
‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లు గ్రామలకు వ్యతిరేకం: రాహుల్ గాంధీ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 20 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) పథకాన్ని ఒక్క రోజులోనే కూల్చివేసిందని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఏకు బదులుగా తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్) బిల్లును ఆయన “గ్రామాలకు వ్యతిరేకమైన చట్టం”గా అభివర్ణించారు. ఈ కొత్త బిల్లు అసలు సంస్కరణ కాదని, గ్రామీణ పేదల హక్కులను తగ్గించే చట్టమని రాహుల్ విమర్శించారు.
రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందిస్తూ, గురువారం అర్థరాత్రి మోడీ ప్రభుత్వం 20 ఏళ్ల ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని ఒక్క రోజులోనే రద్దు చేసిందన్నారు. హక్కుల ఆధారంగా, అవసరాన్ని బట్టి పని ఇచ్చే పథకాన్ని తొలగించి, ఢిల్లీ నుంచి నియంత్రించే పరిమిత పథకంగా మార్చారని ఆరోపించారు. ఇది రాష్ట్రాలకు కూడా, గ్రామాలకు కూడా వ్యతిరేకమని ఆయన అన్నారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ వల్ల గ్రామాల్లోని కూలీలకు తమ హక్కుల కోసం పోరాడే బలం వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. పని దొరికే అవకాశం ఉండటంతో గ్రామాల నుంచి వలసలు తగ్గాయని, జీతాలు పెరిగాయని, పని పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పారు. అలాగే గ్రామాల్లో రహదారులు, చెరువులు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి అయ్యాయని గుర్తు చేశారు. అయితే ఈ బలం ప్రభుత్వానికి నచ్చడం లేదని, అందుకే ఈ చట్టం ద్వారా కూలీల శక్తిని తగ్గించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోందని ఆయన విమర్శించారు.
కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయినప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ కోట్ల మంది గ్రామీణ ప్రజలను ఆకలి, అప్పుల నుంచి కాపాడిందని రాహుల్ గుర్తు చేశారు. అలాంటి కీలకమైన పథకాన్ని బలహీనపరచడం చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు ఈ పథకం వల్ల మహిళలకు ఎక్కువ లాభం జరిగిందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతి సంవత్సరం ఎంజీఎన్ఆర్ఈజీఏలో మహిళలే ఎక్కువ పనిదినాలు చేసినట్లు తెలిపారు. అయితే పనిని పరిమితం చేస్తే ముందుగా నష్టపోయేది మహిళలు, దళితులు, ఆదివాసీలు, భూమిలేని కూలీలు, పేద ఓబీసీ వర్గాలేనని ఆయన హెచ్చరించారు.
ఇంత ముఖ్యమైన చట్టాన్ని పార్లమెంట్‌లో సరైన చర్చ లేకుండా, స్టాండింగ్ కమిటీకి పంపకుండా బలవంతంగా ఆమోదించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కోట్ల మంది జీవితాలపై ప్రభావం చూపే చట్టానికి నిపుణుల అభిప్రాయాలు, ప్రజా విచారణలు, లోతైన పరిశీలన అవసరమని ఆయన అన్నారు. “కార్మికులను బలహీనపరచడం, గ్రామీణ భారతదేశ శక్తిని తగ్గించడం, అధికారాన్ని కేంద్రీకరించడం, తర్వాత నినాదాలతో సంస్కరణలని చెప్పడం – ఇదే మోడీ ప్రభుత్వ లక్ష్యం” అని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పేదరిక నిర్మూలన పథకాలలో ఒకటని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు కార్మికులు, పంచాయతీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
రాష్ట్రాలపై ఆర్థిక భారం
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథకాన్ని నెమ్మదిగా ఆపేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె ఆరోపించారు. గతంలో ఈ పథకానికి కావాల్సిన నిధుల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించేదని, కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు 40 శాతం ఖర్చు భరించాల్సి వస్తుందని ఆమె తెలిపారు. పేద రాష్ట్రాలు ఈ భారాన్ని మోయలేవని, దాంతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు ఆగిపోయి పేదలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కొత్త చట్టంలో ఏముంది?
ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ బిల్లులో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 100 రోజులుగా ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుంది. వ్యవసాయ పనుల సమయంలో కూలీల కొరత రాకుండా ఉండేందుకు, ఏడాదిలో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు ఇస్తారు.
అయితే, ప్రభుత్వం చెబుతున్న హామీలకు భిన్నంగా ఈ బిల్లులో ఉన్న నిబంధనలు పేదలకు నష్టం కలిగిస్తాయని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సరైన చర్చ లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఈ బిల్లును హడావుడిగా ఆమోదించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గురువారం రాత్రి తీవ్ర నిరసనల మధ్య పార్లమెంట్‌లో ఈ బిల్లును ఆమోదించగా, మహాత్మా గాంధీ పేరు తొలగించడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడంపై ప్రతిపక్షం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
