంలోనే అత్యధిక ముడిచమురు నిల్వలున్న వెనిజులాలో చమురు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. అమెరికా సైనిక దాడిలో మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన నెల రోజుల్లోపే, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశ ఆర్థిక ఇంజిన్ అయిన చమురు రంగాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా విప్లవాత్మక చట్టంపై సంతకం చేశారు. దశాబ్దాలుగా చమురు రంగంపై సాగుతున్న ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ, ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనలను సడలించారు. ఈ మార్పులకు మద్దతుగా అమెరికా ఖజానా శాఖ వెనిజులాపై ఉన్న కఠిన చమురు ఆంక్షలను ఎత్తివేస్తూ ‘జనరల్ లైసెన్స్ నంబర్–46’ను జారీ చేసింది.

సంస్కరణల వెల్లువ.. ప్రైవేటుకు పగ్గాలు

వెనిజులా జాతీయ అసెంబ్లీ ఆమోదించిన నూతన చట్టం ఆ దేశ ఆర్థిక గమనాన్ని మార్చేలా ఉంది. గత రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన సోషలిస్టు సిద్ధాంతాలను పక్కన పెడుతూ, చమురు ఉత్పత్తి, విక్రయాలు, ధరల నిర్ణయంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కీలక పాత్ర కల్పించింది. తద్వారా దశాబ్దాల కాలంగా ప్రభుత్వ రంగ సంస్థ 'పీడీవీఎస్ఏ' చలాయిస్తున్న ఏకాధిపత్యానికి ముగింపు పలికినట్లయింది. ప్రైవేటు శక్తుల భాగస్వామ్యంతో కుప్పకూలిన చమురు రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాయల్టీ గరిష్ఠ పరిమితిని 30 శాతానికి తగ్గించడమే కాకుండా, ప్రాజెక్టు పెట్టుబడి పరిమాణాన్ని బట్టి దానిని మరింత తగ్గించే అధికారాన్ని ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. దీనికి తోడు, విదేశీ సంస్థల్లో భరోసా నింపేందుకు వివాదాల పరిష్కార వేదికల్లో భారీ మార్పులు చేసింది. ఇకపై ఏదైనా వివాదం తలెత్తితే కేవలం వెనిజులా కోర్టులకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)కు వెళ్లే వెసులుబాటు కల్పించారు. గతంలో చావెజ్ హయాంలో జరిగినట్లుగా ఆస్తుల జాతీయీకరణ జరుగుతుందన్న భయం నుంచి ఈ నిర్ణయం ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తుంది.

అమెరికా నిఘా.. నిధుల వినియోగంపై ఆంక్షలు

వెనిజులాపై ఆంక్షలు సడలించినప్పటికీ, ఆ దేశ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై అమెరికా అత్యంత కఠినమైన నిఘాను ఏర్పాటు చేసింది. ఈ విక్రయాల ద్వారా లభించే సొమ్ము నేరుగా వెనిజులాకు చేరకుండా, అమెరికాలోని నిర్దేశిత బ్లాక్డ్ అకౌంట్లలో (ప్రత్యేక ఖాతాల్లో) జమ అవుతుంది. ఉదాహరణకు ప్రముఖ చమురు వ్యాపార సంస్థ 'విటోల్‌'తో కుదిరిన 250 మిలియన్ డాలర్ల ఒప్పందానికి సంబంధించిన నిధులు కూడా ఇదే పద్ధతిలో అగ్రరాజ్యం నియంత్రణలో ఉంటాయి. ఈ రకమైన ఆర్థిక ఆంక్షల ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోంది.

ఈ నిధుల వినియోగంపై కూడా అమెరికా స్పష్టమైన పరిమితులు విధించింది. వెనిజులాలోని రోడ్రిగెస్ ప్రభుత్వం ఈ సొమ్మును కేవలం మందులు, ఆహారం, వైద్యం, పోలీసింగ్ వంటి అత్యవసర ప్రజావసరాలకే వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ముందుగానే బడ్జెట్‌ను సమర్పించి అమెరికా అనుమతి పొందడమే కాకుండా, నిధుల వినియోగంపై స్వతంత్ర సంస్థల ద్వారా ఆడిట్ నిర్వహించడం తప్పనిసరి. మరోవైపు, అమెరికాకు బద్ధశత్రువులైన చైనా, రష్యా, క్యూబా, ఇరాన్, ఉత్తర కొరియాలకు చెందిన సంస్థలతో ఎలాంటి చమురు ఒప్పందాలు చేసుకోకూడదని అగ్రరాజ్యం కఠిన నిబంధన విధించింది.

చావెజ్ విధానాలకు చరమగీతం

ఒకప్పుడు హ్యూగో చావెజ్ చమురును సామ్యవాద విప్లవానికి ఆయుధంగా వాడి, విదేశీ కంపెనీల ఆస్తులను జప్తు చేశారు. 1999-2011 మధ్య వచ్చిన సుమారు 981 బిలియన్ డాలర్ల ఆదాయం అవినీతి, దుర్వ్యవస్థ వల్ల వృధా అయి దేశం ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయింది. ఇప్పుడు ఆ పాత విధానాలను తిరగరాస్తూ రోడ్రిగెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. "ఇది మన పిల్లలకు ఇవ్వబోయే సురక్షిత భవిష్యత్తు గురించి" అని ఆమె వ్యాఖ్యానించారు.

మళ్లీ ఎగరనున్న విమానాలు

ఆర్థిక సంబంధాల పునరుద్ధరణలో భాగంగా వెనిజులా వాణిజ్య గగనతలాన్ని తిరిగి తెరుస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ త్వరలోనే తన విమాన సేవలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పులపై చమురు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మాజీ మంత్రి రాఫెల్ రామిరెజ్ వంటి వారు ఇది జాతీయ విజయాలను తుడిచిపెట్టడమేనని విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ఈ సరికొత్త భౌగోళిక-ఆర్థిక మార్పులు వెనిజులాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయో లేదో వేచి చూడాలి.