Let's talk: editor@tmv.in
వెనిజులా అధ్యక్షుడిగా పోటీ చేస్తా.. ట్రంప్ సరదా వ్యాఖ్యలు

వెనిజులా అధ్యక్షుడిగా పోటీ చేస్తా.. ట్రంప్ సరదా వ్యాఖ్యలు

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తాను, ఈ పదవీ కాలం పూర్తయిన తర్వాత వెనిజులా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. సోమవారం వాషింగ్టన్‌లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనిజులాలో తనకు విపరీతమైన ప్రజాదరణ ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అక్కడ నాకే తిరుగులేని మెజారిటీ!

వెనిజులాలో ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. "అక్కడ గనుక నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే, చరిత్రలో ఎవరికీ రానంత స్థాయిలో అత్యధిక ఓట్లు నాకే వస్తాయని ప్రజలు చెబుతున్నారు. కాబట్టి నా అమెరికా అధ్యక్ష పదవీ కాలం ముగిశాక, నేను వెనిజులా వెళ్తాను" అని ట్రంప్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా "నేను త్వరలోనే స్పానిష్ భాషను నేర్చుకుంటాను. నాకు భాషల మీద మంచి పట్టు ఉంది, కాబట్టి అది పెద్ద కష్టమేమీ కాదు. వెనిజులా వెళ్లి అధ్యక్షుడిగా పోటీ చేస్తాను" అని చలోక్తులు విసిరారు. అయితే ప్రస్తుతం అక్కడ తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన నాయకత్వం పట్ల తాము సంతోషంగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

45 నిమిషాల్లోనే ఆపరేషన్ ఖతం!

ఈ ఏడాది జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా బలగాలు బంధించిన విషయం తెలిసిందే. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై వారిని అమెరికాకు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘర్షణ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. "వెనిజులాతో పోరాటం కేవలం 45 నిమిషాల్లోనే ముగిసిపోయింది" అని గర్వంగా ప్రకటించారు.

యుద్ధ ఖర్చులన్నీ చమురుతోనే..

వెనిజులాలోని సహజ వనరులపై తమ పట్టును ట్రంప్ బాహాటంగానే అంగీకరించారు. "ఇప్పటికే వెనిజులా నుంచి వందల మిలియన్ల బారెళ్ల ముడి చమురును మేము స్వాధీనం చేసుకున్నాం. అది ప్రస్తుతం హ్యూస్టన్‌కు చేరుకుని, శుద్ధి ప్రక్రియ ముగించుకుని మార్కెట్లోకి కూడా వచ్చేసింది. ఆ చమురు ద్వారా వచ్చిన ఆదాయం వెనిజులాపై జరిగిన యుద్ధానికి అయిన ఖర్చు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ" అని ట్రంప్ వివరించారు. ప్రస్తుతం వెనిజులాలో మంచి పాలన సాగుతోందని, ఆ దేశంతో తమకు భాగస్వామ్య సంబంధాలు బాగున్నాయని ఆయన తెలిపారు.