Let's talk: editor@tmv.in
విశాఖ జూలో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖ జూలో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Dantu Vijaya Lakshmi Prasanna
30 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. గురువారం విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించిన ఆయన, అక్కడి రెండు జిరాఫీలను ఏడాది కాలానికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దత్తతకు సంబంధించిన పూర్తి నిర్వహణ ఖర్చులను ఆయన స్వయంగా భరించనున్నారు.

అమ్మ పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం

ఏపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకృతి, మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను చాటుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం ప్రభుత్వమే కాకుండా, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి వన్యప్రాణుల సంరక్షణ కోసం సి.ఎస్.ఆర్ నిధులను కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జూలో నూతనంగా నిర్మించిన ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. టైగర్, లయన్, బ్లాక్ బేర్, హిప్పోపొటామస్ ఎన్‌క్లోజర్‌లను సందర్శించి, జంతువుల ఆరోగ్య పరిస్థితి వాటికి అందుతున్న ఆహారం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన స్వయంగా ఏనుగులకు, జిరాఫీలకు ఆహారం తినిపించి కాసేపు గడిపారు.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట

జూ సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ కంబాలకొండ ఇకో పార్కును సందర్శించారు. అక్కడ 'సిటీ ఫారెస్ట్'ను ప్రారంభించడంతో పాటు, ఎకో-టూరిజం మార్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రణాళికలపై అటవీ శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం, వన్యప్రాణుల ఆవాసాలను కాపాడటం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.