Let's talk: editor@tmv.in
వెంటాడే ‘మూఢ’ నమ్మకాలు

వెంటాడే ‘మూఢ’ నమ్మకాలు

FL - BHAVN
2 అక్టోబర్, 2025

పిల్లి ఎదురొస్తే.. అపచారం, భర్తను కోల్పోయిన స్త్రీ ఎదురొస్తే ఇంకేదో కీడు, దారిలో నిమ్మకాయలు కనపడితే అమ్మో దిష్టి, గబ్బిలమో, కాకో తలపై నుంచి ఎగిరితే ఇక దరిద్రమే. ఫలానా వాళ్ళ అంటితే.. ఇక అంతే ఇలా.. మన నిత్యం జీవితంలో కొన్ని మూఢనమ్మకాలు వాటికవే మనపై, మన మొదడుపై ఎక్కి స్వారీ చేస్తుంటాయి. అవి తరతరాలుగా మన సమాజంలో మన ప్రమేయం లేకుండానే గింగుర్లు తిరుగుతుంటాయి. వాటిని కొట్టిపడేసి నాలుగు అడుగులు వేసి ధైర్యంగా ముందుకెళ్ళేవాళ్ళు కొందరైతే మరికొందరు.. ఆ మూఢనమ్మకానికి తమ నమ్మకాన్ని మరింత జోడించి ఠంచనుగా వాటిని పాటిస్తుంటారు. అలాంటి మూఢ విశేషాలేంటో చూద్దాం

అనాదిగా కొన్ని నమ్మకాలు, మరికొన్ని మూఢనమ్మకాలు మన సమాజంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని లాజిక్‌కు కూడా అందవు కానీ అందరూ నమ్ముతారు, కొందరు పాటిస్తారు కూడా. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటివి తగ్గాల్సింది పోయి ఇప్పుడు ఇవి మరింత విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే విడ్డూరం ఏమింటంటే వీటి ప్రచారానికి టెక్నాలజీనే వాడడం. కానీ ఎప్పటికప్పుడు వీటి వెనక ఉన్న అసలు నిజాలను ప్రచారం చెయ్యడం కూడా అంతే అవసరం.

అనాదిగా మానవుడి జీవితం కొన్ని నమ్మకాలతోనే సాగుతోంది. వీటిలో కొన్నింటిని మూఢనమ్మకాలని ఆధునికుటు కొట్టిపారేస్తుంటారు. అందుకు కారణం వాటిలో కొన్ని సైన్స్ కు తర్కానికి చిక్కకుండా నమ్మకాలుగా చలామణిలో ఉన్నాయి. వీటిలో కొన్ని మతం ప్రాతిపదికన, కొన్ని సంస్కృతిలో భాగంగా, కొన్ని ప్రాంతాన్ని బట్టీ ఉంటుంటాయి. అందుకే తర్కరహితంగా కనిపిస్తుంటాయి.

కన్ను అదరటం

కన్ను అదిరితే కొన్ని సార్లు మంచిదని కొన్ని సార్లు చెడుకు సంకేతమని అంటుంటారు. మళ్లీ ఇది ఏ కన్ను అదురుతోంది, స్త్రీ పురుష బేధాలు కూడా ఉంటాయి. ఈ కన్నుఅదరటాన్ని సాహిత్యంలోనూ, పాటల్లోనూ వాడటం మనందరికీ పరిచితమే. కన్ను అదరడానికి చాలా రకాల శాస్త్రీయ కారణాలను వివరించినా సరే ఈ నమ్మకం అలా కొనసాగుతూనే ఉంది. కన్ను అదిరేందుకు కళ్లు పొడిబారడం, కంటిలో అలెర్జీ, నీరసం, ఒత్తిడి, ఆల్కాహాల్ తీసుకోవడం వంటి లాజికల్ కారణాలు అనేకం ఉన్నాయి. అయినా కన్ను అదిరిందని శుభ సూచకమని సంతోషించేవారు, అశుభం జరగుతుందేమో అని కంగారు పడేవారు నిత్యం మనకు కనిపిస్తుంటూనే ఉంటారు.

వేలాడే నిమ్మకాయలు, మిరపకాయలు

మన సమాజంలో దురదృష్టాన్ని ఇచ్చే దేవత అలక్ష్మి. ఈమెకు కారంగా, పుల్లగా ఉండే ఆహారాలు ఇష్టమైనవనే నమ్మకం. అందుకే చాలా మంది తమ వాహనాలకు, వ్యాపార ప్రదేశాల ముఖద్వారాలకు మిరపకాయలు, నిమ్మకాయలు దారానికి గుచ్చి వెలుపలి వైపు వేలాడ దీస్తుంటారు. అలక్ష్మీ అక్కడే తనకు ఇష్టమైన ఆహారం తినేసి సంతృప్తి పడి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని ఒక నమ్మకం. ఈ నమ్మకానికి మనం ఎటువంటి శాస్త్రీయ కోణంలోనూ చూడలేము. దీన్ని మూఢనమ్మకం అని తీసి పారెయ్యవచ్చు.

నల్లపిల్లి అడ్డురావడం

నల్ల పిల్లి అపశకునమనే నమ్మకం మన దేశంలో మాత్రమే కాదు పాశ్చత్య సంస్కృతిలో కూడా చలామణిలో ఉంది. ఈజిప్షియన్లు నల్ల పిల్లిని అపశకునంగా భావిస్తారు. ఇక మనవాళ్లకు నలుపు శనికి సంబంధించిన రంగు. నల్లపిల్లి ఎదురుపడితే వెంటనే మీకంటే ముందు మరొకరు వెళ్లిపోయే వరకు ఆగాలని అంటుంటారు. ఎందుకంటే నల్లపిల్లి ఎదురవడం మంచి శకునం కాదని చాలా గట్టిగా విశ్వసిస్తారు. దీని వెనుక కూడా ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు.

దిష్టి చుక్క

మన దేశంలో చాలా మంది పసిపిల్లలకు కణత దగ్గర నల్లని చుక్క పెడుతుంటారు. దీనిని దిష్టి చుక్క అంటుంటారు. పిల్లలు సున్నితంగా ఉంటారు కనుక ఎవరి చెడు దృష్టి వీరి మీద ప్రభావం చూపకూడదనేది దీని వెనకున్న భావం. చెడు దృష్టి పిల్లల ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని నమ్ముతారు. కణత దగ్గర నల్లని చుక్క పెట్టడం వల్ల పిల్లలు అందంగా కనిపించక పోవడం వల్ల దుష్టశక్తులు వీరి జోలికి రావనేది దిష్టి చుక్క ఉద్దేశ్యం. కొంత మంది పెద్ద వాళ్లు కూడా తమ అరికాలులో కాటుక చుక్క పెట్టుకుంటారు దిష్టి తగలకుండా. అసలు దిష్టి తగలడం అనే విషయానికే శాస్త్రీయ ఆధారాలు లేవు. కనుక దాన్ని నివారించేందుకు పెట్టే దిష్టి చుక్కకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం అసలు లేదనేది నిజం.

అద్దం పగలడం

అద్దం పగిలితే అది దురదృష్టంగా భావిస్తారు. ఒకవేళ అనుకోకుండా పగిలిని అద్దంలో ముఖం కనిపించడాన్ని చెడుకు సంకేతంగా భావిస్తారు. అందుకే పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకోవద్దని పెద్దవాళ్లు గట్టిగా చెబుతారు. దీనిలోని అసలు నిజాలను ఊహించడం కష్టమేమి కాదు. నిజానికి పగిలిన అద్దాలు ప్రమాదాలకు కారణం కావచ్చు అందువల్ల వీటిని ఎప్పటికప్పుడు తీసి బయట పడెయ్యడం అవసరమనేది దీని వెనకున్న లాజిక్. అది ఆలోచించకుండా అనవసరపు భయాలు పెంచుకోవడం అవసరం లేదు. ఇలా ఎన్ని కారణాలు వివరించినా సరే నమ్మకాలు సమాజంలో విరివిగా చలామణిలో ఉంటూనే ఉన్నాయి.

బూజుపట్టిన నమ్మాలే శాసిస్తున్నాయి

ప్రకృతిలో ఏది ఎందుకు జరుగుతోందో తెలియని కాలంలో మనుషులు మానవాతీత శక్తులను ఊహించుకున్నారు. ఉరుము ఉరవడానికి, మెరుపు మెరవడానికి, నింగి నుంచి నీటిచుక్క నేలకు దిగడానికి కారణమేంటో తెలియక ఏవేవో కల్పనలతో తమనుతాము సమాధాన పరచుకున్నారు. కాలగమనంలో శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రకృతి రహస్యాలు క్రమంగా అందరికీ తేటతెల్లమయ్యాయి. అయినప్పటికీ బూజుపట్టిన నమ్మకాలు మాత్రం మనిషి మెదడులోంచి బయటికి పోవడంలేదు. అతీంద్రియ శక్తులపై గుడ్డినమ్మకాలు- మానవ సహజ ప్రతిభాసామర్థ్యాలను వికసించనీయవు. సరికదా, మనిషిని ఇంకా వెనక్కి ఛాందస మధ్యయుగాల చీకట్లలోకి లాక్కుపోతాయి.

చదివేస్తే ఉన్న మతి పోయినట్లు!

ఉన్నత విద్యావంతులు సైతం అహేతుక విశ్వాసాలతో జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. అయినవారి ప్రాణాలూ తీస్తున్నారు. ఆమధ్య మదనపల్లెలో కన్నబిడ్డలను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లిదండ్రులు బాగా చదువుకుని ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవాళ్లే. కానీ, మానసిక దౌర్బల్యంతో చిత్తభ్రమలకు లోనై కడుపుకోతను మిగుల్చుకున్నారు. జబ్బుచేస్తే ఆసుపత్రికి వెళ్లడం మానేసి పూజలూ ప్రార్థనల్లో మునిగిపోతున్నవారూ కోకొల్లలు. మాంత్రికులమంటూ చలామణీ అవుతూ కాసులు దండుకునే చిల్లర మనుషులను, నాటువైద్యాలను ఆశ్రయిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన పందొమ్మిదేళ్ల యువతి అనారోగ్యం పాలైంది. ఆమెను ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లాడు తండ్రి. ఆ మూర్ఖుడేమో జబ్బు తగ్గిస్తానంటూ ఆ అమ్మాయి తలలో దాదాపు 70 సూదులు గుచ్చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన ఆమెను వైద్యులు చాలా శ్రమించి రక్షించారు. చాలా చోట్ల ఇలాంటి తంతులే జరుగుతున్నాయి. శాస్త్రీయ స్ఫూర్తికి మన్నన దక్కని మన సమాజంలో అమాయకుల ప్రాణాలెన్నో మూఢనమ్మకాలకు బలవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న వీడియోలు అనేకం ఇలాంటి మతిమాలిన విషయాలనే బోధిస్తున్నాయి. ఫలానా పని చేస్తే అదృష్టం కలిసి వస్తుందంటూ మానవ సహజ బలహీనతలను రెచ్చగొట్టి అవి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రజల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని పెంచాల్సిన ప్రభుత్వాలేమో ఆ మాటనే మర్చిపోతున్నాయి. ఇలా ఎన్నో మరెన్నో మూఢ నమ్మకాల పేరిట సమాజాన్ని మరింత వెనక్కి వెళ్ళేందుకు కారణాలవుతున్నాయి

సమాజంలో మనిషి మనుగడ ఒక్కతాటిపై ఉండదు. ఒకరిది భౌతికవాదమైతే, మరికొందరిది అశాస్త్రీయ వాదం. ఎవరి నమ్మకం వారిది. తమకు నచ్చింది నమ్మడం, అనుసరించడం కూడా పౌర హక్కుల్లో ఒక భాగమే. కానీ పరుగుల పెట్టే దైనందిన జీవితాల్లో కొన్ని అశాస్త్రీయమైన నమ్మకాలు మన జీవితానికి అడ్డంకులుగా మారకూడదు. అందుకే, ఏవిషయాన్నైనా ఎంత వరకు నమ్మాలో, ఆచరించాలో అంత వరకే. అప్పుడే ఆ నమ్మకం వొమ్ముకాకుండా ఉంటుంది.

వెంటాడే ‘మూఢ’ నమ్మకాలు - Tholi Paluku