
వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ౦ కీలక చర్యలు- మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ
లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వృద్దుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఒక ఎమ్‌పి అడిగిన ప్రశ్నకు, సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ ప్రకారం, భారతదేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాను దృష్టిలో ఉంచుకుని, వారి కోసం దీర్ఘకాలిక సంరక్షణ అసిస్టెడ్ లివింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం, 60 ఏళ్లు పైబడిన వారిలో 23.8 శాతం మంది కనీసం ఒక రకమైన శారీరక పరిమితితో ఇబ్బంది పడుతూ ఇతరుల సహాయం కోరుకుంటున్నారు. ఈ అవసరాలను తీర్చడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వివిధ సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేస్తోందన్నారు.
అటల్ వయో అభ్యుదయ యోజన అనే గొడుగు పథకం ద్వారా వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 705 వృద్ధాశ్రమాలు, 13 నిరంతర సంరక్షణ కేంద్రాలు, పలు మొబైల్ మెడికేర్ యూనిట్లకు గ్రాంట్లు అందిస్తున్నారు. దీనివల్ల నిరాశ్రయులైన వృద్ధులకు సురక్షితమైన నివాసం, పౌష్టికాహారం, తక్షణ వైద్య సేవలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
వృద్ధాప్య రీత్యా వచ్చే శారీరక వైకల్యాలను అధిగమించడానికి రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఎంతగానో తోడ్పడుతోంది. ఈ పథకం ద్వారా వినికిడి యంత్రాలు, కంటి అద్దాలు, కృత్రిమ దంతాలు, నడవడానికి సహాయపడే పరికరాలను అర్హులైన వృద్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 7.93 లక్షల మంది వృద్ధులు ఈ సహాయక పరికరాలను పొంది తమ దైనందిన జీవితాన్ని మెరుగుపరుచుకున్నారని మంత్రి తెలిపారు.
వృద్ధులకు ఇంట్లోనే నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం ‘పిఎమ్ -స్పెషల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా వృద్ధుల సంరక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన 'కేర్‌గివర్స్' బృందాన్ని తయారు చేస్తున్నారు. దీనితో పాటు, వృద్ధులకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా మానసిక మద్దతు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి 'ఎల్‌డర్‌లైన్' (14567) అనే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రభుత్వం నిరంతరం నిర్వహిస్తోందని మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ స్పష్టం చేశారు.
వృద్ధుల సామాజిక భద్రత కోసం చట్టపరమైన రక్షణను ప్రభుత్వం పటిష్టం చేసింది. 2007 నాటి వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం ప్రకారం, మెయింటెనెన్స్ ట్రిబ్యునళ్లు వృద్ధుల దరఖాస్తులను 90 రోజుల్లోపు పరిష్కరించి వారికి న్యాయం చేకూరుస్తున్నామని సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
