
విశాఖ సాగర తీరంలో నౌకాదళ పండగ: ఐఎఫ్‌ఆర్ - 2026 ప్రారంభం!
సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ నావికాదళాల సంగమ క్షేత్రంగా మారింది. విశాఖపట్నం తీరం వేదికగా అంతర్జాతీయ ‘ఫ్లీట్ రివ్యూ’ బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె రాక సందర్భంగా నౌకాదళ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపన మధ్య రాష్ట్రపతికి 'గార్డ్ ఆఫ్ హానర్' సమర్పించారు. ఈ ప్రారంభోత్సవ ఘట్టం భారత నౌకాదళ క్రమశిక్షణను, దేశ గౌరవాన్ని ప్రతిబింబించేలా సాగింది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అనేది భారత రాష్ట్రపతి స్వయంగా భారత నావికాదళ సామర్థ్యాలను, అలాగే మిత్రదేశాల నుండి వచ్చిన నౌకలను సమీక్షించే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇందులో కీలకమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములు (సబ్‌మెరైన్లు) పాల్గొంటాయి.
ఈ కార్యక్రమంలో ఏపి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కూడా హాజరయ్యారు.
సముద్ర గర్భాన యుద్ధనౌకల సమీక్ష
ఈ వేడుకలో అత్యంత ప్రధానమైన ఘట్టం 'ఫ్లీట్ రివ్యూ'. సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి ఒక 'ఐఎన్ఎస్ సుమేధ' అనే ప్రెసిడెన్షియల్ యాచ్‌పై ప్రయాణిస్తూ, సముద్రంలో వరుసగా నిలిచిన యుద్ధనౌకలను, సబ్‌మెరైన్లను, ఇతర నౌకాదళ ఆస్తులను సమీక్షించారు. ఈ వేడుకలో సుమారు 71 నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, 50కి పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. వీటిలో 45 భారత నావికాదళానికి చెందిన స్వదేశీ నిర్మిత యుద్ధనౌకలు కాగా, మిగిలినవి మిత్రదేశాల నౌకలు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి నౌకలోని సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించడం విశేషం. ఇది భారతదేశం యొక్క సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత దృశ్యంగా నిలిచింది.
ప్రపంచ దేశాల భాగస్వామ్యం - 'మిలాన్' విన్యాసాలు
ఈసారి ఐఎఫ్ఆర్ కేవలం ఒక ప్రదర్శనకే పరిమితం కాకుండా, 'ఎక్సర్‌సైజ్ మిలాన్' ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం, కాన్ క్లేవ్ లతో కలిసి జరుగుతోంది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, నౌకలు, సబ్‌మెరైన్లు, యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా వంటి అగ్రరాజ్యాలతో పాటు దాదాపు 55 దేశాల నుండి ప్రతినిధులు, నౌకలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. జర్మనీ, ఫిలిప్పీన్స్, యూఏఈ దేశాల రక్షణ విభాగాలు తొలిసారిగా భారత్ నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం.
యుద్ధనౌకలు, జలాంతర్గాముల కళ్లు చెదిరే ప్రదర్శనలు, నౌకాదళ విమానాల ఫ్లైపాస్ట్‌లు, సెయిలింగ్ వెసెల్ పరేడ్‌లు, హెలికాప్టర్ల సహాయంతో సాగిన సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శనలు, మెరైన్ కమాండోల సాహసోపేతమైన విన్యాసాలు నావికాదళం యొక్క అద్భుతమైన సంసిద్ధతను చాటిచెప్పాయి.
ఫిబ్రవరి 15 నుండి 25 వరకు జరిగే ఈ పది రోజుల కార్యక్రమంలో వివిధ దేశాల నావికాదళాల మధ్య కార్యాచరణ పరమైన అవగాహనను పెంపొందించడం, సముద్ర భద్రతపై చర్చలు జరపడం ప్రధాన ఉద్దేశ్యం.
భారతదేశ తూర్పు తీరంలో వ్యూహాత్మకమైన విశాఖపట్నం నగరం ఈ అంతర్జాతీయ వేడుకకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016లో కూడా ఐఎఫ్ఆర్ ఇక్కడే విజయవంతంగా నిర్వహించబడింది. సహజసిద్ధమైన నౌకాశ్రయం, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ పోర్టు సిటీ, అంతర్జాతీయ స్థాయి నౌకాదళ విన్యాసాలకు అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో విశాఖ ప్రతిష్ట మరింత పెరిగింది.
ప్రపంచ దేశాల ఐక్యతకు చిహ్నం
ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, స్థిరమైన సముద్ర వ్యవస్థను నిర్ధారించడంలో దేశాల మధ్య ఐక్యత, విశ్వాసం, ఉమ్మడి బాధ్యత చాలా ముఖ్యమని చెప్పారు. వివిధ దేశాల జెండాలు కలిగిన నౌకలు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నావికుల సమక్షం "ప్రపంచ ఐక్యత"కు శక్తివంతమైన చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ఐఎఫ్‌ఆర్ థీమ్ " యునైటెడ్ త్రూ ఓషన్స్" (సముద్రాల ద్వారా ఐక్యత) అంతర్జాతీయ సమాజానికి సహకారం అనే బలమైన సందేశాన్ని ఇస్తోందని ఆమె అన్నారు.
సముద్ర రంగంలో భారతదేశం 'వసుధైవ కుటుంబకం' (ప్రపంచమే ఒక కుటుంబం) అనే నాగరికత విలువలతో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు. శతాబ్దాలుగా సముద్రాలు వాణిజ్యానికి, సాంస్కృతిక మార్పిడికి వారధులుగా ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. విశాఖపట్నంలోని గొప్ప సముద్ర వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, ఐఎఫ్‌ఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడం నగరం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరింత పెంచిందని ఆమె అన్నారు.
మహా సాగర్ విజన్
భారతదేశపు విజన్ అయిన మహా సాగర్ విజన్ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్) గురించి రాష్ట్రపతి మాట్లాడారు. ఇది ప్రాంతాలవ్యాప్తంగా ఉమ్మడి భద్రత, సామూహిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని వివరించారు. భారత నావికాదళం కేవలం దేశ ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించడంలో ముందుంటోందని ఆమె ప్రశంసించారు. మిత్రదేశాల నౌకాదళాల భాగస్వామ్యం పరస్పర విశ్వాసానికి సముద్ర శాంతికి నిదర్శనమని ఆమె అభినందించారు.
సాగర తీరంలో సాంస్కృతిక సందడి
ఈ పది రోజుల వేడుకల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 19న) ఆర్.కె. బీచ్ రోడ్డులో కళ్లు చెదిరే 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్' జరగనుంది. ఈ 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్' పౌరులను విశేషంగా ఆకర్షించనుంది. ఇందులో వివిధ దేశాల నావికాదళ బ్యాండ్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, భారత నావికాదళానికి చెందిన కళ్లు చెదిరే విన్యాసాలు ఉంటాయి.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం, సముద్ర దొంగల ముప్పును అరికట్టడం, విపత్తుల సమయంలో పరస్పర సహకారం వంటి అంశాలపై ఈ వేదిక ద్వారా భారత్ తన స్పష్టమైన దార్శనికతను ప్రపంచ దేశాల ముందు ఉంచింది.
కాగా, మంగళవారం సాయంత్రమే విశాఖ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు ఐఎన్ఎస్ డేగా వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఐఎఫ్ఆర్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ మెస్‌లో విందు కార్యక్రమం జరిగింది. ద్రౌపదీ ముర్ము గౌరవార్ధం నేవీ అధికారులు ఇచ్చిన ఈ విందులో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డి వి బి స్వామి పాల్గొన్నారు.
