
విశాఖ ప్రైమ్ భూములను చవకధరలకు కార్పొరేట్లకు ఇస్తున్నారు: వైఎస్ఆర్‌సీపీ
ఎన్డీఏ ప్రభుత్వం ప్రైమ్ ల్యాండ్లను కార్పొరేట్లకు చవకధరలకు కేటాయిస్తూ రాష్ట్రానికి భారీ నష్టం కలిగిస్తోందని వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు.
ప్రెస్‌మీట్లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం విశాఖపై చూపుతున్న ఆసక్తి, గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేయాలనుకున్న విధానాలనే ఇప్పుడు అనుసరిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రయత్నించినప్పుడు వ్యతిరేకించిన వారు, నేడు అదే నగరాన్ని పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యకరమన్నారు.
కోగ్నిజెంట్‌తో పాటు భారీ పెట్టుబడులపై అనుమానాలు
శుక్రవారం చంద్రబాబు నాయుడు విశాఖలో రూ.3,700 కోట్ల పెట్టుబడులతో కోగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ సహా ఎనిమిది కంపెనీలకు భూమిపూజ చేసిన విషయాన్ని ప్రస్తావించిన అమర్నాథ్ ఈ ప్రాజెక్టుల వెనుక భూముల కేటాయింపులో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని అదేవిదంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టుబడుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాక గ త ప్రభుత్వ ఐటీ విధానాలను ప్రస్తావించిన ఆయన, ఇన్ఫోసిస్‌ను విశాఖకు రప్పించడంలో జగన్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. టీసీఎస్ కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం చూపిన ఆసక్తితోనే కార్యకలాపాలు ప్రారంభించిందని పేర్కొన్నారు.
ప్రైమ్ ల్యాండ్లను చవకగా విక్రయిస్తున్నారా?
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విలువైన భూములను చవకగా ఎవరికీ ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వం ప్రాముఖ్యత ఉన్న భూములను తక్కువ ధరలకు కార్పొరేట్లకు అప్పగిస్తోందని అమర్నాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గుజరాత్‌లో లులూ గ్రూప్ భూములు కొనడానికి భారీగా ఖర్చు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అతి తక్కువ ధరల్లో భూములు దక్కడం ప్రజలకు సందేహాలు కలిగిస్తోందన్నారు.
ఉద్యోగాల వివరాలు ఎక్కడ?
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎన్నెన్ని ఉద్యోగాలు సృష్టించారో ప్రజలకు వెల్లడించాలన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్‌ను ప్రోత్సహించడానికి ప్రజా ధనంతో ఎంత ఖర్చు చేశారో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఏ జూనియర్ భాగస్వాములను పక్కనబెట్టారా?
ఎన్డీఏ కూటమిలో చిన్న పార్టీలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని విజయాలకు చెంద్రబాబు నాయుడే క్రెడిట్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తూ, ఇది కూటమి పార్టీ ప్రధాన నేతలను పక్కన పెట్టేసినట్టుగా ఉంది ఆరోపించారు. అయితే అమర్నాథ్ చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన అందలేదు.
