
విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డు: 362 రోజుల్లో 90.29 మిలియన్ టన్నుల సరుకు రవాణా
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (పీపీఏ) తన సుదీర్ఘ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రవాణా రవాణా చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 92 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 362 రోజుల్లోనే 90.29 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించి అరుదైన ఘనత సాధించింది.
పాత రికార్డులన్నీ కనుమరుగు
గత 2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 82.62 మిలియన్ టన్నుల నిర్వహణే ఇప్పటివరకు అత్యధికం కాగా ప్రస్తుత ఏడాది ఆ సంఖ్యను గణనీయంగా అధిగమించి కొత్త బెంచ్‌మార్క్‌ను వీపీఏ సృష్టించింది.ఈ మేరకు పోర్ట్ చైర్‌పర్సన్ ఎం.అంగముత్తు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. పోర్ట్ సిబ్బంది నిరంతర కృషి, భాగస్వామ్య సంస్థలతో సమర్థవంతమైన సమన్వయం వల్లే ఈ అద్భుత ఫలితం సాధ్యమైందని ఆయన కొనియాడారు.
లక్ష్యం వంద మిలియన్ టన్నులు
పోర్ట్ ప్రగతిపై అంగముత్తు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆకాంక్షించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల సరకు నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికత వ్యూహాత్మక ప్రణాళికలతో విశాఖ పోర్ట్ దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందని పేర్కొన్నారు.
పోర్ట్ సాధించిన ఈ విజయం పట్ల డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి కొరటి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది అంకితభావం, నిబద్ధత వల్లే ఈ రికార్డు స్థాయి థ్రూపుట్ సాధ్యమైందని ఆమె ప్రశంసించారు. దేశ వాణిజ్య రంగంలో విశాఖ పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోందని మరింత మెరుగైన సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
