Let's talk: editor@tmv.in
విశాఖ వేదికగా ప్రారంభమైన ‘పెసా’ మహోత్సవాలు

విశాఖ వేదికగా ప్రారంభమైన ‘పెసా’ మహోత్సవాలు

Panthagani Anusha
24 డిసెంబర్, 2025

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన స్వయంపాలనకు బలం చేకూర్చడం, పంచాయతీ రాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ) చట్టం–1996 (పెసా)పై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా డిసెంబర్ 23–24 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రెండు రోజుల పెసా మహోత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకగా ఆర్.కే.బీచ్ లో నిర్వహించిన ‘పెసా రన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెల్లవారుజామున జరిగిన ఈ పరుగులో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా గిరిజన యువత భారీగా హాజరై ఉత్సాహం నింపింది. గ్రామ సభల బలోపేతం, ప్రజల భాగస్వామ్య పాలన, గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రతీకగా ఈ రన్‌ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ పరుగును అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్, ఏపీఎస్‌ఐఆర్‌డీ, పీఆర్ కమిషనర్ ముత్యాలరాజు రేవు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్, డైరెక్టర్ వి.ఆర్.కృష్ణ తేజ మైలవరపు, అదనపు కమిషనర్ (పీఆర్) డా.ఎం.సుధాకర్ రావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పెసా చట్టం గిరిజనులకు కల్పించిన అధికారాలను వివరించారు. గ్రామ సభలకు నిర్ణయాధికారం, భూ అక్రమ స్వాధీనాన్ని అడ్డుకోవడం, చిన్న అటవీ ఉత్పత్తులపై గిరిజనుల హక్కులు, సహజ వనరులపై నియంత్రణ, సంప్రదాయాలు–సంస్కృతి పరిరక్షణ వంటి అంశాల్లో పెసా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిజమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే చట్టంగా పెసా నిలుస్తుందన్నారు.

పెసా రన్ అనంతరం మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ మహోత్సవం కోసం దేశంలోని 10 రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది గిరిజన క్రీడాకారులు విశాఖకు తరలివచ్చారు. పోర్ట్ స్టేడియంలో కబడ్డీ, విలువిద్య (ఆర్చరీ) పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వీటితో పాటు గిరిజన సంప్రదాయ ఆటలైన ఏడు పెంకులాట, గెడీ దౌడ్ (కర్రల నడక), మల్లఖంబ వంటి వింతైన ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 200 స్టాల్స్‌లో గిరిజన హస్తకళలు, నోరూరించే అడవి వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సాంప్రదాయ గిరిజన ఆటల ప్రదర్శన

మొదటి రోజు రెండో భాగంలో పలు పెసా రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన బృందాలు సాంప్రదాయ ఆటలను ప్రదర్శించాయి. చోలో, ఏడు పెంకులాట, గెడీ దౌడ్, రస కాశి, ఉప్పన్న బరేలు, పిథూల్, సికోర్, మల్లఖంబ, చక్కి ఖేల్ వంటి ఆటలు గిరిజనుల క్రీడా సంప్రదాయాలను ప్రతిబింబించాయి.

మహోత్సవానికి అనుసంధానంగా అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పది పెసా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల బలోపేతం, భూ అక్రమ స్వాధీన నివారణ, అటవీ ఉత్పత్తులపై హక్కులు, ఖనిజాల నియంత్రణ, వనరులు, నీటి వనరుల నిర్వహణ, మత్తు పదార్థాలు–వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ గిరిజన సంప్రదాయాలు–సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. రెండో రోజున గిరిజన అభివృద్ధి కోసం రూపొందించిన కొత్త పోర్టల్స్, పుస్తకాలను అధికారులు ఆవిష్కరించనున్నారు. సాయంత్రం జరిగే ముగింపు వేడుకల్లో ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు.