Let's talk: editor@tmv.in
వెంగళరావునగర్‌లో హైడ్రా చర్యలు: రూ.600 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

వెంగళరావునగర్‌లో హైడ్రా చర్యలు: రూ.600 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

Gaddamidi Naveen
19 మార్చి, 2026

హైదరాబాద్ నగరంలో మరో కీలక భూమి ఆక్రమణ వ్యవహారంపై హైడ్రా కఠిన చర్యలు చేపట్టింది. ఖైరతాబాద్ మండలంలోని వెంగళరావు నగర్‌లో ఉన్న సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మార్కెట్ దీని విలువ సుమారు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కబ్జాదారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పక్కా ఆధారాలతో హైడ్రా ఈ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ భూమి నేపథ్యం పరిశీలిస్తే, 1975కి ముందే సంబంధిత వ్యక్తులకు పరిహారం చెల్లించి మొత్తం 45 ఎకరాలను హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. ఇందులో 660 ప్లాట్లతో లేఅవుట్ రూపొందించగా, పార్కులు, ప్రజా అవసరాల కోసం కొంత భూమిని కేటాయించారు. వెంగళరావు నగర్ ప్రధాన రహదారి పక్కన 5 ఎకరాలను ప్రత్యేకంగా ఖాళీగా ఉంచారు. అయితే, కాలక్రమేణా అందులో 2 ఎకరాలు ఆక్రమణలకు గురై శాశ్వత నిర్మాణాలు వెలిశాయి.

మిగిలిన 3 ఎకరాల భూమిపై కూడా పలువురు తమదేనని చెప్పుకుంటూ వివాదం సృష్టించారు. హౌసింగ్ బోర్డు నుంచి ఇప్పటికే పరిహారం పొందిన వారు, మరోవైపు రామస్వామి, అతని వారసులు, అలాగే డేవిడ్ రాజు, దేవసహాయం వంటి వ్యక్తులు తప్పుడు పత్రాలతో హక్కులు పోందారు. మరో గ్రూప్ రహ్మతుల్లా వారసుల ద్వారా కొనుగోలు చేశామని చెప్పగా, కొందరు జాగీర్దార్ లక్ష్మణరావు పేరు ప్రస్తావించారు. అయితే అధికారిక రికార్డుల్లో వీటికి ఆధారాలు లభించలేదు.

ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టు స్టే ఉన్నప్పటికీ, అక్కడ గుడిసెలు, షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహించడం కొనసాగింది. స్థానికుల ఫిర్యాదులు, మీడియా కథనాల నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అన్ని వర్గాలతో సమావేశమై పత్రాలు పరిశీలించగా సరైన ఆధారాలు లేవని తేల్చారు. దీంతో బుధవారం ఆక్రమణలను తొలగించి, 3 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ చర్యతో నగరంలో విలువైన ప్రభుత్వ భూములను రక్షించడంలో హైడ్రా మరో అడుగు ముందుకు వేసినట్లు అధికారులు తెలిపారు.

వెంగళరావునగర్‌లో హైడ్రా చర్యలు: రూ.600 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం - Tholi Paluku