
‘వీఎస్ఆర్’ వ్యవహారంలో డీజీసీఏ కూడా తప్పిదం చేసింది: రోహిత్ పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన బారామతి విమాన ప్రమాదం నేపథ్యంలో, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ బుధవారం విమానయాన నియంత్రణ సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. వీఎస్ఆర్ వెంచర్స్‌కు మొదట క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నించి, తరువాత భద్రతా లోపాలను అంగీకరించడం ద్వారా డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా తప్పిదం చేసిందని ఆయన ఆరోపించారు. జనవరి 28న పుణే జిల్లా బారామతి ఎయిర్‌స్ట్రిప్ సమీపంలో కూలిపోయిన లియర్‌జెట్ 45 (వీటీ-ఎస్ఎస్కే) విమానాన్ని వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో సహా నలుగురు మరణించారు.
ముంబైలోని విధాన్ భవన్ ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ పవార్, జనవరి 28 మధ్యాహ్నం 1.36 గంటలకు డీజీసీఏ విడుదల చేసిన నివేదికను ప్రస్తావించారు. ఫిబ్రవరి 2025లో నిర్వహించిన చివరి నియంత్రణ ఆడిట్‌లో వీఎస్ఆర్ వెంచర్స్‌పై ఎటువంటి ‘లెవల్-1 ఫైండింగ్స్’ నమోదు కాలేదని ఆ నివేదిక పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అజిత్ పవార్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే డీజీసీఏ ఆ నివేదిక విడుదల చేసింది. అది వీఎస్ఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడానికి చేసిన తొలి ప్రయత్నమని ఆయన ఆరోపించారు. డీజీసీఏ పాత్రను ప్రశ్నిస్తూ ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికెట్లు ఎవరు జారీ చేస్తారు? విమానాల నిర్వహణను ఎవరు పర్యవేక్షిస్తారు? విమాన భద్రత బాధ్యత ఎవరిది? ఇవన్నీ డీజీసీఏ పరిధిలోనే ఉన్నాయి. వీఎస్ఆర్ తప్పు చేసినట్లయితే డీజీసీఏ కూడా బాధ్యత వహించాలని అన్నారు. జనవరి 28న కేంద్ర పౌర విమానయాన మంత్రి కే.రామ్మోహన్ నాయుడు లియర్‌జెట్ విమానంపై ఎటువంటి భద్రతా సమస్యలు లేవని, డీజీసీఏ సమగ్ర పరిశీలన అనంతరం అన్ని అనుమతులు ఇచ్చిందని చెప్పినట్లు రోహిత్ పవార్ గుర్తు చేశారు.
విమానాల్లో లోపాలు ఉన్నట్లు డీజీసీఏ అంగీకరించింది
అయితే, మంగళవారం విడుదలైన డీజీసీఏ ప్రత్యేక భద్రతా ఆడిట్ నివేదికలో పలు అనుసరణ లోపాలు (నాన్-కంప్లయెన్సులు) బయటపడ్డాయని ఆయన అన్నారు. ఆ నివేదిక ఆధారంగా వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన నాలుగు విమానాలను తాత్కాలికంగా గ్రౌండ్ చేయాలని డీజీసీఏ ఆదేశించినట్లు తెలిపారు. ఇది నా నిరంతర డిమాండ్‌కు లభించిన భాగస్వామ్య విజయమే. ఎయిర్‌వర్తినెస్, ఎయిర్ సేఫ్టీ, ఫ్లైట్ ఆపరేషన్స్ రంగాల్లో ఆమోదించిన విధానాలకు విరుద్ధంగా లోపాలు ఉన్నాయని డీజీసీఏ అంగీకరించింది. అంటే నేను ముందే ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు వారు ఒప్పుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు నాన్-కంప్లయెన్సులు ఉన్నాయని చెబుతున్నారు. కానీ మనం ఒక నాయకుడిని కోల్పోయాం. ఆయన ఉప ముఖ్యమంత్రి. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరని రోహిత్ పవార్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
అయితే తాజా నివేదికలో కూడా వీఎస్ఆర్‌కు ‘ఎస్కేప్ రూట్’ ఇచ్చినట్టే ఉందని ఆయన ఆరోపించారు. లోపాలను సరిచేసి తిరిగి వ్యాపారం ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పించేలా డీజీసీఏ చర్యలు తీసుకుందని విమర్శించారు. వీఎస్ఆర్‌కు చెందిన ఇతర విమానాలు ఎందుకు ఇంకా ఎగురుతున్నాయి? వాటినీ పూర్తిగా గ్రౌండ్ చేయాలని డిమాండ్ చేశారు. విమానయాన మంత్రి రాజకీయ పార్టీకి చెందిన నేతలకు వీఎస్ఆర్‌తో వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ, మంత్రి నాయుడు రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేస్తానని రోహిత్ పవార్ తెలిపారు. అదే విధంగా, మహారాష్ట్రలో విమాన సంబంధ సమన్వయం చూసే ‘ఆరో’ అనే సంస్థ జనవరి 28న విమానం ఎగరడానికి అనుకూలమని ప్రకటించిందని ఆయన అన్నారు. ఆ సంస్థపై కూడా కేసు నమోదు చేయాలి. వీఐపీ ప్రయాణాల సమన్వయానికి ఆరో అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఉంది. జనవరి 28 తెల్లవారుజామున పవార్ ప్రయాణం గురించి అందరికీ తెలుసు. వారందరినీ బాధ్యత వహింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బారామతి విమాన ప్రమాదంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపణ
బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన ఘటనపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ బుధవారం ఆరోపించారు. ఈ నిరాకరణతో ప్రమాదంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం, యంత్రాంగం ఎవరినో రక్షిస్తున్నట్లుగా కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని చెబుతూ, తాను, పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిట్‌కారి, ఇద్రిస్ నాయకవాడి, ఎమ్మెల్యే సందీప్ క్షీర్‌సాగర్ కలిసి దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
తన వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియ మొదలైన తర్వాత ఒక సీనియర్ పోలీస్ అధికారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించి, తమ వినతిపత్రాన్ని కేవలం విధి నిర్వహణలో భాగంగా స్వీకరించారని ఆయన ఆరోపించారు. విపక్షం, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కలిసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు తిరస్కరించడం మహారాష్ట్రకు దురదృష్టకరం. ఈ పరిస్థితిలో అజిత్ పవార్‌కు న్యాయం జరుగుతుందా? అని రోహిత్ పవార్ ప్రశ్నించారు. గురువారం ఉదయం 9 గంటలకు అజిత్ పవార్‌ను ప్రేమించే వారంతా బారామతి తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తారని తెలిపారు.
