Let's talk: editor@tmv.in
విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ–2026

విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ–2026

Panthagani Anusha
22 డిసెంబర్, 2025

సముద్ర భద్రతను బలోపేతం చేయడం దేశాల మధ్య నేవీ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా భారత నేవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్ )2026ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీలు కలిసి సముద్రంలో సాధన కార్యక్రమాలు చేస్తాయి. అలాగే ఇండియన్ ఓషన్ ప్రాంతానికి చెందిన దేశాల నేవీ ఉన్నతాధికారులు ఒకచోట చేరి సముద్ర భద్రతపై చర్చిస్తారు.

ఈ విషయాన్ని కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ ఎస్.వెంకటేష్ కుమార్ ఆదివారం వెల్లడించారు.ఐఎఫ్ఆర్ కేవలం ఆడంబర కార్యక్రమం కాదని సముద్ర భద్రతకు ఎదురయ్యే సవాళ్లను కలిసి ఎదుర్కొనేందుకు ఇది ఒక కీలక వేదికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాపారం, ఇంధన సరఫరాలు, ఆహార భద్రత ఎక్కువగా సముద్ర మార్గాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో సైబర్ దాడులు, హైబ్రిడ్ యుద్ధాలు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి కొత్త ముప్పులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క దేశం తానే సముద్రాలను కాపాడలేదని, సమిష్టి చర్యలే పరిష్కారమని స్పష్టం చేశారు.

ఈసారి ఐఎఫ్ఆర్ లో 100కిపైగా దేశాలు తమ యుద్ధ నౌకలు, ఉపసముద్ర నౌకలు, విమానాలు, ప్రతినిధులతో పాల్గొననున్నాయి. డ్రోన్లు, ఆటోనమస్ ప్లాట్‌ఫామ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సముద్ర పర్యవేక్షణ వ్యవస్థలు వంటి నూతన సాంకేతికతలు ప్రదర్శించనున్నారు.

అదేవిధంగా నేవీల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, చట్టపరమైన నియమాల అమలు, చిన్న నేవీలు–కోస్ట్ గార్డ్‌లకు శిక్షణ, లాజిస్టిక్ సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. విపత్తు సహాయం, మానవతా సేవలు కూడా ఐఎఫ్ఆర్ లో ముఖ్య భాగంగా ఉంటాయి.

అయితే విశాఖపట్నంలో ఐఎఫ్ఆర్ నిర్వహించడం ఇది రెండోసారి. గతంలో 2016లో ఇదే నగరంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఐఎఫ్ఆర్ 2026 ద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకార సముద్ర భద్రతకు భారత్ ఇచ్చే ప్రాధాన్యత మరింత స్పష్టమవుతుందని నేవీ అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అనేది ప్రపంచంలోని అనేక దేశాల నౌకాదళాలు ఒకేసారి చేరి నిర్వహించే ప్రతిష్ఠాత్మక సముద్ర కార్యక్రమం. ఇందులో ప్రతి దేశం తమ యుద్ధ నౌకలు, నౌకాదళ విమానాలను సముద్రంలో ప్రదర్శించి సామర్థ్యాన్ని చూపిస్తాయి. నౌకలు ఒక నిర్దిష్ట క్రమంలో సముద్రంలో నిలబడి ప్రదర్శన ఇస్తాయి. ఈ సందర్భంలో ఉన్నతాధికారులు, ముఖ్య వ్యక్తులు నౌకలను సమీక్షించి గౌరవ వందనం చేస్తారు.

ఇది కేవలం సైనిక ప్రదర్శన మాత్రమే కాకుండా, దేశాల మధ్య సముద్ర భద్రత, రక్షణ సహకారం, సాంకేతిక నైపుణ్యం, శిక్షణ స్థాయిని చూపించే వేదిక. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ద్వారా దేశాలు తమ నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయి, అలాగే రాజనీతి, డిప్లొమాటిక్, స్నేహ సంబంధాలను మరింత బలపరిచే అవకాశాన్ని పొందుతాయి.