
వెనిజులాపై అమెరికా దాడి, మదురో అతని భార్య బంధీ
లాటిన్ అమెరికాను వణికించి, ప్రపంచ దేశాల రాజధానుల్లో ప్రకంపనలు సృష్టించిన ఒక అనూహ్య పరిణామం జనవరి 3 తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకాస్ లో జరిగింది. అమెరికా నేరుగా వెనిజులా భూభాగంపై సైనిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్య సిలియా ఫ్లోరెస్‌లను వెనిజులా భూభాగం నుండి బంధించి తరలించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా అంగీకరించిన ఈ చర్య, 1989 పనామా ఆక్రమణ తర్వాత ఆ ప్రాంతంలో అమెరికా జరిపిన అత్యంత బహిరంగ సైనిక జోక్యంగా నిలిచింది.
స్థానిక సమాచారం ప్రకారం, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారకాస్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక స్థావరాల సమీపంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాలు, లక్షిత దాడులను నివాసితులు గమనించారు. ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. కరాకస్‌లోని లా కార్లోటా ఎ యిర్‌బేస్, ఇతర సైనిక ప్రాంతాల సమీపంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
ఈ చర్య జరిగిన వెంటనే వెనిజులా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ శబ్దాలు "షెడ్యూల్డ్ మిలిటరీ డ్రిల్స్" (ముందుగా నిర్ణయించిన సైనిక విన్యాసాలు) అని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, తెల్లవారుజామున 2 గంటలకు ముందస్తు సమాచారం లేకుండా ఇవి జరగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కాని ఈ ఘటన జరిగిన కొంతసేపటికి ఈ దాడులు తామే జరిపామని, నార్కో-టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్‌కు సంబంధించి మదురోపై ఉన్న పాత అభియోగాల ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం, రాజధాని కారకాస్‌లో భారీ ఎత్తున జరిగిన దాడుల్లో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా బలగాలు బంధించాయి. వీరిద్దరూ న్యూయార్క్‌లో క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు.
అయితే, కారకాస్ ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా కొట్టిపారేసింది. వెనిజులా ప్రభుత్వం ఈ చర్యను "కిడ్నాప్", "సాయుధ దురాక్రమణ"గా అభివర్ణించింది. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించడంతో పాటు, ఐక్యరాజ్యసమితి నిబంధనలను అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. ఎటువంటి అంతర్జాతీయ అనుమతి లేదా చట్టపరమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా పాలనను మార్చే ప్రయత్నం ఇది అని పేర్కొంది.
అధికారమే అంతిమ తీర్పు
ఈ ఘటనలో గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆమెరికా సైనిక బలం ఉపయోగించడమే కాకుండా, ఎటువంటి దౌత్యపరమైన సాకులు చెప్పకపోవడం. దీనికి ఐక్యరాజ్యసమితి తీర్మానం లేదు, కూటమి ఆదేశం లేదు. కేవలం "ముందు శక్తిని ప్రదర్శించి, తర్వాత వివరణ ఇచ్చుకోవడం" అనే స్పష్టమైన సందేశం ఇక్కడ కనిపిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలు కేవలం బలహీన దేశాలకే వర్తిస్తాయని, బలమైన దేశాలకు అవి ఐచ్ఛికమని ఈ ఉదంతం నిరూపించింది.
తీవ్రమైన అంతర్జాతీయ ప్రతిస్పందనలు
రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా నాయకత్వాన్ని "బలంగా" హెచ్చరిస్తూ, "తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఒక సార్వభౌమ దేశానికి చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆయన జీవిత భాగస్వామిని విడుదల చేయాలి" అని డిమాండ్ చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
అమెరికా వైమానిక దాడులను చైనా ఖండించింది, వీటిని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే "ఆధిపత్య చర్యలు"గా అభివర్ణించింది. "ఒక సార్వభౌమ దేశంపై, ఆ దేశ అధ్యక్షుడిపై అమెరికా సాగించిన దాడులు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా ఐక్యరాజ్యసమితి నిబంధనలను గౌరవించాలి" అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఈ దాడిని "అంగీకరించలేని చర్య" అని పిలిచారు. "దేశాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. ఇది హింస, గందరగోళం, అస్థిరతకు దారితీస్తుంది. ఇది లాటిన్ అమెరికా శాంతికి విఘాతం కలిగిస్తుంది" అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ఇది "అంగీకరించలేని గీతను దాటడం" అని హెచ్చరించారు.
ఐరోపా దేశాల స్పందన
ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. మదురోకు చట్టబద్ధత లేదని ఈయూ గతంలోనే చెప్పిందని, అయితే ఏ పరిస్థితిలోనైనా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఆమె కోరారు. వెనిజులాలో ఉన్న ఈయూ పౌరుల భద్రతే తమకు ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు.
బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, ఈ ఆపరేషన్‌లో తమకు ఎటువంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తామని చెప్పారు.
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చారు. యూరోపియన్ యూనియన్ సంయమనం పాటించాలని కోరింది.
గతంలో పనామా (1989), ఇరాక్ (2003), లిబియా (2011) వంటి సందర్భాల్లో ఏదో ఒక మానవతా దృక్పథం లేదా సాకు చెప్పేవారు. కానీ, మదురో విషయంలో ఎటువంటి ముసుగు లేకుండా నేరుగా దాడి చేయడం దౌత్యవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. చట్టం కాదు, డబ్బు, సైనిక బలమే ప్రపంచాన్ని శాసిస్తాయని ఈ చర్య చాటిచెప్పింది.
మౌనం వీడని భారత్
అమెరికా అనైతిక చర్యల నేపథ్యంలో భారతదేశం వహిస్తున్న మౌనం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతర్జాతీయ వేదికలపై సార్వభౌమాధికారం, జోక్యం చేసుకోకపోవడం గురించి మాట్లాడే భారతదేశం, ఇప్పుడు మౌనంగా ఉండటం ఆశ్చర్యకరం.
న్యూఢిల్లీ పెద్దల ఈ మౌనం, ఏకపక్ష బలప్రయోగాన్ని మౌనంగా అంగీకరించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ నియమాలు అనేవి కేవలం కొన్ని దేశాలకేనా లేక అందరికీ వర్తిస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో దౌత్యపరమైన కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ఒక దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి ఒక విదేశీ సైన్యం పట్టుకుపోవడం అనేది అంతర్జాతీయ సంబంధాలలో ఆమోదయోగ్యమైన ప్రవర్తన పరిమితులను మార్చివేసింది. మనం నివసిస్తున్నది సమానమైన ప్రపంచంలో కాదు, శక్తివంతుల ప్రపంచంలో అని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
ట్రంప్ కి మద్దతు
ఇదిలా ఉంటే ట్రంప్ మిత్రుడైన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ఈ చర్యను స్వాగతించారు. "స్వేచ్ఛ ముందుకు సాగుతోంది. స్వేచ్ఛ వర్ధిల్లాలి!" అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా స్పందిస్తూ.. "నార్కో-చావిస్టా నేరస్తులారా, మీ సమయం దగ్గరపడింది. మీ సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది" అని పేర్కొన్నారు.
మదురో పట్టుబడిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, వెనిజులాలో అధికారం సురక్షితంగా బదిలీ అయ్యే వరకు అమెరికానే ఆ దేశాన్ని "నడిపిస్తుందని" చెప్పారు. అంతేకాకుండా, వెనిజులాలో ఉన్న భారీ చమురు నిల్వలను వెలికితీసి ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో విక్రయిస్తామని కూడా ఆయన వెల్లడించారు.
