Let's talk: editor@tmv.in
విశాఖ రైల్వే స్టేషన్‌లో 'రోబో' కాప్‌

విశాఖ రైల్వే స్టేషన్‌లో 'రోబో' కాప్‌

Panthagani Anusha
24 జనవరి, 2026

విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే భద్రతా వ్యవస్థలో ఒక సంచలనాత్మక ముందడుగు వేసింది. భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఒక హ్యూమనాయిడ్ రోబో పోలీసును ప్రయోగాత్మకంగా రంగంలోకి దించింది. వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రోబో కాప్‌ను గురువారం సాయంత్రం ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్ జనరల్ అలోక్ బొహ్రా, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా ఘనంగా ప్రారంభించారు. ఈ రోబోకు ‘ఏఎస్సీ అర్జున్’ అని నామకరణం చేశారు.

స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన

పూర్తిగా విశాఖపట్నంలోనే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రోబోను, ఆర్‌పీఎఫ్‌ బృందం ఏడాది కాలంగా సీనియర్‌ రైల్వే, భద్రతా అధికారుల మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేసింది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) కనెక్టివిటీ, రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థలతో ఈ రోబో పనిచేస్తుంది.

‘ఏఎస్సీ అర్జున్‌’ విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఎనిమిది ప్లాట్‌ఫామ్‌లతో పాటు రైల్వే కార్యాలయాలు, పార్కింగ్‌ ప్రాంతాల్లో నిత్యం పహారా కాస్తుంది. ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా స్టేషన్‌లోకి ప్రవేశించే అనుమానితులు, చొరబాటుదారులు తరచు దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారి చిత్రాలను విశ్లేషించి ఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని తక్షణమే అప్రమత్తం చేస్తుంది. రద్దీ సమయాల్లో ప్రయాణికుల సంఖ్యను విశ్లేషించి జనసందోహ నియంత్రణకు అవసరమైన సూచనలను ఇస్తుంది. భద్రతా లోపాలు, అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తుంది.

ఈ రోబో ప్రత్యేకత ఏమిటంటే… ప్రయాణికులతో నేరుగా సంభాషించగలగడం. ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో భద్రతా ప్రకటనలు, హెచ్చరికలు, సమాచార సూచనలు ప్రసారం చేస్తుంది. ప్లాట్‌ఫామ్‌లపై నిరీక్షిస్తున్న ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రమాద హెచ్చరికలను తెలియజేస్తుంది.

మంటలు, పొగను ముందుగానే గుర్తింపు

స్టేషన్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలు, పొగను ముందుగానే గుర్తించే సెన్సార్‌ వ్యవస్థను ఇందులో అమర్చారు. ప్రమాద సంకేతాలు కనిపించిన వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి తక్షణ అలర్ట్‌ పంపి, అప్రమత్తం చేస్తుంది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా మాట్లాడుత ప్రయాణికుల భద్రత, రక్షణ, సేవలందించడంలో ‘ఏఎస్సీ అర్జున్‌’ ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి స్మార్ట్‌ అసిస్టెంట్‌లా పనిచేస్తుందని తెలిపారు. మానవ వనరులపై భారం తగ్గడంతో పాటు స్పందన వేగం పెరుగుతుందన్నారు.

మరిన్ని స్టేషన్లకు విస్తరణ

విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ రోబో సేవలను రాబోయే రోజుల్లో ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లకు విస్తరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రయాణికులకు సురక్షితమైన, భద్రమైన ప్రయాణానుకూలమైన రైల్వే వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.