
విశాఖ ఉక్కు కర్మాగారంలో స్వల్ప అగ్నిప్రమాదం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగంలోని మెటల్ పిట్‌లో మెటల్ స్క్రాప్‌ను వదిలే సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.
డంపింగ్ ప్రాంతంలో ట్రక్కు నుంచి పడిన వేడి మెటల్ చినగులు (నిప్పు రవ్వలు) అక్కడ పేరుకుపోయిన ఎండిన గడ్డి, చెత్తపై పడటం వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ జె. మల్లికార్జున్ తెలిపారు. మంటలు అంటుకున్న వెంటనే అధికంగా పొగ వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులను సిబ్బంది తక్షణమే సురక్షితంగా బయటకు పంపినట్లు పేర్కొన్నారు.
ఇక అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. డంపింగ్ జోన్ ఎక్కువగా నిర్మానుష్య ప్రాంతం కావడంతో పెద్ద నష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
ఇలాంటి స్వల్ప ఘటనలు డంపింగ్ ప్రాంతంలో అప్పుడప్పుడు సంభవిస్తాయని, భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి సేఫ్టీ పరిశీలనలు నిర్వహిస్తున్నట్లు మల్లికార్జున్ పేర్కొన్నారు. ప్రమాదంలో చిన్నప్పటి నష్టం వాటిల్లినట్టు అధికారులు స్పష్టం చేశారు.
