
విశాఖలో ‘మిలాన్ విలేజ్’ ప్రారంభం
భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు 'మిలాన్-2026'లో భాగంగా ఆదివారం విశాఖలో 'మిలాన్ విలేజ్'ను ఘనంగా ప్రారంభించారు. తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అనుభవ వేదికను ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించారు. 70కి పైగా దేశాల నుంచి వచ్చిన నౌకాదళ ప్రతినిధులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం, పరస్పర సంస్కృతులను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా ఈ విలేజ్‌ను తీర్చిదిద్దారు.
భారతీయ వారసత్వానికి అద్దం పట్టేలా..
'సహచర్యం, సహకారం, సమన్వయం' అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ 'మిలాన్ విలేజ్' భారతీయ సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలు భారతీయ జానపద నృత్యాలు, సంగీతంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుండగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తులు, నౌకాదళ జ్ఞాపికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు విదేశీ ప్రతినిధులకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నోరూరించే వంటకాలను రుచి చూపించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టులను సిద్ధం చేయడంతో ఈ విలేజ్ ఒక మినీ ఇండియాను తలపిస్తోంది.
వరుస కార్యక్రమాలతో విశాఖకు కొత్త శోభ
ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా మాట్లాడుతూ.. వృత్తిపరమైన నౌకాదళ విన్యాసాలతో పాటు సాంస్కృతిక అనుసంధానం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. విశాఖ నగరం వరుసగా 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ', 'మిలాన్', 'అయాన్స్' వంటి మెగా ఈవెంట్లకు వేదిక కావడం భారత నౌకాదళ చరిత్రలో ఒక కీలక ఘట్టమని ఆయన కొనియాడారు. ఇది భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని, సముద్ర భద్రతపై అవగాహనను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.
10 రోజుల పాటు హోరాహోరీ విన్యాసాలు
ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరిగే ఈ 'మిలాన్' విన్యాసాలు రెండు ప్రధాన దశల్లో కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా తీర ప్రాంతంలో (హార్బర్ ఫేజ్), అలాగే నడిసముద్రంలో (సీ ఫేజ్) జలాంతర్గాములను అడ్డుకోవడం, విమాన దాడుల నుంచి రక్షణ పొందడం, ప్రమాదంలో ఉన్న వారిని రక్షించే గాలింపు చర్యల వంటి అత్యంత క్లిష్టమైన యుద్ధ విన్యాసాలను నౌకాదళాలు ప్రదర్శించనున్నాయి.
రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17, 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 18న విశాఖ సముద్ర తీరంలో జరిగే ప్రతిష్టాత్మక 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ' (అంతర్జాతీయ నౌకా దళ ప్రదర్శన) కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. వివిధ దేశాల నౌకా దళాల విన్యాసాలను, శక్తి సామర్థ్యాలను రాష్ట్రపతి స్వయంగా వీక్షించనున్నారు.
ప్రధాని మోడీ ‘మహాసాగర్’ లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోడీ ‘మహాసాగర్’ దార్శనికతకు అనుగుణంగా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా పనిచేస్తోందని ఈ విన్యాసాలు నిరూపిస్తున్నాయి. సముద్ర ప్రయాణాలు అందరికీ అందుబాటులో ఉండాలని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా సాగాలని భారత్ కోరుకుంటోంది. భద్రత విషయంలో తమ భాగస్వామ్య దేశాలకు అండగా ఉంటూ, సముద్ర తీరాల రక్షణకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా భారత నౌకాదళం ప్రపంచానికి స్పష్టం చేసింది.
