
వెండిలో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు?
బంగారం, వెండి మధ్య తీవ్ర స్థాయిలో పోటి జరుగుతోంది. క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్ తలపడిన లెవల్‌లో ఈ రెండు వస్తువులు ఒకదానికి మించి మరొకటి రికార్డులు బద్దలుకొడుతన్నాయి. ఒకటి లక్ష దాటి పరుగులు పెడుతుంటే.. ఇంకోటి రెండు లక్షలు దాటి దూసుకుపోతోంది. అందుకే ఈ రెండిటిని పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉన్నట్టే సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈజీగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ లాంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఆకర్షణను పెంచుతున్నాయి. అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు బెస్ట్ రిటర్న్స్ కూడా అందిస్తున్నాయి. ఒకానొక సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్‌లకే ఎక్కువ రాబడులు వచ్చాయి. అటు బంగారం కొనలేని కొన్ని వర్గాల ప్రజలు వెండిని కొనగలరు. కాబట్టి, వెండికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.
నిజానికి ఫిజికల్ సిల్వర్ వల్ల లాభాలు రావు. వెండిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రస్తుతం ఉన్న ఉత్తమ మార్గం ఈటీఎఫ్‌లే. సిల్వర్ ఈటీఎఫ్‌లు వెండి ధరను ట్రాక్ చేసే ఫండ్స్. ఇవి, తమ దగ్గర ఉన్న నిధుల్లో 95శాతం మొత్తాన్ని ఫిజికల్ సిల్వర్, ఇతర వెండి సంబంధిత ఉత్పత్తులలో పెట్టుబడి పెడతాయి. వెండి ధర పెరుగుతున్న కొద్దీ వాటి రాబడులు కూడా పెరుగుతాయి. అంతేకాదు, మీరు షేర్లలాగే సిల్వర్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయవచ్చు, మార్కెట్ ధరకు వాటిని కొనవచ్చు, అమ్మవచ్చు. వెండి భౌతిక వ్యాపారంలో ఉండే కొన్ని రకాల నష్టాలను సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా నివారించవచ్చు. ఫిజికల్ సిల్వర్‌లాగా వెండి ఈటీఎఫ్‌లను ఎవరూ దొంగిలించలేరు, పోగొట్టుకోలేరు. ఇక ఈటీఎఫ్‌ల సంగతి అటు ఉంచి ఫిజికల్ బంగారం ఫిజికల్ వెండి ఈ రెండింటిలో పోల్చి చూస్తే మనకి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వెండికి ఆ అవకాశం ఉండదు.
ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో మీరు ఇప్పుడు వెండిని ఆన్‌లైన్‌లో తక్కువ పరిమాణంలో.. అంటే ఒక గ్రామును కూడా కొనుగోలు చేయవచ్చు. మీ వెండిని సురక్షితంగా నిల్వ చేస్తారు. ఇక ఆ సిల్వర్‌ను మీరు విక్రయించడానికి ఎంచుకోవచ్చు లేదా ఫిజికల్ డెలవరీకి అభ్యర్థించవచ్చు. మరోవైపు వెండి మైనింగ్ స్టాక్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వెండిని తవ్వే కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రాబడి లభిస్తుంది. కానీ వీటిల్లో కూడా రిస్క్ ఉంటుంది. ఈ స్టాక్స్ వెండి ధరల ద్వారా మాత్రమే కాకుండా కంపెనీ పనితీరు, మార్కెట్ ట్రెండ్‌లు లాంటి సమస్యల ద్వారా కూడా ప్రభావితమవుతాయి. ఇటు పెట్టుబడిదారులకు సిల్వర్ ఫ్యూచర్స్ మరో మంచి ఎంపిక. అయితే వాటికి లోతైన మార్కెట్ అవగాహన అవసరం. అలాగే హై రిస్క్ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందుకే ఎందులో ఇన్‌వెస్ట్ చేయాలన్న ముందుగా మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం అన్నిటికంటే ముఖ్యం.. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి..!
