
విశాఖలో మృతదేహాల కలకలం
విశాఖపట్నంలోని షీలానగర్‌లో రోడ్డుపక్కన రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. అయితే అవి శ్మశానవాటిక నుంచి వెలికితీసుకొచ్చినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల వయసు, గుర్తింపుపై ప్రస్తుతానికి స్పష్టత లేదని ఓ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. లభ్యమైన మృతదేహాల్లో ఒకటి వృద్ధుడిదిగా కనిపిస్తోందని అందులో ఒకటి పురుషుడిది, మరొకటి మహిళ మృతదేహంగా గుర్తించినట్లు తెలిపారు.
షీలానగర్‌లో భవనాల కూల్చివేత అనంతరం వచ్చిన వ్యర్థాలను డంప్ చేసే ప్రాంతంలో మృతదేహాలు కనిపించాయి. అక్కడ తెల్లటి వస్త్రాలు, పూలమాలలు సహా అంత్యక్రియలు, ఖననానికి సంబంధించిన పలు వస్తువులు కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో రెండు మృతదేహాలను షీలానగర్ ప్రాంతానికి తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. వాటిని అక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఏ వాహనంలో తరలించారు అనే విషయాలను తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 194 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
