
విశాఖలో తొలి లైట్‌హౌస్ మ్యూజియం ఏర్పాటు: మంత్రి సర్బానంద సోనోవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి లైట్‌హౌస్ మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. విశాఖపట్నంలో నిర్వహించిన 'ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0' ముగింపు సభలో కేంద్ర పోర్టులు, జలవనరుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. విశాఖ పోర్టు ప్రాంగణంలోని పాత లైట్‌హౌస్ ప్రాంతంలో ఈ మ్యూజియం నిర్మించనున్నట్లు దీని కోసం విశాఖపట్నం పోర్టు అథారిటీ, లైట్‌హౌసెస్ డైరెక్టరేట్ జనరల్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. సముద్ర వారసత్వ సంపదను కాపాడుతూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
గత పదేళ్లలో దేశవ్యాప్తంగా లైట్‌హౌస్ పర్యాటక ప్రాంతాలకుసందర్శకుల సంఖ్య ఐదు రెట్లు అధికమైందని తెలిపారు. సోనోవాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 50 వేల మంది సందర్శకులు ఈ ఫెస్టివల్‌కు రావడం విశేషం ఇది లైట్‌హౌసుల పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని చాటుతోందని అన్నారు. ఇది కేవలం నౌకలకు దారి చూపే నిర్మాణాలు మాత్రమే కాదని, సంస్కృతి, సామాజిక భాగస్వామ్యం ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 లైట్‌హౌసులను అభివృద్ధి చేస్తున్నామని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఫెస్టివల్ ఆరంభం నుంచి ముగింపు వరకు సందర్శకులను అలరించింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించిన ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడి నృత్యంతో పాటు ఈశాన్య రాష్ట్రాల జానపద కళలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే, 40కి పైగా స్వయం సహాయక సంఘాల స్టాళ్లలో ప్రదర్శించిన హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు మహిళా సాధికారతకు అద్దం పట్టాయి. లైట్‌హౌసుల విద్యుత్ అలంకరణలు, ఇంటరాక్టివ్ జోన్లతో విశాఖ తీరం కొత్త శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న తొలి లైట్‌హౌస్ మ్యూజియాన్ని సముద్ర వారసత్వం, నావిగేషన్ చరిత్రకు కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ మ్యూజియంలో భారతదేశంలో లైట్‌హౌసుల ఆవిర్భావం నుంచి వాటి అభివృద్ధి వరకూ సంబంధించిన అరుదైన చిత్రాలు, డాక్యుమెంట్లు, సమాచారం ప్రదర్శించనున్నారు. పాతకాలంలో ఉపయోగించిన లైట్‌హౌస్ లెన్సులు, దీపాలు, సంకేత పరికరాలు కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఆధునిక నావిగేషన్ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు జీపీఎస్, రాడార్, ఆటోమేటెడ్ లైట్‌హౌస్ వ్యవస్థలపై ఇంటరాక్టివ్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర భద్రత, నౌకా ప్రమాదాల నివారణ, తీర రక్షణలో లైట్‌హౌసుల కీలక పాత్రను వివరించే ప్రత్యేక విభాగం కూడా ఉండనుంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత సముద్ర సంస్కృతి, పోర్టుల అభివృద్ధి, మత్స్యకారుల జీవన విధానాన్ని ప్రతిబింబించే గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, యువత కోసం సముద్ర విజ్ఞానం, నావిగేషన్‌పై అవగాహన కల్పించే విద్యా కేంద్రం ఈ మ్యూజియంలో భాగంగా ఉండనుంది.
పిల్లలకు ఆకర్షణీయంగా లైట్‌హౌస్ ప్రాధాన్యతను తెలియజేసేందుకు ప్రత్యేక అనుభూతి జోన్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు తూర్పు తీరంలోని లైట్‌హౌసులు, పర్యాటక ప్రదేశాల వివరాలు అందించే సమాచార కేంద్రం కూడా మ్యూజియంలో ఉండనుంది
