Let's talk: editor@tmv.in
విశాఖ సాగర తీరాన విశ్వ విన్యాసం:'మిలన్ 2026'ను ప్రారంభించిన రక్షణ మంత్రి

విశాఖ సాగర తీరాన విశ్వ విన్యాసం:'మిలన్ 2026'ను ప్రారంభించిన రక్షణ మంత్రి

Panthagani Anusha
20 ఫిబ్రవరి, 2026

భారత తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖపట్నం వేదికగా ప్రపంచ దేశాల నౌకాదళాల మహాసమ్మేళనం 'మిలన్-2026' గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్థానిక నావల్ బేస్‌లోని సముద్రిక ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ 13వ ఎడిషన్ బహుపాక్షిక నావికా విన్యాసాలను అధికారికంగా ప్రారంభించారు. సుమారు 74 దేశాల ప్రతినిధులు, నౌకాదళాధికారులు హాజరైన ఈ వేదిక ప్రపంచ శాంతి, సముద్ర భద్రత కోసం భారత్ చేస్తున్న కృషికి నిదర్శనంగా నిలిచింది.

సాగర రక్షణలో భారత్ విశ్వసనీయ భాగస్వామి

ప్రారంభోత్సవం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ 74 దేశాల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ 'మిలన్ 2026' చరిత్రలోనే అతిపెద్ద సమగ్రమైన ఎడిషన్ అని కొనియాడారు. "భారతదేశం ప్రపంచ సముద్ర రంగంలో అత్యంత విశ్వసనీయమైన బాధ్యతాయుతమైన భాగస్వామి అని చెప్పడానికి ఈ భారీ స్థాయి భాగస్వామ్యమే నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రాంతీయ స్థాయి నుంచి ప్రారంభమైన 'మిలన్', నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుళజాతి నావికా విన్యాసంగా ఎదగడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

పెరిగిన ముప్పులు.. తప్పనిసరి సహకారం

ప్రస్తుత సముద్ర భద్రతా పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రపు దొంగల (పైరసీ) బెదిరింపులతో పాటు అక్రమ చేపల వేట, మానవ అక్రమ రవాణా, సైబర్ దాడులు వంటి ఆధునిక సవాళ్లు సముద్ర మార్గాలను క్లిష్టతరం చేస్తున్నాయని హెచ్చరించారు. "నేటి పరస్పర అనుసంధాన ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా ఈ సమస్యలను ఎదుర్కోలేదు. వాతావరణ మార్పుల వల్ల సంభవించే విపత్తుల సమయంలోనూ పరస్పర సహకారం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు అది తప్పనిసరి" అని ఆయన స్పష్టం చేశారు.

మిలన్ 2026: నాలుగు దేశాల నుంచి 70 దేశాల వరకు

1995వ సంవత్సరంలో కేవలం నాలుగు ప్రాంతీయ దేశాలైన ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ భాగస్వామ్యంతో భారత నావికాదళం ‘మిలన్’ విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ వేదికగా ప్రారంభమైన ఈ ద్వైవార్షిక కార్యక్రమం, తొలినాళ్లలో కేవలం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఉద్దేశించబడింది. అయితే, కాలక్రమేణా ఇది భారతదేశపు 'లుక్ ఈస్ట్' 'యాక్ట్ ఈస్ట్' విధానాల్లో కీలక భాగమైంది. నేడు 70కి పైగా దేశాల భాగస్వామ్యంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుపాక్షిక నావికాదళ విన్యాసంగా ఎదిగింది.

ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో 'హార్బర్ దశ' ఇప్పటికే బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ దశలో పాల్గొనే దేశాల ప్రతినిధులు ఒకరి సంస్కృతులను మరొకరు అర్థం చేసుకునేలా సాంస్కృతిక ప్రదర్శనలు, అధికారిక విందులు ఏర్పాటు చేశారు. నౌకాదళాల మధ్య వృత్తిపరమైన అనుబంధాన్ని పెంచేందుకు 'మిలన్ విలేజ్' వేదికగా మేధోమధన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా గురువారం నుంచి రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సముద్ర సదస్సులో వివిధ దేశాల నిపుణులు ప్రస్తుత సముద్ర భద్రతా సవాళ్లపై చర్చించనున్నారు.

ఈ విన్యాసాల్లో అత్యంత కీలకమైన 'సముద్ర దశ' ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు షెడ్యూల్ చేయబడింది. బంగాళాఖాతం సాక్షిగా జరిగే ఈ ఐదు రోజుల కసరత్తులలో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వైమానిక రక్షణ మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి అధునాతన యుద్ధ తంత్రాలను ప్రదర్శించనున్నారు.

పాల్గొనే అన్ని నావికాదళాల మధ్య పరస్పర కార్యాచరణ సామర్థ్యాన్నిపెంచడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం. సముద్ర డొమైన్ అవగాహనను బలోపేతం చేస్తూ ఒక సమన్వయ కూటమిగా ఎలా పనిచేయవచ్చో ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.

గతంలో పోర్ట్ బ్లెయిర్‌లో నిర్వహించినప్పటికీ, విశాఖపట్నంలోని విస్తృతమైన నావికా మౌలిక సదుపాయాల కారణంగా 2020 నుండి వేదికను ఇక్కడికి మార్చారు. 2022లో 42 దేశాలు పాల్గొనగా ఈసారి ఆ సంఖ్య 74కు చేరడం విశేషం. ఇది ప్రపంచ సముద్ర సమాజంలో భారతదేశంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. పైరసీ, అక్రమ చేపల వేట మరియు సైబర్ బెదిరింపుల వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ 'మిలన్ 2026' ఒక గట్టి పునాదిగా నిలవనుంది.