Let's talk: editor@tmv.in
వీబీఎస్‌ఏ బిల్లును వ్యతిరేకించాలి.. ఎన్డీయే రాష్ట్రాలకు జైరాం రమేష్ పిలుపు

వీబీఎస్‌ఏ బిల్లును వ్యతిరేకించాలి.. ఎన్డీయే రాష్ట్రాలకు జైరాం రమేష్ పిలుపు

Gaddamidi Naveen
11 జులై, 2026

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (వీబీఎస్‌ఏ) బిల్లు–2025’పై కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని, రాష్ట్రాల హక్కులను హరించే ప్రమాదం ఉందని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును చర్చకు తీసుకొచ్చినప్పుడు ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని, తమ నిరసన నోట్లను సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యల్లో, “ఈ బిల్లును ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్’గా కాకుండా ‘వెరీ బ్యాడ్ శిక్షా యాక్ట్‌’గా పిలవాల్సి వస్తుంది” అంటూ విమర్శించారు. రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాలనే నిబద్ధత ఉంటే ఎన్డీయే పాలిత రాష్ట్రాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలవాలని సూచించారు.

బిల్లుపై తన అభ్యంతరాలను జైరాం రమేష్‌ నాలుగు ప్రధాన అంశాల రూపంలో వివరించారు. మొదటిగా, ఇది రాజ్యాంగ పరిమితులను అతిక్రమిస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని యూనియన్‌ జాబితాలో ఉన్న ఎంట్రీ–66 ప్రకారం పార్లమెంట్‌కు ఉన్న అధికారం ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలను సమన్వయం చేయడం, నిర్ధారించడం వరకే పరిమితమని ఆయన తెలిపారు. అయితే ప్రతిపాదిత బిల్లు ఆ పరిధిని దాటి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నియంత్రణ వంటి అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకే ఉందని గుర్తుచేశారు.

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020లో ప్రతిపాదించిన విధంగా ప్రత్యేక గ్రాంట్ల మండలిని ఏర్పాటు చేయకుండా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం యూజీసీ, ఏఐసీటీఈ వంటి స్వతంత్ర సంస్థల వద్ద ఉన్న నిధుల కేటాయింపు అధికారాలు నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు వంటి జాతీయ ప్రాధాన్య సంస్థల స్వాతంత్ర్యంపై ప్రభావం పడవచ్చని జైరాం రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐఐటీ చట్టం ప్రకారం ఆయా సంస్థలు తమ విద్యా కార్యక్రమాల రూపకల్పనలో స్వతంత్ర అధికారాలు కలిగి ఉన్నాయని, కానీ బిల్లులోని 49వ క్లాజ్‌ ఇతర చట్టాలపై ఆధిపత్యం కల్పించేలా ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ సంస్థలు కూడా కొత్త నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

యూజీసీ చట్టంలో ఉన్న సంప్రదింపుల విధానాన్ని ఈ బిల్లు బలహీనపరుస్తోందని అన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపి ప్రమాణాలు నిర్ధారించే విధానం ఉండగా, కొత్త బిల్లులో మండళ్లకు విస్తృత స్వేచ్ఛా అధికారాలు ఇవ్వడం వల్ల విద్యాసంస్థల అభిప్రాయాలకు ప్రాధాన్యం తగ్గిపోతుందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రస్తావిస్తూ జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను చంద్రబాబు వ్యతిరేకించినప్పటికీ, కేంద్రానికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఎన్డీయేలో టీడీపీ స్థానాన్ని మూడు సంవత్సరాల నాటి సరికొత్త పార్టీ ఆక్రమించిందని, కాబట్టి మోడీ ప్రభుత్వ మనుగడకు టీడీపీ ఇప్పుడు అత్యంత కీలకం కాకపోవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబు గనుక రాష్ట్రాల హక్కులను కాపాడాలనుకుంటే, ధైర్యంగా నిలబడి ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.

నేపథ్యం..

ఉన్నత విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15, 2025న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. కమిటీ ఇప్పటికే ఐఐటీ బాంబే, శాస్త్ర యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికే ఈ బిల్లు తెచ్చామని కేంద్రం చెప్తుండగా, విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ట్యాగ్‌లు
JairamRameshVBSABillEducationBillHigherEducationParliamentSessionCongressNDAAndhraPradeshChandrababuNaiduFederalismStateRightsUGCNEP2020
వీబీఎస్‌ఏ బిల్లును వ్యతిరేకించాలి.. ఎన్డీయే రాష్ట్రాలకు జైరాం రమేష్ పిలుపు - Tholi Paluku