
వీధి కుక్కల నియంత్రణకు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ఆదేశాలు
ఇటీవల రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వీధి కుక్కల దాడులు పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో జాగింగ్ చేసే వారు, స్కూల్‌కువెళ్లే చిన్నారులు,మహిళలు తరచూ కుక్కల బెడదను ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల పిల్లలపై గుంపులుగా దాడి చేసిన ఘటనలు సంభవించడంతో పట్టణ ప్రజలు ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి కుక్కల సమస్యపై సమగ్ర చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పద్ధతి ప్రకారం చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా జంతు జనన నియంత్రణ (ఏబీసీ) యాంటీ–రేబిస్ వ్యాక్సినేషన్ (ఏఆర్ వి ) కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ అన్ని పట్టణ స్థానిక సంస్థలకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి.సంపత్ కుమార్ సంయుక్తంగా విడుదల చేసిన ఆదేశాల ప్రకారం 2023 జంతు జనన నియంత్రణ నియమాలు, 2025 నవంబర్ 7న సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.
శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థ ల్లో సుమారు 5.15 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వీటిలో 2024 జూన్ 1 నాటికి 2,24,732 కుక్కలకు శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) చేపట్టగా ఆ తర్వాత మరొక 1,36,656 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స చేశారు.
వీధి కుక్కల జనాభా పెరుగుదలతో కుక్క దాడి ఘటనలు పెరగకుండా ముందస్తు చర్యలు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 45 పట్టణ స్థానిక సంస్థ ల్లో ఆపరేషన్ థియేటర్లు, కెన్నెల్స్ సహా ఏబీసీ కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించగా మిగతావి త్వరలో సిద్ధం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు.
సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉంది. శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ కార్యకలాపాల్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదు. నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు..
ఇప్పటికే రాష్ట్రం జంతు జనన నియంత్రణ, మానిటరింగ్ కమిటీ, అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థ స్థాయి అమలు కమిటీలు ఏర్పాటు చేసింది. వీటిలో ఏంఏయూడి ఆరోగ్యం, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, జంతు సంక్షేమ మండలి ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్లకు కఠిన ఆదేశాలు
• రోజువారీ/వారపు లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి
• 2023 ఏబిసి నియమాల ప్రకారం గుర్తింపు పొందిన ఏజెన్సీలను ఎంపిక చేయాలి
• వీధి కుక్కల జనాభాపై తిరిగి సర్వే చేయాలి
• పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రులు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలి
• ప్రత్యేక ఫీడింగ్ జోన్‌లు కేటాయించి, రోడ్లపై జంతువులకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించాలి
ప్రజల భద్రత కోసం, పిల్లలు చదివే పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
.
