
వెనిజులాలోని డ్రగ్స్ స్థావరాలపై అమెరికా దాడి.. ధ్రువీకరించిన ట్రంప్
వెనిజులాలోని మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణా కేంద్రాలపై అమెరికా మెరుపు దాడి చేసింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్వయంగా ప్రకటించారు. వెనిజులా తీరంలో డ్రగ్స్‌ను పడవల్లోకి ఎక్కించే ఒక ప్రధాన కేంద్రాన్ని (డాక్ యార్డ్) అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి. అధ్యక్షుడు నికోలాస్ మడురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా, అమెరికా వెనిజులాలో భూభాగంలో ఆపరేషన్ నిర్వహించిన తొలి ఘటనగా ఇది భావిస్తున్నారు.
"అక్కడ పడవల్లో డ్రగ్స్ నింపుతుండగా భారీ పేలుడు సంభవించింది. మేము ఆ పడవలతో పాటు, ఆ కేంద్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాం. ఇప్పుడు అక్కడ ఆ స్థావరం లేదు" అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు, అమెరికా ప్రభుత్వంలోని ఏ విభాగం ఈ దాడి చేసింది అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
సీఐఏ డ్రోన్ దాడి?
ఈ దాడిని సీఐఏ నిర్వహించిందా? అని ప్రశ్నించగా, “ఎవరు చేశారో నాకు తెలుసు. కానీ చెప్పదలచుకోలేదు,” అని ట్రంప్ అన్నారు. అయితే, సీన్‌ఎన్ కథనం ప్రకారం, ఈ నెల ప్రారంభంలో వెనిజులా తీరంలో ఉన్న ఓ పోర్టు కేంద్రంపై సీఐఏ డ్రోన్ దాడి చేసింది.'ట్రెన్ డి అరగువా' అనే వెనిజులా గ్యాంగ్ ఈ కేంద్రాన్ని డ్రగ్స్ నిల్వ చేయడానికి, విదేశాలకు పంపడానికి ఉపయోగిస్తున్నట్టు అమెరికా అనుమానించింది.
గతంలోనే వెనిజులాలో రహస్య ఆపరేషన్లు నిర్వహించేందుకు సీఐఏకు అనుమతి ఇచ్చినట్టు ట్రంప్ వెల్లడించారు. గత వారం ఓ రేడియో కార్యక్రమంలో కూడా వెనిజులాలోని పెద్ద కేంద్రంపై అమెరికా చర్యలు తీసుకున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ ఘటనపై సీఐఏ, వైట్ హౌస్, పెంటగాన్ అధికారికంగా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. వెనిజులా ప్రభుత్వం కూడా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించలేదు.
ఇదిలా ఉండగా, వెనిజులాలోని ‘జూలియా’ రాష్ట్రంలో ఉన్న ‘ప్రిమాజోల్’ అనే కెమికల్ ఫ్యాక్టరీలో క్రిస్మస్ పండుగ ముందు రోజు అగ్నిప్రమాదం జరిగింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన ‘డ్రగ్స్ స్థావరంపై దాడి’ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఆ కంపెనీ స్పందిస్తూ.. తమ ఫ్యాక్టరీలో జరిగింది కేవలం అగ్నిప్రమాదమేనని, ట్రంప్ చెప్పిన దాడులతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తెచ్చామని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని కంపెనీ తెలిపింది. కానీ, ఫ్యాక్టరీ సమీపంలో నివసించే ప్రజలు మాత్రం పెద్ద పేలుడు శబ్దం విన్నామని, మంటలతో పాటు ఘాటైన క్లోరిన్ వాసన కూడా వచ్చిందని చెబుతున్నారు.
మడురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంపు
గత నెలలోనే వెనిజులాపై మరింత కఠిన చర్యలకు అమెరికా సిద్ధమవుతోందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. మొదట రహస్య ఆపరేషన్‌లే ప్రారంభమవుతాయని అప్పట్లో అమెరికా అధికారులు తెలిపారు. ఇప్పటికే డ్రగ్ రవాణాకు సంబంధించిన అనుమానాస్పద బోట్లపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో కరీబియన్, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో 20కిపైగా ఘటనల్లో కనీసం 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. సెప్టెంబర్‌లో జరిగిన ఓ అమెరికా దాడిలో 11 మంది చనిపోయిన ఘటనపై కూడా అమెరికా సైనికాధికారులు పార్లమెంట్ సభ్యులకు వివరాలు ఇచ్చారు. ఆ దాడి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే జరిగిందా? అనే అంశంపై డెమోక్రాట్లు ప్రశ్నలు లేవనెత్తారు.
ట్రంప్ పాలనలో కరీబియన్ ప్రాంతంలో అమెరికా భారీగా సైనిక బలగాలను మోహరించింది. ప్రస్తుతం అక్కడ 15 వేల మందికి పైగా సైనికులు ఉన్నట్లు సమాచారం. డ్రగ్ రవాణా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా చెబుతోంది. మొత్తంగా వెనిజులాలో జరిగిన ఈ దాడి లాటిన్ అమెరికా రాజకీయాల్లో, అమెరికా-వెనిజులా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
