Let's talk: editor@tmv.in
వెంటనే ఇరాన్‌ను వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

వెంటనే ఇరాన్‌ను వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

Shaik Mohammad Shaffee
24 ఫిబ్రవరి, 2026

ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయ పౌరులందరూ వెంటనే సురక్షితంగా బయటపడాలని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని సూచించింది.

జనవరి నుంచే హెచ్చరికలు

ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది జనవరి 5, 14 తేదీల్లో సూచనలు జారీ చేసింది. ఆ హెచ్చరికలను తాజాగా పునరుద్ధరిస్తూ, ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు అక్కడి నుంచి బయటకు రావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అక్కడే ఉండాల్సి వస్తే, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక మీడియా అప్‌డేట్స్‌ను గమనిస్తూ ఎంబసీతో నిరంతరం టచ్‌లో ఉండాలని సూచించింది.

నిరసనలతో అట్టుడుకుతున్న విశ్వవిద్యాలయాలు

జనవరిలో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత, ఒక నెల విరామం అనంతరం తిరిగి తెరుచుకున్న విశ్వవిద్యాలయాల్లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, షరీఫ్ టెక్నాలజీ, అమీర్‌కబీర్, షాహిద్ బెహెష్తి వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో వేలాది మంది విద్యార్థులు వరుసగా రెండో రోజూ ప్రభుత్వంపై నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు (బసిజ్ దళాలు) మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వర్సిటీల పరిసరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. జనవరి 8, 9 తేదీల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో వేల మంది మరణించారని, ప్రభుత్వం ఇంటర్నెట్‌ను సైతం నిలిపివేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

అత్యవసర సహాయం కోసం

ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అక్కడి వెబ్‌సైట్ (https://www.meaers.com/request/home) ద్వారా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఒకవేళ అక్కడ ఇంటర్నెట్ లేక నమోదు చేయడం సాధ్యపడకపోతే, భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు ఈ పని పూర్తి చేయాలని కోరింది. ఏదైనా సహాయం కోసం +989128109115, +989128109109, +989128109102, +989932179359 అనే ఫోన్ నంబర్లకు లేదా cons.tehran@mea.gov.in అనే ఈమెయిల్ అడ్రస్‌కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. దేశంలో కొనసాగుతున్న నిరసనలు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత, అలాగే అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అక్కడ అశాంతి నెలకొంది. ఈ గొడవల్లో వేల సంఖ్యలో విద్యార్థులు, చిన్నారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై కచ్చితమైన గణాంకాలు వెల్లడించడంలేదు.