
వీబీజీ-రామ్-జీ చట్టానికి లోగో రూపకల్పన పోటీ ప్రారంభం
గ్రామీణాభివృద్ధి రంగంలో కొత్త కార్యక్రమానికి గుర్తింపుగా లోగో రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోటీని ప్రారంభించింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘వికసిత్ భారత్– వీబీ–జీ–రాం జీ యాక్ట్’ చట్టానికి సంబంధించిన లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. ఈ పోటీ ప్రభుత్వ పౌర భాగస్వామ్య వేదిక MyGov లో నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి సృష్టి లక్ష్యాలను ప్రతిబింబించేలా సృజనాత్మక లోగోలను ప్రజలు పంపించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమం ప్రభుత్వ ‘వికసిత్ భారత్ 2047’ దృష్టికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి వ్యూహంలో కీలక భాగంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. లోగో డిజైన్ సమర్పణకు మార్చి 20 చివరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన విజేతకు రూ.50,000 నగదు బహుమతి అందజేయనున్నారు. ఎంపికైన లోగోను ఈ చట్టానికి సంబంధించిన అధికారిక, ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వం ఉపయోగించనుంది. ఈ పోటీలో సమర్పించే లోగోలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపు, జీవనోపాధి మెరుగుదల, సమగ్ర గ్రామీణాభివృద్ధిని ప్రతిబింబించేలా ఉండాలని అధికారులు సూచించారు.
ఇటీవల అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) యాక్ట్, 2025 చట్టం, గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ , 2005 స్థానంలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వేతన ఉపాధి హామీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద 100 రోజుల ఉపాధి హామీ మాత్రమే ఉండేది. అయితే ఈ కొత్త పథకంపై కొన్ని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ఇది ఎంఎన్‌ఆర్‌ఈజీఏలో ఉన్న హక్కు ఆధారిత విధానాన్ని బలహీనపరచవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ పథకం మరింత కేంద్రీకృతంగా ఉందని కూడా వారు అంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం మాత్రం ఈ చట్టం గ్రామీణ ఉపాధి హామీని మరింత బలపరుస్తుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు స్థిరమైన జీవనోపాధిని కూడా ఇది ప్రోత్సహిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
