
విశాఖలో బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ర్యాలీ
భారత ఆతిథ్యంలో జరుగుతున్న బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రుల సమావేశం సందర్భంగా విశాఖపట్నంలో 'బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ఈవెంట్' ఉత్సాహంగా సాగింది. 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్' 87వ ఎడిషన్‌లో భాగంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీకి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా ఖడ్సే నాయకత్వం వహించారు.
ఈ వారం నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఉన్నత్ భారత్ అభియాన్ థీమ్‌తో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యూఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన మంత్రులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. సభ్యదేశాల మధ్య స్నేహం, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సైక్లింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా నిలకడగా విస్తరిస్తోందని అన్నారు. ఫిట్‌నెస్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దేశవ్యాప్తంగా 18,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యువత ఈ సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైక్లింగ్ వల్ల అద్భుతమైన శారీరక వ్యాయామం లభించడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని, కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని తెలిపారు. ఇది ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు దోహదపడుతుందన్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. దృఢమైన సమాజమే సమృద్ధి కలిగిన దేశాన్ని నిర్మించగలదు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఆదివారం సైక్లింగ్ చేస్తూ అందరం ఆరోగ్యంగా ఉందామని పిలుపునిచ్చారు.
నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు భారతదేశంలో క్షేత్రస్థాయి వరకు సైక్లింగ్ ఉద్యమాన్ని తీసుకెళ్లిన తీరును, ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ 87వ ఎడిషన్‌లో పాల్గొన్న ప్రతినిధులు, యువత మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేశారు.
