
విశాఖ వన్‌టౌన్‌లో అగ్నిప్రమాదం: స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు
విశాఖ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక టౌన్ కొత్త రోడ్డులో ఉన్న ఒక పాత సామాన్ల (స్క్రాప్) దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లో సమీపంలోని ఇతర షాపులకు వ్యాపించాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుకాణంలో భారీగా పాత సామాన్లు, చెక్క సామగ్రి, వ్యర్థ ఆయిల్ నిల్వలు ఉండటంతో మంటలు అత్యంత వేగంగా విస్తరించాయి. ఇక ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారుకొని ఆరు ఫైర్ టెండర్ల సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
రెండోసారి ప్రమాదం.. ఆందోళనలో స్థానికులు
ఈ ఘటనపై ఎన్‌టీఆర్ మెడికల్ సర్వీసెస్ ట్రస్ట్ చైర్మన్ సీతారామరాజు సుధాకర్ స్పందిస్తూ ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఇది రెండోసారి అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించామని, స్థానిక యువత కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. కాగా ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు తెలుస్తోందని అధికారులు పూర్తిస్థాయిలో అంచనా వేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో మంటలు అదుపు తప్పడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంటలు ఇతర నివాస గృహాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నామని వన్‌టౌన్ పోలీసులు వెల్లడించారు.
