
విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ మహోత్సవాలు
విశాఖపట్నం వేదికగా ఈనెల 18,19 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి నావికాదళ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), 19న మిలాన్–2026 కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో తూర్పు నావల్ కమాండ్ (ఈఎన్ సీ) చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ (వీఎస్ఎం) సహా నౌకాదళ అధికారులు సమావేశమై లాజిస్టిక్, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ రెండు కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి భారీగా నౌకలు, విమానాలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. శ్రీలంక, ఇరాన్ సహా 19 దేశాలకు చెందిన నౌకలు పాల్గొననున్నట్లు అధికారులు సీఎస్‌కు తెలిపారు. దాదాపు 4 వేల మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అదనంగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన మూడు నౌకలు, సుమారు 150 మంది ప్రతినిధులు హాజరవుతారు. భారత నావికాదళానికి సంబంధించి 90 నౌకలు, 45 విమానాలు, దాదాపు 600 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
కాగా ఫిబ్రవరి 18న విశాఖ సముద్రతీరంలో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని, 19న జరిగే మిలాన్–2026కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీవీఐపీల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా భారత నౌకాదళంతో పాటు స్నేహపూర్వక దేశాల నావికాదళ సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షిస్తారు. మిలాన్ కార్యక్రమం నావికాదళాల మధ్య పరస్పర సహకారం, సముద్ర భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించే కార్యక్రమం.
