
విషమంగానే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి ఖలీదా జియా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని, వైద్య నిపుణులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పార్టీ నాయకులు సోమవారం తెలిపారు.
80 ఏళ్ల ఖలీదా జియా నవంబర్ 23న ఛాతిలో ఇన్ఫెక్షన్ రావడంతో ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం చూపింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో నాలుగు రోజుల తర్వాత ఆమెను కరోనరీ కేర్ యూనిట్‌కు మార్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచినట్లు బీఎన్‌పీ ఉపాధ్యక్షుడు అడ్వకేట్ అహ్మద్ ఆజామ్ ఖాన్ తెలిపారు. "ఆమె చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు" అని ఆయన ఆసుపత్రి బయట మీడియాతో చెప్పారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగుర్ కూడా ఖలీదా జియా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ధృవీకరించారు. "ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. దేశం మొత్తం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోంది. స్థానిక, విదేశీ వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు" అని ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్య అయిన ఖలీదా జియా గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలు, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, కంటి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఈ ఏడాది మే 6న విదేశాలలో అధునాతన వైద్య చికిత్స చేయించుకుని లండన్ నుండి తిరిగి వచ్చారు. గతంలో మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఖలీదా జియా, బంగ్లాదేశ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. గతేడాది ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో జరిగిన హింసాత్మక వీధి నిరసనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తిరిగి బలంగా పుంజుకుంది.
