Let's talk: editor@tmv.in
వీరశైవ, లింగాయత్

వీరశైవ, లింగాయత్

Aravind Maryada Reddy
8 అక్టోబర్, 2025

కర్ణాటకలో మరోసారి కులాల కుంపట్లు రాజుకున్నాయి. వీరశైవులు, లింగాయత్‌ల మధ్య చిచ్చు రేగినట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో ఈ రెండు బలమైన సామాజికవర్గాలుగా ఉన్నాయి. అయితే తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని ఎప్పటి నుంచో లింగాయత్‌లు కోరుతున్నారు. కానీ వీరశైవులు మాత్రం హిందూ మతంలో భాగంగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కులగణన, ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి.

కులగణనతో మొదలైన చిచ్చు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కులగణన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగానే వీరశైవ, లింగాయత్ ఈ రెండు ఒకే మతాలా? లేదంటే వేర్వేరు మతాలా? అన్న చర్చ జరుగుతోంది. తాజాగా కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర ఈ సున్నితమైన అంశాన్ని మరోసారి లేవనెత్తారు. వీరశైవం, లింగాయత్ ఈ రెండు మతాలు ఒక్కటేనా? లేదా? వేర్వేరుగా ఉన్నాయా? అన్న విషయం స్పష్టం చేయాలి. ఈ విషయంపై ఆయా సమాజాల నుంచి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘లింగాయత్‌లు, వీరశైవులు ప్రతిరోజూ పరస్పరం తాము వేర్వేరుగా ఉన్నామని చెబుతూ ఉంటారు. అందుకే ఈ విషయంపై స్పష్టత రావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

సిద్దరామయ్య ఏమన్నారు?

ఇటీవల ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ అంశంపై మాట్లాడుతూ.. లింగాయత్ మతం ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించారు. కులవివక్షను లేకుండా చేసేందుకు బసవేశ్వరుడు లింగాయత్ మతాన్ని స్థాపించారని గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో వివాదం రాజుకున్నది. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ముఖ్యమంత్రి ఈ అంశాన్ని లేవనెత్తారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ వివాదం ఎక్కడ మొదలైంది?

కర్ణాటకలో వీరశైవ, లింగాయత్‌ల మధ్య వివాదం ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్నది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కులగణన చేపట్టడంతో ఈ అంశం తెరమీదకు వచ్చింది. లింగాయత్ మతాన్ని 12వ శతాబ్దంలో బసవణ్ణ (బసవేశ్వర) శైవ సంప్రదాయంలో స్థాపించారు. ఇది కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ, సమానత్వం, వచనభక్తిపై ఆధారపడింది. అయితే లింగాయత్ అనేది హిందూమతంలోనే ఒక భాగంగానే ఉందని తెలుస్తోంది. కానీ లింగాయత్‌లు మాత్రం తమను హిందూ మతంలో భాగంగా కాకుండా, స్వతంత్ర మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరశైవ మతం శైవ సాంప్రదాయంలోనిది. ఈ మతం లింగాయత్ మతం కంటే పాతది. 8వ శతాబ్దం నుంచి ఉన్నట్టు తెలుస్తోంది. వీరశైవులు లింగాయత్‌ను తమ ఉప-సంప్రదాయం చూస్తారు. హిందూ మతంలోనే భాగమని వారు చెబుతుంటారు.

ఎవరి జనాభా ఎంత?

లింగాయత్‌లు కర్ణాటకలో సుమారు 17శాతం జనాభా ఉన్నట్టు సమాచారం. వీరశైవులు సుమారు 10 నుంచి 12 శాతం వరకు ఉన్నారు. 2018లో కర్ణాటక ప్రభుత్వం (కాంగ్రెస్) లింగాయత్‌ను స్వతంత్ర మతంగా సిఫార్సు చేసింది. కానీ అప్పట్లో కేంద్రం తిరస్కరించింది. ఇది రాజకీయంగా కులాల మధ్య చిచ్చు రేపింది. కర్ణాటకలో ఇటీవల (సెప్టెంబర్ 2025) మొదలైన కర్ణాటక సామాజిక, ఆర్థిక కుల గణనలో "వీరశైవ-లింగాయత్" అనే ఒకే క్యాటగిరిని ఉంచారు. దీనిపై లింగాయత్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల తమిళనాడులో సిద్దరామయ్య మాట్లాడుతూ.. "లింగాయత్ స్వతంత్ర మతమే, బసవణ్ణ దాన్ని హిందూ మతం నుంచి వేరుచేయాలని కోరాడు" అని వ్యాఖ్యానించారు. ఇది 2018 వివాదాన్ని మళ్లీ గుర్తు చేసింది. వివాదం చెలరేగడంతో సిద్దరామయ్య వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఈ రెండు సమాజాలు ఏం చెబితే తాను దాన్ని అంగీకరిస్తానని అన్నారు. అయినప్పటికీ వివాదం మాత్రం రాజుకున్నది.

బీజేపీ అభ్యంతరాలు ఏమిటి?

కర్ణాటక బీజేపీ నేతలు (వైజయేంద్ర, బసవరాజ్ బొమ్మై, ప్రహ్లాద్ జోషి మొదలైనవారు) సిద్దరామయ్య‌ను "హిందూ మతాన్ని విభజించడానికి, వీరశైవ-లింగాయత్ మధ్య చిచ్చు పెట్టేందుకు కుల గణనను ఉపయోగిస్తున్నారు" అని ఆరోపించారు. లింగాయత్, వీరశైవుల్లోని మెజార్టీ వర్గాలు మొదటి నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారిలో లింగాయత్‌లను తమ వైపునకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ ఈ తరహా వ్యూహం అవలంభించినట్టు సమాచారం.

వీరశైవులు, లింగాయత్‌ల మద్దతు ఏ పార్టీకి?

కర్ణాటకలో లింగాయత్, వీరశైవ సమాజాలు రాజకీయంగా కీలకమైనవి. ఎందుకంటే వారి ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అయితే, కులగణన డేటా అందుబాటులో లేకపోవడంతో లింగాయత్, వీరశైవులు ఎంత సంఖ్యలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారం లేదు. కానీ కొన్ని అంచనాలు మాత్రం ఉన్నాయి. కర్ణాటక జనాభా సుమారు 6.1 కోట్లు (2021జనాభా లెక్కల ప్రకారం). ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిఉంటుంది. ఇక లింగాయత్, వీరశైవులు కలిపి రాష్ట్ర జనాభాలో 20-25 శాతం ఉన్నట్లు అంచనా. లింగాయత్‌లు, వీరశైవులు రాజకీయంగా కీలకమైన శక్తిగా ఉన్నారు. గతంలో బీజేపీ అధికారంలోకి రావడానికి వీరే కారణమన్నది విశ్లేషకులు అంచనా.

లింగాయత్‌లు ఉత్తర కర్ణాటకలో (బీదర్, బెల్గాం) ఎక్కువగా ఉంటారు. వీరశైవులు మధ్య, దక్షిణ కర్ణాటకలో ఎక్కువ. 1990ల నుంచి బీఎస్ యెడియూరప్ప నాయకత్వం వల్ల వీరి మద్దతు బీజేపీకి దక్కింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఈ రెండు సమూహాల నుంచి గణనీయమైన మద్దతు పొందింది. మొత్తంగా ఈ రెండు వర్గాల మద్దతు బీజేపీకి కాస్త ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

లింగాయత్‌ల మద్దతు బీజేపీకేనా?

కర్ణాటకలో లింగాయత్‌ల మద్దతు బీజేపీకి ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. యెడియూరప్ప, జగదీష్ షెట్టార్ వంటి నేతల వల్ల 2018లో బీజేపీ లింగాయత్ సామాజికవర్గం నుంచి ఓట్లు పడ్దాయి. యెడియూరప్ప రాజకీయాల నుంచి దూరం అయ్యాక బీజేపీకి లింగాయత్‌ల మద్దతు కొంత తగ్గింది. 2018లో లింగాయత్‌ను స్వతంత్ర మతంగా గుర్తించాలని కాంగ్రెస్ సిఫారసు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అప్పటినుంచి లింగాయత్‌లోని కొన్ని వర్గాలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నాయి.

వీరశైవ మద్దతు

వీరశైవులు బీజేపీకి బలమైన మద్దతు ఇస్తారు. ముఖ్యంగా మధ్య కర్ణాటకలో వీరశైవ మహాసభలు హిందూ ఐక్యతను చాటిచెబుతూ ఉంటాయి. లింగాయత్ స్వతంత్ర మత డిమాండ్‌ను వీర బలంగా వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2023లో 34 మంది వీరశైవ-లింగాయత్ ఎమ్మెల్యేలు గెలుపొందారు.

కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?

లింగాయత్‌లు తమను స్వతంత్ర మతంగా గుర్తించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. వీరశైవుల ఓట్లు బీజేపీకి పడ్డా లింగాయత్‌లో మెజార్టీ ఓట్లను తమవైపుకు తిప్పుకొనేందుకే ప్రయత్నిస్తోంది. అయితే కర్ణాటకలో ప్రతీ సారి కుల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయని చెప్పలేం. ఒక్కోసారి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్న కాంగ్రెస్ లింగాయత్, వీరశైవుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. గతంలో బీజేపీ సైతం లింగాయత్, వీరశైవుల రెండు వర్గాలను తన వైపుకు తిప్పుకోగలిగింది. మరి ఈ ప్రభావం కర్ణాటక రాష్ట్రంలో ఎంత మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.

వీరశైవ, లింగాయత్ - Tholi Paluku