Let's talk: editor@tmv.in
విశాఖ పోర్టు సరికొత్త రికార్డు.. 327 రోజుల్లో 80 మిలియన్ టన్నుల సరుకు రవాణా

విశాఖ పోర్టు సరికొత్త రికార్డు.. 327 రోజుల్లో 80 మిలియన్ టన్నుల సరుకు రవాణా

Panthagani Anusha
23 ఫిబ్రవరి, 2026

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ తన 92 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ముగియడానికి మరో నెల రోజులకు పైగా సమయం ఉండగానే కేవలం 327 రోజుల్లోనే 80 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నిర్వహించి రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. శుక్రవారం (ఫిబ్రవరి 21) నాటికి ఈ ఘనత సాధించినట్లు పోర్టు చైర్‌పర్సన్ ఎం. అంగముత్తు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.

ఏటేటా మెరుగుపడుతున్న పనితీరు

గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది విశాఖ పోర్టు పనితీరు అసాధారణంగా మెరుగుపడింది. 80 మిలియన్ టన్నుల మార్కును చేరుకోవడానికి గతంలో తీసుకున్న సమయం కంటే ఈసారి చాలా తక్కువ రోజుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. కాగా గత ఏడాది 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ ఘనత సాధించడానికి 362 రోజులు పట్టగా 2024–25లో 357 రోజులు పట్టింది. అయితే ఈసారి సాంకేతికతను జోడించి సమర్థవంతమైన నిర్వహణతో కేవలం 327 రోజుల్లోనే ఈ మైలురాయిని దాటడం గమనార్హం.

సమిష్టి కృషికి దక్కిన ఫలితం

ఈ చారిత్రాత్మక విజయం వెనుక పోర్టు సిబ్బంది అంకితభావం వాటాదారుల సమన్వయం పక్కా వ్యూహాత్మక ప్రణాళికలే కారణమని చైర్‌పర్సన్ అంగముత్తు కొనియాడారు. సరుకు రవాణాలో ఎక్కడా జాప్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయడం సరుకు నిర్వహణ పద్ధతుల్లో ఆధునిక మార్పులు తీసుకురావడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన వివరించారు. ఇదే ఉత్సాహంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 90 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని కూడా సునాయాసంగా అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.