
విశాఖలో 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం కీలకమైన “గ్రోత్ ఇంజిన్”గా మారుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ రంగంలో వేగవంతమైన పురోగతి సాధించేందుకు అధికారులు మరింత చురుకుదనం చూపించాలని ఆయన సూచించారు.
వెలగపూడి సచివాలయంలో మంత్రి దుర్గేష్ తన ఛాంబర్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే 15 ఏళ్లకు సంబంధించిన ఏపీటూరిజం అభివృద్ధి దిశ, ఆర్థిక ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు.
సమీక్షలో భాగంగా గతంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఇచ్చిన దిశానిర్దేశాలు, కొత్త పెట్టుబడులు, హోటల్స్, హాస్పిటాలిటీ రంగం విస్తరణ, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు, హోమ్‌స్టేలు, కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా విశ్లేషించారు. పర్యాటక ప్రాంతాలకు మరింత విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు కొత్త వ్యూహాలను అమలు చేయాలని మంత్రి సూచించారు.
ప్రత్యేకంగా, గోదావరి పుష్కరాల నాటికి ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకోవాలని, బాధ్యతాయుత పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వాలని, క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి అనుకూల చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
ఇక, ఇటీవల ముంబయిలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్‌పో-2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో, సంస్థ ప్రతినిధులు రామ్ ప్రకాష్ మహేశ్వరీ, అంకుర్ మహేశ్వరిలు మంత్రి దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విశాఖపట్నంలో వీఎంఆర్డీఏ పరిధిలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలను ఇప్పటికే గుర్తించినట్లు వారు తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు అందించిన సహకారం, మార్గదర్శకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని “స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047”లో భాగంగా వినోద రంగాన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ప్రధాన చిహ్నంగా మలచడం లక్ష్యమని చెప్పారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేసి, ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈడీలు ఏపీటీఏ డిప్యూటీ సీఈవోతో పాటు పర్యాటక శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
