Let's talk: editor@tmv.in
వీకెండ్ లో మెదక్ ప్రయాణం - జ్ఞాపకాల దారిలో ఒక ఆత్మయానం

వీకెండ్ లో మెదక్ ప్రయాణం - జ్ఞాపకాల దారిలో ఒక ఆత్మయానం

Dantu Vijaya Lakshmi Prasanna
26 అక్టోబర్, 2025

వీకెండ్‌ ఉదయం సూర్యరశ్మి కిటికీ గుండా గదిలోకి చొరబడుతుంటే, పర్యాటకుల మనసు ఒకే ఒక్క మాట చెబుతుంది, ప్రకృతి ఒడిలో సేదతీరాలని. పిల్లలు పెద్ధలు సరదాగా ఈ వీకెండ్ ఎక్కడికో బయల్దేరాలి అనుకుంటారు. హైదరాబాద్ నగరపు హడావిడి, పని ఒత్తిడి మధ్య మనసు బరువెక్కిపోతుంది. అందుకే ఒక్క నిర్ణయం మెదక్ దారి పట్టాలి అని .. ప్రయాణం మొదలవ్వగానే నగరం వెనక్కి మాయమవుతూ, పచ్చని పొలాలు, చెట్లు, గాలి అన్నీకలిపి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. మార్గమధ్యంలోని చిన్న గ్రామాల నిశ్శబ్దం మీ చిన్ననాటి జ్ఞాపకాలను తడుముతుంది. మరి మెదక్ లో ఏమేమి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయో తెలుసుకుందాం ..

మెదక్ చర్చి – విశ్వాసం, శిల్పం, చరిత్ర కలయిక

మెదక్ చేరుకునే సరికి ముందుగా కనబడేది ఆ భవ్యమైన మెదక్ కేథడ్రల్ చర్చి.

తెలుగునాట మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిలలో ఇది ఒకటి.

తెల్లని గోడలు, రంగురంగుల గాజు కిటికీలు, ఆ ప్రశాంతత అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. వందేళ్ల చరిత్ర గడపలలో మిషనరీల త్యాగం, స్థానిక కళాకారుల ప్రతిభ ప్రతిబింబంలా కనిపిస్తుంది. లోపల కూర్చుంటే గాలే కూడా ప్రార్థనలా అనిపిస్తుంది.

చరిత్ర, స్థాపన

మెదక్ కేథడ్రల్ నిర్మాణానికి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్‌నెట్ నాయకత్వం వహించారు. "నా ప్రభువు కొరకు నా శాయశక్తులా" అనే నినాదంతో ఆయన ప్రేరణ పొందారు. రేవ్‌. పాస్‌నెట్ 1895లో సికింద్రాబాద్ చేరుకుని, మొదట బ్రిటిష్ సైనికులలో పనిచేశారు. తన పనిని విస్తరించాలనే ఉద్దేశంతో, ఆయన గ్రామాలలో పరిచర్య చేయడం ప్రారంభించారు.

1896లో రేవ్‌. పాస్‌నెట్ మెదక్‌ను సందర్శించారు. హైదరాబాద్ నుండి 60 మైళ్ల (97 కి.మీ) దూరం గుర్రంపై ప్రయాణించి, ఒకే రోజులో ఆ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఆ సమయంలో, మెదక్ ప్రాంతం మొత్తంలో కేవలం రెండొందల మంది క్రైస్తవులు మాత్రమే ఉండేవారు, అప్పటి వారి ఆరాధనా స్థలం కేవలం చిన్న పెంకుటిల్లు. క్రైస్తవ సమాజం పెరగడంతో, పాస్‌నెట్ సాంప్రదాయ చర్చి ఆకారంలో ఒక మోస్తరు నిర్మాణాన్ని నిర్మించారు. అయినప్పటికీ, ఇది దైవారాధనకు తగిన స్థలం కాదని భావించి, 1914లో ఘుస్నాబాద్ ప్రాంతంలోని 1,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కేథడ్రల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా, 20వ శతాబ్దం ప్రారంభంలో మెదక్ జిల్లాను తాకిన తీవ్రమైన కరువు సమయంలో ఈ నిర్మాణం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఉచిత భోజనశాలను నిర్వహించడానికి బదులుగా, రేవ్‌. పాస్‌నెట్ చర్చి నిర్మాణంలో బాధిత ప్రజలకు ఉపాధి కల్పించారు, వారికి గౌరవప్రదమైన జీవనోపాధిని అందించారు. ఈ నిర్మాణం 10 సంవత్సరాలు కొనసాగింది. చివరికి, ప్రజల కష్టాలను తగ్గించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, రేవ్‌. పాస్‌నెట్ 1924 డిసెంబర్ 25న కేథడ్రల్‌ను ప్రతిష్టించారు.

ప్రాముఖ్యత, హోదా

అనేక క్రైస్తవ వర్గాలు ఏకమై చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా గా ఏర్పడినప్పుడు, 1947 అక్టోబర్‌లో మెదక్ డయాసిస్ కు కేథడ్రల్ చర్చ్‌ వేదికగా మారింది.ప్రస్తుతం ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వెస్లియన్ మెథడిస్ట్, కాంగ్రిగేషనల్, ఆంగ్లికన్ మిషనరీ సొసైటీలను కలిగి ఉంది. మెదక్‌లోని బిషప్‌కు ప్రధాన స్థానంగా పనిచేస్తుంది. మెదక్ కేథడ్రల్ దాని పరిమాణానికి ప్రసిద్ధి చెందింది. ఇది తెలంగాణలోని అన్ని చర్చిలలో కెల్లా అతి పెద్దది. అంతేకాక, మెదక్ డయాసిస్ అనేది ఆసియాలో అతిపెద్ద డయాసిస్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద డయాసిస్‌గా గుర్తించబడింది.

నిర్మాణ అద్భుతం

ఈ కేథడ్రల్ గోతిక్ రివైవల్ శైలి నిర్మాణానికి అనుగుణంగా ఉంటుంది. ఇది 100 అడుగుల (30 మీ) వెడల్పు, 200 అడుగుల (61 మీ) పొడవు గల భారీ నిర్మాణం, ఒకేసారి సుమారు 5,000 మంది ప్రజలకు వసతి కల్పించగలదు. దీని గంటల గోపురం 175 అడుగుల (53 మీ) ఎత్తులో ఉంటుంది.

ఈ భవనం యొక్క గొప్పతనం దాని వివరాలలో స్పష్టంగా కనిపిస్తుంది:

• చక్కగా చెక్కిన బూడిదరంగు రాతితో నిర్మించిన భారీ స్తంభాలు మొత్తం భవనాన్ని నిలబెడతాయి.

• ఫ్లోరింగ్ కోసం బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్న ఆరు వేర్వేరు రంగుల మొజాయిక్ టైల్స్‌ను ఉపయోగించారు, వాటిని బొంబాయికి చెందిన ఇటాలియన్ మేసన్లు వేశారు.

• పైకప్పు లోపల బోలుగా ఉన్న స్పాంజ్ పదార్థాన్ని ఉపయోగించి శబ్దం చొరబడకుండా సౌండ్ ప్రూఫ్ ఏర్పాటుచేశారు. చతురస్రాకారపు పైకప్పు శైలి ఆకట్టుకుంటుంది.

• ఈ అద్భుతమైన తెల్ల గ్రానైట్ నిర్మాణం భారతదేశం, ఆగ్నేయాసియాలో గోతిక్ నిర్మాణానికి గొప్ప ఉదాహరణ.

రంగుల గాజు కిటికీలు:

కేథడ్రల్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకర్షణ దాని అద్భుతమైన రంగుల గాజు కిటికీలు ఇవి క్రీస్తు జీవితంలోని వివిధ దృశ్యాలను రంగుల కలయికలో చిత్రీకరిస్తాయి, ఇవి ముఖ్యంగా సూర్యకాంతిలో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ కిటికీలను ఇంగ్లాండ్‌కు చెందిన సర్ ఓ. సాలిస్‌బరీ రూపొందించారు.

ముఖ్యమైన మూడు కిటికీలు: బలిపీఠం వెనుక ఉన్న చాన్సెల్ కిటికీ, క్రీస్తు ఆరోహణను చిత్రీకరిస్తుంది, ఇది 1927లో స్థాపించబడింది. పశ్చిమ ట్రాన్సెప్ట్‌లోని కిటికీ, యేసు జనన దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది, ఇది 1947లో స్థాపించబడింది. తూర్పు ట్రాన్సెప్ట్‌లోని కిటికీ, క్రీస్తు శిలువ మరణాన్ని చిత్రీకరిస్తుంది, ఇది 1958లో స్థాపించబడింది.

సమయాలు, సేవలు: ఈ కేథడ్రల్ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల సందర్శన, నిశ్శబ్ద ప్రార్థనల కోసం తెరవబడి ఉంటుంది.

ఆదివారం సేవలు: ఉదయం 7 గంటల నుండి రాత్రి 9:30 గంటలకు వారాలు ప్రత్యేక ప్రార్దనలు జరుగుతాయి. చర్చి అందాన్ని చూశాక చేరుకునే ప్రాంతం సరస్సు..

**మాన్యారెడ్డి సరస్సు – నీటితో ప్రతిబింబించిన నిశ్శబ్దం

చర్చ్ నుండి కొద్ది దూరంలో ఉన్న మాన్యారెడ్డి చెరువు వద్ద సాయంత్రపు గాలి మైమరపిస్తుంది. . సూర్యాస్తమయపు కాంతి నీటిపై బంగారు తళుకులా విరుస్తుంది.

పిల్లల ఆటలు, పెద్దల నవ్వులు, చెట్ల నీడ , ఇవన్నీ ఒక నిశ్శబ్ద కవితలా అనిపిస్తాయి. ఆ క్షణం మనసులోని అలసట అంతా కరిగిపోతుంది. గాలి చెవిలో చెప్పినట్టు అనిపిస్తుంది. “ఒక్క క్షణం ఊపిరి తీసుకో, నువ్వు జీవిస్తున్నావు.”అని .అక్కడనుండి వసతి గృహం వైపు పయనిస్తే రాత్రి బోజనం లో మెదక్ రుచులు రుచి చూడవచ్చు.

స్థానిక రుచులు – పల్లె వంటల్లో ప్రేమ వాసన

మెదక్ బజార్‌లోకి అడుగుపెట్టగానే వంట వాసనలు ఆహ్వానిస్తాయి. ఒక చిన్న హోటల్‌లో కూడా “జొన్న రొట్టె, చింతపండు పప్పు, గోంగూర మటన్ కూర” కూడా దొరుకుతాయి.

ఆ రుచిలో ఆ ఊరి మట్టి, ఆతిథ్యం, స్నేహం అన్నీ మిళితమై ఉన్నాయి.

మారుమూల పల్లెల గుండెల్లో జీవితం

మెదక్ పరిసర గ్రామాల దారిలో తిరిగితే మనసు తడుస్తుంది. పొలాల మధ్యన మహిళలు పూలు ఏరుతూ నవ్వుతుంటారు. ఆ నవ్వుల్లో బాధలతోపాటు బతకాలనే ధైర్యం కనిపిస్తుంది. చిన్న స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు వ్యాపారాలు మొదలు పెట్టి ఆర్థికంగా ఎదుగుతున్నారు. సాయంత్రం సూర్యుడు మాయమవుతుంటే చర్చ్ పైగా పక్షులు తిరుగుతుంటాయి. . ఆ దృశ్యం ఒక చిత్రంలా ఉంటుంది. . రాత్రి నిద్ర తరువాత మరుసటి రోజు మెదక్ కోట, ఎడుపాయల వన దుర్గా భవాని దేవాలయం దర్శించవచ్చు.

వసతి సౌకర్యాలు

మెదక్ ప్రస్తుతం పర్యాటకుల కోసం అనేక రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల కోసం సాదాసీదా గెస్ట్ హౌసుల నుంచి, కుటుంబ యాత్రికుల కోసం హోటల్స్‌, రిసార్ట్స్‌ వరకు అందుబాటులో వుంటాయి.

• తెలంగాణ టూరిజం హారిత హోటల్, చర్చి సమీపంలోనే ఉంది. ప్రధాన రోడ్డుకి అతి దగ్గరగా వుంటుంది. ఎ సి ,నాన్ ఎ సి గదులు, 24 గంటల నీరు, పార్కింగ్ సదుపాయం కలిగి ఉంటాయి. స్థానిక తెలుగు వంటలతో పాటు సౌత్‌ ఇండియన్ భోజనాలు దొరుకుతాయి. కుటుంబ యాత్రికులకు సురక్షితంగా, ప్రశాంత వాతావరణం.తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్ సదుపాయం ఉంది.

• మెదక్ బస్టాండ్ చుట్టుపక్కల చిన్న, శుభ్రమైన లాడ్జ్‌లు, గెస్ట్ హౌసులు ఉన్నాయి. ధరలు కూడా చాలా చవకగా ఉంటాయి (₹700 – ₹1500 వరకు). విద్యుత్‌, నీరు, సులభమైన ఆహార సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

• మెదక్ పరిసర గ్రామాల్లో ఇటీవల కొన్ని ఎకో రిసార్ట్స్ అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు గజ్వేల్‌ ,మెదక్ హైవేలో ఉన్న గ్రీన్ వ్యాలీ రిసార్ట్ , సిద్దిపేట రోడ్ వద్ద ఉన్న సరస్వతి ఫార్మ్ స్టే. ఇవి పల్లె వాతావరణంతో నిశ్శబ్దంగా ఉండాలనుకునే వారికి ఉత్తమమైన ఎంపికలు. ఇక్కడ మీరు ఉదయం పక్షుల కిలకిలలు, పొలాల గాలి, సంప్రదాయ ఆహారం ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఇవి మరింత దగ్గరగా ఉంటాయి.

• మెదక్ సమీపంలోని ఆలయాల వద్ద (ఉదా: పోతిరెడ్డి పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం) భక్తుల వసతి గృహాలు కూడా ఉన్నాయి. చాలా తక్కువ ధరకే గదులు అందిస్తారు. స్వచ్ఛత, భద్రత కలిగిన ప్రదేశాలు. భక్తి యాత్రికులకైతే ఇవి సరైన ఎంపిక.

మేదక్‌లో వసతి ఎంపికలు అన్నీ సౌకర్యం, ప్రశాంతత, ఆత్మీయత కలయిక. అక్కడ గడిపిన ఒక రాత్రి మనసును ప్రశాంతతతో నింపుతుంది. పల్లె గాలి, చర్చి బెల్లుల ధ్వని, సరస్సు చల్లదనం ఇవన్నీ కలిపి మేదక్‌ యాత్రను సంపూర్ణంగా చేస్తాయి.

మె**దక్ కోట

చరిత్ర: కాళజర్ల కాలంలో (12వ శతాబ్దం) నిర్మించబడిన ఈ కోటకు ఖాజా అహ్మదుల్లా బహమనీ పాలనలో విశేష ప్రాధాన్యం పొందింది. 900 అడుగుల ఎత్తులో ఉండి, చుట్టుపక్కల మెదక్ పట్టణం మొత్తం కనపడుతుంది. శిల్పకళ, పాత తుపాకులు, రాళ్ల చెక్కల గోపురాలు చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉదయాన్నే కోట పైకెక్కడం మంచి అనుభూతిని ఇస్తుంది. అక్కడినుండి ఏడుపాయాల చేరుకోవచ్చు.

ఏ**డుపాయల వన దుర్గా భవాని దేవాలయం గురించి వివరాలు

మెదక్ నుండి ఎడుపాయల దేవాలయానికి చేరుకోవడానికి దూరం 19.5 కి.మీ. మెదక్ నుండి గమ్యస్థానానికి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

12వ శతాబ్దంలో నిర్మించబడిన ఎడుపాయల వన దుర్గా భవాని దేవాలయం ఆ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన, శక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయం కనకదుర్గ అమ్మవారికి అంకితం చేయబడింది. ఇది దట్టమైన పచ్చని అడవి, సహజ శిలల నిర్మాణాల మధ్య ఒక గుహ లోపల నెలకొని ఉన్న సుందరమైన ఆలయం. ఈ ప్రదేశం మంజీరా నదిలో ఏడు వాగులు కలిసే సంగమ స్థలం లో ఉంది. అందుకే దీనికి ఎడుపాయల అనే పేరు వచ్చింది. ఎడు అంటే ఏడు, పాయలు అంటే వాగులు లేదా ప్రవాహాలు. ఈ గమ్యస్థానం కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాక, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది భక్తులను దుర్గాదేవిని పూజించడానికి ఆకర్షిస్తుంది.

పురాణాల ప్రకారం, మహాభారతంలోని గొప్ప యోధుడు అర్జునుడి మనవడైన మహారాజా పరీక్షిత్తు ఒక శాపం నుండి విముక్తి పొందడానికి “సర్ప యాగం” నిర్వహించారు. ఆ యాగంలో ఉపయోగించిన పాములను గరుడ పక్షి మోసుకెళ్తున్నప్పుడు, వాటి రక్తం ఏడు వేర్వేరు ప్రదేశాలలో పడిందని, ఆ రక్తం పడిన ప్రదేశాలే వాగులుగా మారాయని చెబుతారు. ఇటీవల, వంతెన నిర్మాణ సమయంలో, మంజీరా నది ఇసుక మేట కింద బూడిద పొర కనుగొన్నారు. ఈ దేవాలయం జాతరకు (తీర్థానికి) కూడా ప్రసిద్ధి చెందింది, ఇది ఫిబ్రవరి నెలలో శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఉత్సవం. వందలాది మంది భక్తులు ఎడుపాయల వన దుర్గా భవాని దేవాలయం చుట్టూ తాత్కాలిక గుడారాలను వేయడంతో, ఈ మూడు రోజుల ఉత్సవానికి 5 లక్షల మందికి పైగా యాత్రికులు తరలివస్తారు. వర్షాకాలంలో, నదీ జలాలు ఉద్ధృతంగా ప్రవహించి, అమ్మవారి పాదాలను తాకుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తారు.కార్తీకమాసంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.

ఆలయం చుట్టూ వున్న ప్రదేశం పచ్చని ప్రకృతి ,ట్రెక్కింగ్ పర్యాటకులకు,సందర్శకులకు మంచి పర్యాటక అనుభూతుల్ని కలిగిస్తాయి.

మెదక్ పర్యటనకు ప్రయాణ సమాచారం

విమాన మార్గం: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఇది మెదక్ నుండి 146 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదక్ నుండి ఎడుపాయల దేవాలయానికి చేరుకోవడానికి దూరం 19.5 కి.మీ. మెదక్ నుండి గమ్యస్థానానికి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం: మెదక్‌లో రైల్వే స్టేషన్ లేదు. మెదక్‌కు సమీపంలోని రైల్వే స్టేషన్లు అక్కన్నపేట (19.1 కి.మీ), కామారెడ్డి (60 కి.మీ). ఇక్కడి నుండి బెంగుళూరు, చెన్నై, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నాందేడ్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. మెదక్‌కు చేరుకోవడానికి రైల్వే స్టేషన్ల నుండి టాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

మెదక్ నుండి ఎడుపాయల దేవాలయానికి చేరుకోవడానికి దూరం 19.5 కి.మీ. మెదక్ నుండి గమ్యస్థానానికి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డు మార్గం:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి ) ద్వారా హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి వంటి నగరాల నుండి మెదక్‌కు తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. అన్ని ముఖ్యమైన పట్టణాలు, నగరాల నుండి మెదక్ వరకు బస్సులు ఉంటాయి.

వీకెండ్ ట్రావెలర్లకు సలహా

వసతి, రవాణా కోసం ముందుగా బుకింగ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా కార్తీక మాసం లేదా సెలవు రోజులలో. ఇక్కడ ప్రదేశాలు రద్దీ గా ఉంటాయి. మెదక్ చర్చి, ఫోర్ట్, సరస్సు చూసే సమయం ఎక్కువగా కావాలంటే, కనీసం ఒక రాత్రి అక్కడే గడపడం ఉత్తమం.

పల్లె దారుల్లోకి వెళ్లాలనుకుంటే, కారు లేదా బైక్ సౌకర్యం ఉండటం అవసరం

తిరుగు ప్రయాణం మొదలయ్యాక మనస్సులో ఒక అందమైన అనుభవం. మెదక్ ప్రయాణం నేర్పింది, నిశ్శబ్దంలోనూ జీవితం మాధుర్యం దాగి ఉంటుందని. “ప్రయాణం అంటే గమ్యానికి చేరుకోవడం కాదు, మనసుని కనుగొనడం.” మెదక్ ఒక ప్రదేశం మాత్రమే కాదు, మనలోని ప్రశాంతతను మళ్లీ గుర్తు చేసే ఆత్మయానం.