Let's talk: editor@tmv.in
విశాఖ- కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

విశాఖ- కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

Panthagani Anusha
13 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఐటీ రంగం నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నం ఐటీ హిల్స్‌లోని కాపులుప్పాడలో గ్లోబల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దారులు తెరిచే అతి ముఖ్యమైన ఘట్టంగా నిలవనునాట్లు అధికారులు భావిస్తున్నారు.

కాగ్నిజెంట్ భారీ పెట్టుబడి

సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో మూడు దశల్లో నిర్మించనున్న ఈ క్యాంపస్ కోసం సంస్థ రూ.1,583 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 8,000 మందికి ఉపాధి లభించనుంది. 2026 నాటికి మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. ఈలోపు రషికొండ హిల్–2లోని మహతి ఫిన్‌టెక్ భవనంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయగా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 1,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అత్యాధునిక డిజిటల్ రంగాలపై దృష్టి సారించనుంది.

మరో 8 సంస్థల రంగ ప్రవేశం

కాగ్నిజెంట్‌తో పాటు మరో ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందడుగు వేశాయి. ఈ సంస్థల్లో టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా,ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్,మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్‌కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ ఎనిమిది కంపెనీలు కలిపి దాదాపు రూ. 3,740 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో అదనంగా 41,700 ఉద్యోగాలు సృష్టి అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఐటీ దిగ్గజాల దృష్టిలో విశాఖ

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కోగ్నిజెంట్ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్న సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రపంచపు 34 బిలియన్ డాలర్ల ఐటీ దిగ్గజమైన కోగ్నిజెంట్, వచ్చే నాలుగు నుండి ఐదు సంవత్సరాల్లో విశాఖలో ఉద్యోగులను ఒక లక్షకు పెంచాలని సూచించారు. కంపెనీ అవసరాలను ప్రభుత్వం పూర్తిగా తీర్చుతుందని హామీ ఇచ్చారు.ప్రస్తుతం నగరంలో 150కు పైగా టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయని, ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే 20 శాతం తక్కువ జీవన వ్యయం ఉండటమే విశాఖకు ప్రధాన ఆకర్షణ అని సీఎం పేర్కొన్నారు

దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభా, నాయకత్వానికి కొదవ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో 150 ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం 20 శాతం తక్కువగా ఉందని గుర్తుచేశారు.

విశాఖలో ఐటీ కంపెనీల వేగవంతమైన వృద్ధిని ప్రస్తావిస్తూ, గూగుల్ అక్కడ 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. నెట్‌-జీరో కాన్సెప్ట్‌ను అమలు చేస్తూ నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని వాగ్దానం చేశారు.

విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతామని, 2032 నాటికి దీనిని 130 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రాంతంగా రూపొందించాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు.

రికార్డు స్థాయిలో పెట్టుబడులు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు, రాష్ట్రం మొత్తం మీద రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రంలో మొత్తం 23 లక్షల ఉద్యోగాలు సృష్టి చెందనున్నాయని వెల్లడించారు.

అదేవిధంగా 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఎదుగుతుందని, భారతీయులు అత్యంత ప్రభావశీలులవుతారని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 15శాతం వృద్ధిరేటు వైపు దూసుకెళ్లించే లక్ష్యాన్ని వెల్లడించారు. దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గొప్ప అదృష్టమని ఆయన అన్నారు.

విశాఖ- కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన - Tholi Paluku