
వృద్ధాప్యం ఒక స్వర్ణ యుగం
ఒకప్పుడు కుటుంబానికి ఆధారంగా నిలిచిన తల్లిదండ్రులు, సమాజం కోసం జీవితమంతా కష్టపడ్డ యువకులు కాలం గడిచేకొద్దీ వృద్ధులు. కుటుంబ వృద్ధికి, సమాజ శ్రేయస్సుకు పనిచేసిన వారు ఇప్పుడు చేతులు కాళ్లు పనిచేయని స్థితిలో తమని తాము పోషించుకోలేనపుడు ఎవరయినా అండగా ఉంటారా? అంటే కొంచెం అనుమానమే. కొంచెం ఆదరణ, కాస్త సానుభూతి, కొద్దిపాటి గౌరవం వంటి చిన్న విషయాలు పెద్దలకు అత్యవసరమైన ఔషధాలు. కానీ ఈరోజుల్లో అదొక లగ్జరీగా మారింది. ఇందుకు ఎవరినీ తప్పు పట్టలేము. సమాజ స్థితిగతులు అలా మారిపోయాయి. ప్రతీ ఒక్కరికీ సమయాభావం, అంతా సమయం లేని నిరుపేదలే.
వృద్ధాప్యం అంటే సొంత శరీరమే ద్రోహం చేసే వయసు. నెరిసిన జుట్టు మాత్రమే కాదు, అవయవాలు మెల్లమెల్లగా నిర్వీర్యమవడమే వయసు మళ్లడం. కాళ్లు నడవవు, చేతులు వణుకుతాయి, చూపు మందగిస్తుంది, చెవులు వినేందుకు మొరాయిస్తాయి. ఆర్థ్రైటిస్, పార్కిన్‌సన్స్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, డిమెన్షియా వంటివన్నీ వయసు పెరిగే కొద్దీ చుట్టుముట్టే శత్రువులుగా మారి వారిని శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా దెబ్బతీస్తుంటాయి. మన మెదడే మనకు సహకరించకపోవడం అంటే జీవితం నరకంగా, ఒక శాపంగా మారడం. ఇంతటి నిస్సహాయతలో గౌరవం కోసం ఆరాటం, జీవితమో పోరాటం.
వృద్ధాశ్రమాలు ఏం చెయ్యగలవు?
పెద్దవాళ్లను కనిపెట్టుకుని ఉండే అవకాశం లేని వారే ఈ కాలంలో ఎక్కువ మంది. ఎవరి జీవితాల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. అందుకే వృద్ధాశ్రమాలు అవసరమయ్యాయి మన సమాజానికి. అయితే ఇవి నిజంగా వృద్ధుల అన్ని అవసరాలు తీర్చగలుగుతున్నాయా? అని కచ్చితంగా అడిగితే లేదనే చెప్పాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్నవృద్ధాశ్రమాలు చాలావరకు ఆహారం, నివాసం వరకు మాత్రమే పరిమితం. వృద్ధులకు అవసరమయ్యేది 24 గంటల వైద్య సహాయం, పేలియేటివ్ కేర్ (నొప్పి తగ్గించే చికిత్స) వంటివి శారీరక అవసరాలైతే, ఆదరణ, గౌరవం, ప్రేమతో పరిస్థితులు వారికి తీరాల్సిన మానసిక అవసరాలు. ఇవి తీరే మార్గాలు కనిపించక, సదుపాయాలు లేక చాలామంది వృద్ధులు నిశ్శబ్దంగా బాధపడుతూ, చివరికి ఒకే కోరిక చెప్తారు “నాకు శాంతిగా, నొప్పిలేకుండా మరణం కావాలి.” ఇది వారి బలహీనత కాదు. ఇది గడిపిన జీవితం కాలపు అలసట. చివరి విముక్తి కోసం మానవ హృదయం నివేధించుకునే కోరిక.
అయితే దాదాపు అందరం ఏదో ఒక సమయానికి కచ్చితంగా వృద్ధాప్యపు లోగిలి ముందు నిలబడాల్సిందే. మరికొంత కాలానికి ఆ గడపదాటాల్సిందే. మరి వృద్ధాప్యాన్ని కూడా జీవితపు మిగతా అంకాల మాదిరిగానే ఉత్సాహంగా దాటడం సాధ్యం కాదా? అలా వృద్ధాప్యం ఉత్సాహంగా గడిచేందుకు కుటుంబం మాత్రమే కాదు, ఇటు సమాజం, అటు ప్రభుత్వం ఏం చేస్తే బావుంటుంది?
ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో అత్యధిక యువజనాభా కలిగిన దేశం. అంటే రాబోయే దశాబ్ధాలలో వృద్ధ జనాభా పెరుగుదల అనివార్యం అని అర్థం. ఈ సామాజిక మార్పుకు దేశం సిద్ధం కావల్సి ఉంది. పెరుగుతున్న ఆయుర్ధాయం, మెరుగైన ఆరోగ్య సంరక్షణాసదుపాయాలు, పెర్టిలిటీ రేట్ తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో ఈ పరిణామాలు జరగబోతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనాల ప్రకారం భారతదేశంలో 60 సంవత్సరాల వయసు దాటిన జనాభా 2050 నాటికి 34.7 కోట్ల వరకు చేరవచ్చు. అంటే ప్రతీ ఐదుగురిలో ఒకరు సీనియర్ సిటిజన్ గా ఉంటారన్న మాట. ఈ లెక్కలు వృద్ధ జనాభా కోసం సంక్షేమం, ఆరోగ్యం, భద్రత వంటి వాటి కోసం ప్రత్యేక విధానల రూపకల్పన చెయ్యాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.
వృద్ధుల సంక్షేమం – సవాళ్లు
పెరిగే వృద్ధ జనాభా సమాజానికి భారంగా పరిణమిస్తుందేమో చెప్పలేము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆర్థిక అభద్రను ఎదుర్కోబోతున్నారు. చాలా మందికి క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం లేదా పెన్షన్ వంటి ఆర్థిక సదుపాయాలు అందుబాటులో లేవు. మనదేశంలో వృద్ధుల్లో ఐదవ వంతు కంటే ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారని చెప్పవచ్చు. 18.7 శాతం మందికి అసలు ఎటువంటి ఆదాయం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడం వల్ల వృద్ధాప్యంలో వారు ఆర్థికంగా మరింత బలహీనులు కాబోతున్నారు.
సదుపాయాల కొరత
వృద్ధాప్యం సహజంగానే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరమయ్యే వయసు. వృద్ధుల సంరక్షణ (జీరియాట్రిక్ కేర్) సదుపాయాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, వైద్య చికిత్స ఖర్చులు పెరగడం. దీర్ఘకాలిక సంరక్షణ కేంద్రాల కొరత ప్రధాన సమస్యలు. మానసిక ఆరోగ్యం కూడా వృద్ధుల ఆరోగ్యంలో ముఖ్యమైన అంశం దీని గురించిన అవగాహన నామమాత్రమే.
ఒంటరితనం
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం వల్ల వృద్ధులు ఒంటరితనం, నిర్లక్ష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధులపై వేధింపులు హింస కేసులు కూడా నమోదవడం పెరిగింది. వృద్ధులకు కుటుంబాల నుండి లేదా సమాజం నుండి తగిన గౌరవం, ఆదరణ పొందలేకపోతున్నారు.
చట్టాలేం చెబుతున్నాయి?
వృద్ధుల సంక్షమం కోసం రూపొందించిన ప్రభుత్వ విధానాలు, చట్టాల అమలులో చాలా లోపాలు ఉన్నాయి. తల్లిదండ్రులు. సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 (మెయింటెనెన్స్ అండ్ విల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్2007) అమలులో మరింత శ్రద్ధ అవసరం. వారి కోసం రూపొందించిన పథకాల గురించి వృద్ధులకు అవగాహన లేకపోవడం లబ్ధి పొందెందుకు పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పాలి.
అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది...
ప్రభుత్వం ఇప్పటికే వృద్ధుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటిని మరింత బలోపేతం చెయ్యాల్సి ఉంది.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ): దీని ద్వారా వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నారు. వీటి మొత్తాన్ని పెంచడం మరియు అర్హత ప్రమాణాలను సరళీకరించడం ముఖ్యం.
ప్రధాన మంత్రి వయో వందన యోజన (పీఎమ్వీవీవై): ఇది వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది. ఈ పథకంపై అవగాహన పెంచాలి.
పనిచేసే వృద్ధుల ప్రయోజనం (వర్కింగ్ ఏజ్ బెనిఫిట్): వృద్ధులు కూడా వారి అనుభవాన్ని, నైపుణ్యాలను ఉపయోగించుకునే వీలు కల్పించాలి. పార్ట్టైమ్ ఉద్యోగాలు లేదా నైపుణ్య ఆధారిత పనుల కోసం ప్రోత్సహించాలి.
వృద్ధుల జాతీయ కార్యక్రమం: ఈ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వృద్ధుల సంరక్షణ విభాగాలను (జీరియాట్రిక్ డిపార్ట్మెంట్స్) ఏర్పాటు చేయాలి.
ఇంకెమేమి చెయ్యవచ్చు?
ఆయుష్మాన్ భారత్: ఆరోగ్య బీమా ద్వారా వృద్ధులకు ఆర్థిక భారం తగ్గించాలి. దీర్ఘకాలిక వ్యాధులకు ఇంటి వద్ద సంరక్షణ (హోమ్ బేస్డ్ కేర్ ) సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మానసిక ఆరోగ్యం: వృద్ధులలో ఒంటరితనం డిప్రెషన్‌ను ఎదుర్కోవడానికి కమ్యూనిటీ-స్థాయి కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
వృద్ధాశ్రమాలు పగటి సంరక్షణ కేంద్రాలు (డేకేర్ సెంటర్లు): వీటిని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలలో వృద్ధులకు ఒకచోట సమావేశం అయ్యేందకు అవకాశం ఏర్పడుతుంది. కొంత వినోదం కలిసిన ఆరోగ్యం అందించే కార్యక్రమాల రూపకల్పన మీద దృష్టి సారించాలి.
వృద్ధుల ముఖ్యమైన మానసిక సమస్య ఒంటరితనం. దాన్ని నివారించేందుకు సమాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా వారి జీవితానుభవం సమాజానికి అందించేలా స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రోత్సహించాలి. వృద్ధులకు యువతకు తరాల మధ్య సంబంధాలను (ఇంటర్ జనరేషనల్ బాండింగ్) పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలి.
చట్టాల పటిష్ట అమలు తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
డిజిటల్ సాధికారత
వృద్ధులకు ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు ఇతర సమాచారాన్ని సులభంగా అందించడానికి డిజిటల్ అక్షరాస్యత పెంచాలి. వృద్ధులు కంప్యూటర్ ఇంటర్నెట్ వినియోగంలో చురుకుగా నిమగ్నమయ్యేలా కమ్యూనిటీ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి.
గౌరవప్రదమైన మరణం – ఒక కొత్త చర్చ
ప్రపంచంలోని కొన్ని దేశాలు యుథెనేషియా (స్వచ్ఛంద మరణం)పై చట్టబద్ధంగా చర్చలు ప్రారంభించాయి. అది దుర్వినియోగం కాకుండా, వైద్యుల పర్యవేక్షణలో, నిజమైన బాధితులకు మాత్రమే అందించే విధంగా ఉండాలి. మన దేశంలో కూడా “గౌరవప్రదమైన మరణం” అనే అంశంపై చర్చ జరగాలి.జీవితానికి మాత్రమే కాదు మరణానికి ఒక గౌరవంగా ఉండాలి అంటే, చివరి క్షణమూ గౌరవప్రదంగా గడవాలి.
వృద్ధులు మన సమాజానికి మూలాలు. ఆ మూలాలను మనం వదిలేస్తే, మన సాంస్కృతిక, సామాజిక విలువలు వాడిపోయినట్లే. వారి బాధలు తగ్గించే వసతులు ఇవ్వటం, ప్రేమతో చూడటం, గౌరవప్రదమైన జీవితం ఇవ్వటం మన కర్తవ్యం. వారు జీవించాలనుకున్నా గౌరవంతో బ్రతికే హక్కు ఉండాలి. ఇవ్వాల్సినంతా ప్రపంచానికి ఇచ్చేసి, మనస్పూర్తిగా బతికేసి అంతే ఆత్మానందంతో చావాలనుకున్నాసరే శాంతిగా, అనాయాసంగా నిష్క్రమించే హక్కును సైతం మనం వారికి ఇవ్వగలిగే సదుపాయం ఉండాలనేది కొత్తగా చర్చించాల్సిన విషయం. ఇది కేవలం ఓ న్యాయపరమైన ప్రశ్నమాత్రమే అనుకుంటే పొరపాటు ఇది మానవత్వపు పరీక్ష.
