Let's talk: editor@tmv.in
‘విశ్వగురు’ కాదు ‘విశ్వఫోనీ’: కాంగ్రెస్

‘విశ్వగురు’ కాదు ‘విశ్వఫోనీ’: కాంగ్రెస్

Pinjari Chand
30 మార్చి, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విదేశాంగ విధానం వ్యక్తిగత ఆధారితంగా మారిపోయిందని, అది ఇప్పుడు పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విధానం కారణంగా తాను చెప్పుకునే ‘విశ్వగురు’ ఇమేజ్‌ ఇప్పుడు ‘విశ్వఫోనీ(నకిలీ గురువు)’గా మారిందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యల్లో పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఎదగడం మోడీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’లో భారత సైన్యం సాధించిన విజయానంతరం కూడా దౌత్యపరంగా భారత్ ప్రయోజనం పొందలేదని విమర్శించారు.

ఇటీవల పశ్చిమాసియా పరిస్థితులపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో, విదేశాంగ మంత్రి జైశంకర్‌‌ పాకిస్తాన్‌ను ‘దళాల్ దేశం’గా వ్యాఖ్యానించిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్, అదే పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై చర్చల్లో భాగమవుతుండటం ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతోందని తెలిపింది.

పాకిస్థాన్‌ ప్రాధాన్యం పొందడం ఆందోళనకరం

పాకిస్తాన్ గతంలో తీవ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంగా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు తిరిగి ప్రాధాన్యం పొందడం ఆందోళనకరమని రమేశ్‌ అన్నారు. 2008 ముంబై దాడుల తర్వాత అంతర్జాతీయంగా ఒంటరైన పాకిస్తాన్‌కు ఇప్పుడు మళ్లీ గుర్తింపు రావడం వెనుక ప్రభుత్వ దౌత్య వైఫల్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్ కాలంలో పాకిస్తాన్‌పై కఠిన వైఖరి ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని ఆయన అన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ తనకు అమెరికాతో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నప్పటికీ, ఆ సంబంధాలు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడలేదని కాంగ్రెస్ ఆరోపించింది. హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’, అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ వంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, దౌత్యపరంగా లాభం చేకూరలేదని పేర్కొంది.

అమెరికాను సంతృప్తి పరిచారు

భారత వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాను సంతృప్తిపరచాలని ప్రయత్నించినా, దౌత్యపరంగా భారత్‌కు లాభం కాలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో మోడీని అంతర్జాతీయ వేదికలపై బలహీన నాయకుడిగా చూస్తున్నారని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

ప్రపంచ నాయకులతో తరచూ ఫోన్ సంభాషణలు జరుపుతున్నానని మోడీ చెప్పుకుంటున్నప్పటికీ, అవి ప్రాముఖ్యత గల ఫలితాలను ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ దేశాల విదేశాంగ మంత్రులతో కలిసి పాకిస్తాన్‌లో సమావేశం జరుగుతోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ చురుకుగా మధ్యవర్తిత్వం చేస్తోందని ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ ఫోన్‌లో మాట్లాడి, పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించారు. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ శాంతి ప్రయత్నాలపై చర్చించినట్లు సమాచారం. మొత్తంగా, పాకిస్తాన్ అంతర్జాతీయంగా మధ్యవర్తిగా ఎదగడం, భారత్ దౌత్యపరంగా వెనుకబడటం మోడీ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని కాంగ్రెస్ విమర్శించింది.

గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ సంరక్షణ క్రెడిట్‌పై కేంద్రంపై జైరాం విమర్శలు

అత్యంత ప్రమాదంలో ఉన్న పక్షి గ్రేట్‌ ఇండియన్‌ బస్టార్డ్‌ సంరక్షణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీకే మొత్తం క్రెడిట్ ఇస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యం చాలా కాలం క్రితమే ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. తాను పర్యావరణ మంత్రిగా ఉన్న సమయంలో, 2010 జూన్ 9న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి కచ్ గడ్డి భూముల్లో గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని రమేష్ వెల్లడించారు. ఈ పక్షి అంతరించిపోతున్న జాతికి చెందినదని, తక్షణ చర్యలు తీసుకోకపోతే గుజరాత్‌లో పూర్తిగా అంతరించిపోతుందనే హెచ్చరిక కూడా అప్పుడే ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీంఅలీని కూడా ప్రస్తావించారు. 1961లో ఈ పక్షిని జాతీయ పక్షిగా ప్రకటించాలని ఆయన సూచించారని, కానీ 1963లో భారత వన్యప్రాణి బోర్డు నెమలిని ఎంపిక చేసిందని తెలిపారు.