Let's talk: editor@tmv.in
వీఎస్ఆర్ వెంచర్స్ యజమానిని అరెస్ట్ చేయండి: జయ్‌పవార్

వీఎస్ఆర్ వెంచర్స్ యజమానిని అరెస్ట్ చేయండి: జయ్‌పవార్

Pinjari Chand
3 మార్చి, 2026

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న వేళ, ఆయన కుమారుడు జయ్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. వీఎస్ఆర్ వెంచర్స్ యజమాని రోహిత్ సింగ్ విమాన ప్రయాణ సమయంలో చీఫ్ పైలట్ సీట్లో నిద్రపోతున్నట్టు కనిపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని, అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై జయ్ పవార్ స్పందిస్తూ, మేము మా తండ్రిని కోల్పోయాం... ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది. ఈ వీడియోలో వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్ విమాన ప్రయాణ సమయంలో చీఫ్ పైలట్ సీట్లో నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నారు. గాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదు. ఇది అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు.

డీజీసీఏ జోక్యం కోరిన జయ్

ఈ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను జయ్ పవార్ కోరారు. పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన అన్ని విమానాలను తక్షణమే నిలిపివేయాలి. రోహిత్ సింగ్‌పై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక కుమారుడిగా నా వేడుకోలు మాత్రమే కాదు... ప్రతి ప్రయాణికుడి భద్రత కోసం కూడా అని ఆయన అన్నారు.

ఏఏఐబీ ప్రాథమిక నివేదిక

శనివారం విడుదలైన ప్రాథమిక నివేదికలో ఎయిర్ క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రమాద సమయంలో విజిబిలిటీ అవసరమైన స్థాయికి తగ్గిందని పేర్కొంది. అలాగే బరామతి ఎయిర్‌ఫీల్డ్‌లో రన్‌వేపై చెదిరిపోయిన మార్కింగ్స్, వదులుగా ఉన్న రాళ్లు వంటి అంశాలను ప్రస్తావించింది. నియంత్రణ లేని ఎయిర్‌ఫీల్డ్స్‌లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డీజీసీఏకు సూచించింది. అయితే ఈ నివేదికపై జయ్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాథమిక నివేదిక చదివాను. అది పూర్తి వివరాలతో లేదనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రజలకు, బాధిత కుటుంబాలకు పారదర్శక సమాచారం ఇవ్వాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాలని అన్నారు. డీజీసీఏ ఇప్పటికే వీఎస్ఆర్‌కు చెందిన కొన్ని విమానాలను లోపాల ఆధారంగా నిలిపివేసిన విషయం ప్రస్తావిస్తూ, ఇతర విమానాల్లో కూడా ఇలాంటి లోపాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని విమానాలకే కాకుండా, అవసరమైతే మొత్తం ఫ్లీట్‌పైనే చర్యలు తీసుకోవాలని జయ్ పవార్ డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే వీఎస్ఆర్ వెంచర్స్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని కూడా ఆయన కోరారు.

జనవరి 28న పుణె జిల్లా బరామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి గురైన లియర్‌జెట్ 45 విమానాన్ని వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నిర్వహిస్తోంది.