Let's talk: editor@tmv.in
విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించండి!

విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించండి!

FL - YUGDR
28 సెప్టెంబర్, 2025

నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఆర్సెలార్ మిట్టల్‌కు సేవ చేయడం నిలిపివేసి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా జేఏసీ చైర్మన్ ఎం జగ్గు నాయుడు, విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ ,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సి ఎస్ జె అచ్యుతరావు, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి నాగభూషణం, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు అనకాపల్లి జిల్లా ఆర్సెలార్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పై చూపిస్తున్న తపన విశాఖ స్టీల్ ప్లాంట్ పై చూపకపోవడం ప్రజలను వంచించడమే అన్నారు.

దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ స్టీల్ ప్లాంట్లకు కేంద్రం సొంత గనులు కేటాయించింది .చివరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో ఇంకా పరిశ్రమే ఏర్పాటు కాని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు కూడా సొంత గనులు కేటాయించాలని విశాఖ ఎం పి శ్రీ భరత్ తో సహా, రాష్ట్ర తెలుగుదేశం ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖామంత్రిని కలవడం, మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు బిజెపికి చెందిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించడం, నేడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడం ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. విశాఖ ఉక్కు కు సొంత గనులు గురించి వీరు నోరు విప్పకపోవడం ప్రజలకు ద్రోహం చేయడమే.

సొంత గనులు లేక విశాఖ ఉక్కు ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి నాలుగు వేల రూపాయలు అదనపు ఉత్పత్తి ఖర్చు భరించాల్సి వస్తోంది. దీని వలన సంస్థ నష్టాల బారిన పడుతోంది. సొంతగనులు లేకుండా ఏ ఉక్కు పరిశ్రమ మనుగడ సాగించలేదని, లాభాల బాట పట్టలేదని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలకు తెలుసు. అయినా విశాఖ ఉక్కు కు కావాలనే గనులు కేటాయించకుండా నష్టాలపాలు చేస్తున్నారు‌. వీరు చేస్తున్న ఈ ద్రోహాన్ని కార్మికుల పైన నెడుతున్నారు.

కార్మికులు అధికంగా ఉన్నారని దశాబ్దాల తరబడి పనిచేస్తూ అత్యంత నైపుణ్యం సాధించిన ఐదువేల మంది కాంటాక్ట్ కార్మికులను చట్టవిరుద్ధంగా అమానుషంగా తొలగించారు. వీరి స్థానంలో అనుభవం లేని ఇతర రాష్ట్రాల కార్మికులను విధుల్లోకి తీసుకొని పనిచేయిస్తున్నారు. కార్మికుల అధికమైతే ఇతర రాష్ట్రాల వారిని ఎందుకు తీసుకుంటున్నారు? దీనిని విశాఖ ఎంపీ ,గాజువాక ఎమ్మెల్యే ఆపడం లేదు.

కూటమి నేతలు నోరు విప్పితే11440 కోట్లు ప్యాకేజీ సాధించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అంటారు. ఈ ప్యాకేజీ నిధులు స్టీల్ ఉత్పత్తికి, ముడి సరుకు కు,యంత్రాలకు, కార్మికుల జీతాలకు వినియోగించరాదని ఆంక్షలు పెట్టారు. ఈ ప్యాకేజీ వలన విశాఖ ఉక్కు ఒరిగిందేమీ లేదు. ఈ నిధులతో జీఎస్టీ, బ్యాంకు రుణాలు , అప్పులు తీర్చేసి, కార్మికులను పూర్తిగా తగ్గించేసి, ఈవోఐ పేరున కీలక డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటు వారికి కట్టబెట్టి ఆ తర్వాత ప్లాంట్ ను మొత్తం అదాని, మిట్టల్ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలన్నది మోడీ ప్రభుత్వ కుట్ర. ఈ కుట్రలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు భాగస్వాములు కావడం ఆందోళనకరం, ప్రజా వంచన అని దుయ్యబట్టారు.

విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించే వరకు మిట్టల్ స్టీల్ ప్లాట్ కు గనులు కేటాయించరాదని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఏపీ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి కె దేవ సహాయం, ఏఐటియుసి జిల్లా నాయకులు పడాల రమణ, సిఐటియు జిల్లా నాయకులు బి జగన్,ఎస్ జ్యోతీశ్వర రావు, కే ఎం కుమార మంగళం,ఎం సుబ్బారావు, వై రాజు, టి నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించండి! - Tholi Paluku