Let's talk: editor@tmv.in
‘వీబీ జీ - రామ్‌ జీ’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

‘వీబీ జీ - రామ్‌ జీ’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

Gaddamidi Naveen
4 జనవరి, 2026

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాసనసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ గ్రామీణ్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ చట్టం’ (వీబీ జీ రామ్ జీ చట్టం)ను కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చింది.ఈ వీబీ జీ రామ్ జీ చట్టంని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ శుక్రవారం తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానానికి బీజేపీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయగా, అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు మద్దతు తెలిపాయి.

కొత్త చట్టం.. పేదల పాలిట శాపం: సీఎం

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొత్త చట్టం పేదలు, మహిళా కూలీల హక్కులను దెబ్బతీస్తుందని, అలాగే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని సీఎం విమర్శించారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏలో ప్రస్తుతం ఉన్న నిధుల పంచింపు విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా ఆయన ఆలోచనలను బలహీనపరుస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వడం వల్ల భూమిలేని పేదలకు అన్యాయం జరుగుతుందని, ఉపాధి ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలని సీఎం పేర్కొన్నారు.

పాత చట్టం కింద కేంద్రమే 100 శాతం నిధులు సమకూర్చేదని, కానీ కొత్త విధానంలో రాష్ట్రాలు 40 శాతం భరించాలన్న నిబంధన రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కొత్త చట్టంలోని అనేక నిబంధనలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉన్నాయని సీఎం తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో మొట్టమొదటగా అనంతపురం జిల్లా బండపల్లిలో ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో అమలు చేశారు. పని కల్పించడం ఒక హక్కుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పనిదొరక్క వలసలు వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. పాలమూరు వలసల గురించి అందరికీ తెలిసిందే అని సీఎం తెలిపారు. ఈ కొట్ట చట్టం ప్రకారం 60:40 నిష్పత్తిలో నిధులలో రాష్ట్రానికి సంవత్సరానికి రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు అదనపు భారం పడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు

ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద 266 రకాల పనులు చేపట్టే అవకాశం ఉండగా, కొత్త చట్టంలో భూవికాసం వంటి కొన్ని కీలక పనులను తొలగించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారని సీఎం పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుత పనుల జాబితాను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.వీబీ గ్రామ గ్యారంటీ చట్టం మహిళలకు వ్యతిరేకమని, పనిదినాలు తగ్గించడం వల్ల ముఖ్యంగా పేద మహిళలు తీవ్రంగా నష్టపోతారని సీఎం అన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ లక్ష్యాలు, ఉద్దేశ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు.

తెలంగాణలో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ద్వారా లబ్ధి పొందిన వారిలో 90 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కాగా, వారిలో 62 శాతం మహిళలే అని రేవంత్ రెడ్డి తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టం సామాజిక న్యాయానికి బలమైందని ఆయన అన్నారు.

స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ సభ్యుల అభిప్రాయం కోరినప్పుడు, బీజేపీ సభ్యులు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ మంత్రి డి. అనసూయ సీతక్క సహా కాంగ్రెస్ సభ్యులు ఎంఎన్‌ఆర్‌ఈజీఏకు మద్దతుగా మాట్లాడి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని తప్పుబట్టారు.

అయితే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎ. మహేశ్వర్ రెడ్డి, కొత్త చట్టం ‘గ్రామ్ స్వరాజ్’ భావనను సాకారం చేస్తుందని, వ్యవసాయ సీజన్‌లో పనులకు విరామం ఇవ్వడం ద్వారా రైతులకు కార్మికుల కొరత సమస్యను తగ్గిస్తుందని వాదించారు.

ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీయగా, వాటిపై బీజేపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆ వ్యాఖ్యలను పరిశీలించి, అవసరమైతే రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.