Let's talk: editor@tmv.in
వృద్ధులకు ‘వేములవాడ’ దర్శనం: కలెక్టర్ ఆదేశం

వృద్ధులకు ‘వేములవాడ’ దర్శనం: కలెక్టర్ ఆదేశం

Gaddamidi Naveen
8 జనవరి, 2026

జిల్లాలోని సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఇన్‌చార్జ్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మండేపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని ఆమె బుధవారం సందర్శించి, అక్కడ నివసిస్తున్న వృద్ధులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మానవీయతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా త్వరలో వేములవాడలో నిర్వహించనున్న శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు వృద్ధులను తీర్థయాత్రగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్ధులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా వారి మానసిక ఆనందం, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొంది. వృద్ధుల సంక్షేమమే జిల్లా పరిపాలనకు ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు.

అనంతరం తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లిలో నిర్మాణంలో ఉన్న బాలల గృహం పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొని, పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పిల్లలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, పిల్లలు వంటి బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని, సమగ్ర అభివృద్ధి దిశగా జిల్లా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ భరోసా ఇచ్చారు.