
వీరప్పన్ కూడా సరిపోడు.. చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ రాజధాని అంశం హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభలో రాజధాని బిల్లు ఆమోదం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రాజెక్టులో అవినీతి పరిమాణాన్ని అడవి దొంగ వీరప్పన్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా “స్కాంల కేంద్రంగా” మార్చారని పేర్కొన్నారు. నిర్మాణ ఖర్చులు అసాధారణంగా పెంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని ఇతర ముఖ్య నిర్మాణాలతో పోలిస్తే అమరావతి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఉదాహరణకు తెలంగాణ సచివాలయం సుమారు రూ.615 కోట్లతో, ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం సుమారు రూ.970 కోట్లతో నిర్మించబడగా, అమరావతిలో అసెంబ్లీకి రూ.1,400 కోట్లు, హైకోర్టుకు రూ.1,480 కోట్లు, సచివాలయ టవర్స్‌కు రూ.7,700 కోట్లకు పైగా ఖర్చు ప్రతిపాదించడం అనుమానాస్పదమని అన్నారు.
“ఇంత భారీ ఖర్చులు ఎందుకు? భవనాలు బంగారంతో కడుతున్నారా?” అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రతి దశలో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని, దీనిపై ప్రశ్నించే వారిని “అమరావతి వ్యతిరేకులు”గా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. అయితే తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్ట్ ఆర్థికంగా సాధ్యమా అనే అంశంపై చర్చ అవసరమని స్పష్టం చేశారు.
జగన్ తన ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ప్రస్తావించారు. అమరావతి అభివృద్ధికి డీపీఆర్ ప్రకారం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని, భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే 2014–2019 మధ్య సుమారు రూ.5,000 కోట్లు ఖర్చు కాగా, మొత్తం ఏడు సంవత్సరాల్లో రూ.8,000 కోట్ల వరకు మాత్రమే వ్యయం జరిగిందని చెప్పారు. అయితే ఇటీవల సంవత్సరాల్లో భారీగా రుణాలు తీసుకుని కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించడం అనుమానాస్పదమని విమర్శించారు.
రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సిన సమయంలో ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు చేయడం సరైనదా అని జగన్ ప్రశ్నించారు. ఈ విధమైన భారీ ఖర్చులు సంక్షేమ పథకాలు, ఇతర ప్రాంతాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. అమరావతి పేరుతో రుణాలు తీసుకుని స్కాములు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు.
టెండర్ ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగాయని జగన్ ఆరోపించారు. రద్దు చేసిన కాంట్రాక్టులను అదే సంస్థలకు ఎక్కువ ధరలకు మళ్లీ ఇవ్వడం జరిగిందని, దేశంలో సాధారణంగా యూనిట్‌కు రూ.5,000 కన్నా తక్కువ ఖర్చుతో నిర్మాణాలు జరుగుతుండగా, అమరావతిలో రూ.14,000 వరకు టెండర్లు ఇవ్వడం పారదర్శకతపై సందేహాలు కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఇక ప్రత్యామ్నాయంగా జగన్ మూడు రాజధానుల విధానాన్ని మళ్లీ ప్రస్తావించారు. విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అంతేకాకుండా ప్లాన్ బీ లో భాగంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంను కలిపి ఒక సమగ్ర రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు.
మచిలీపట్నంలో ఎమ్ఏ , విజయవాడలో వీఐ , గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకోండి. ‘మావిగూన్’ అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎక్కువ జనాభా ఉండడం, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండడం వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూ.2 లక్షల కోట్ల అంచనా ఖర్చులో కేవలం 10శాతం పెట్టుబడితోనే బలమైన నగరాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
అంతేకాకుండా సభలు చట్టాలు చేయడమే కాదు, వాటిని సవరణ కూడా చేయగలవు అన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అమరావతిని రాజధానిగా చేస్తూ చంద్రబాబు చట్టం చేయగలిగినప్పుడు అదే శాసనసభలో దానిని మారుస్తూ ఎందుకు చట్టం చేయలేరు? చట్టసభలో ఏదైనా సాధ్యమే.. కానీ అమరావతి పేరిట ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని అంటూ ప్రత్యేక చట్టాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారు అని జగన్ అన్నారు.
మొత్తంగా చూస్తే, అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది. జగన్ చేసిన ఆరోపణలు, ప్రభుత్వంపై చేసిన విమర్శలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశాన్ని మరింత కీలకంగా మార్చాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
