Let's talk: editor@tmv.in
వృక్షమాత పద్మశ్రీ తిమ్మక్క కన్నుమూత

వృక్షమాత పద్మశ్రీ తిమ్మక్క కన్నుమూత

Shaik Mohammad Shaffee
15 నవంబర్, 2025

ప్రకృతితో ఐక్యంగా జీవించి, వేలాది వృక్షాలను తన పిల్లలుగా పెంచిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత 'సాలుమరద' తిమ్మక్క 114 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో పర్యావరణ ఉద్యమానికి, ప్రకృతి పరిరక్షణకు తీరని లోటు ఏర్పడింది.

1911, జూన్ 30న కర్ణాటకలోని తుమకూరు జిల్లా, గుబ్బి తాలూకాలో తిమ్మక్క జన్మించారు. శ్రీ బిక్కల చిక్కయ్యను వివాహం చేసుకున్న ఆమెకు, వివాహమైన సుమారు 20-25 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. ఒకానొక సమయంలో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించినా, ఆ బాధను అధిగమించి, మొక్కలనే తమ సొంత బిడ్డలుగా పెంచాలని దంపతులిద్దరూ నిర్ణయించుకున్నారు.

తిమ్మక్క తన భర్త సహాయంతో కర్ణాటక గ్రామీణ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. హుళికల్-కుదూర్ మధ్య 4.5 కిలోమీటర్ల పొడవున 400లకు పైగా మర్రి మొక్కలను నాటి, వాటికి నీళ్లు పోయడం కోసం ప్రతిరోజు నాలుగు కిలోమీటర్ల వరకు కష్టపడి నీటిని మోసుకెళ్లేవారు. 65 ఏళ్ల కాలంలో వేలాది వృక్షాలను నాటి, వాటి సంరక్షణకు ధారపోశారు. వృక్ష సంరక్షణకు ఆమె చేసిన ఈ నిస్వార్థ సేవకు గుర్తుగా ఆమె 'సాలుమరద', 'వృక్షమాత'గా ప్రసిద్ధి చెందారు.

ఆమె చేసిన నిస్వార్థ సేవలకుగాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. హంపీ విశ్వవిద్యాలయం నుండి నడోజా అవార్డు (2010), జాతీయ పౌర పురస్కారం (1995), ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు (1997)తో కలిపి మొత్తం 12 అవార్డులు ఆమె అందుకున్నారు.

రాజకీయ నాయకుల సంతాపం

ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన సంతాప సందేశంలో, "సాలుమరద తిమ్మక్క మరణ వార్త విని నేను తీవ్రంగా బాధపడ్డాను. వేలాది మొక్కలను నాటి, వాటిని సొంత బిడ్డల్లా పెంచి, తన జీవితంలో ఎక్కువ భాగాన్ని పర్యావరణ పరిరక్షణకే అంకితం చేశారు," అని అన్నారు. తిమ్మక్క స్వర్గస్తులైనప్పటికీ, పర్యావరణంపై ఆమెకున్న ప్రేమ ఆమెను అమరురాలిగా చేసిందని అన్నారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప, కర్ణాటక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు రాజకీయ నాయకులు తిమ్మక్క మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సాలుమరద తిమ్మక్క చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది, ఆమె నాటిన వేలాది చెట్లు ఆమె స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తూనే ఉంటాయి.

వృక్షమాత పద్మశ్రీ తిమ్మక్క కన్నుమూత - Tholi Paluku