Let's talk: editor@tmv.in
విశాఖపట్నం - భారతదేశపు కొత్త డేటా కేంద్రం

విశాఖపట్నం - భారతదేశపు కొత్త డేటా కేంద్రం

Dr.Chokka Lingam
13 అక్టోబర్, 2025

డేటా సెంటర్ అంటే ఏమిటి?

ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, ప్రతి ఆన్‌లైన్ చెల్లింపు, ప్రతి సినిమాను ఓటీటీలో చూడటం ఇవన్నీ ఒకచోట జరుగుతాయి. ఆ “చోటు” అంటే డేటా సెంటర్ వేల కొద్దీ కంప్యూటర్లు, నెట్‌వర్క్ పరికరాలు, కూలింగ్ సిస్టమ్స్ ఉండే పెద్ద భవనం.

ఇది ఇంటర్నెట్‌కి వెన్నెముక లాంటిది. ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తుల సమాచారం సురక్షితంగా నిల్వచేస్తుంది, వేగంగా ప్రాసెస్‌ చేస్తుంది. ఇప్పటి ఆధునిక డేటా సెంటర్లు క్లౌడ్ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బిట్‌కాయిన్‌ లావాదేవీలను కూడా నడుపుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు

అమెరికా, సింగపూర్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలలో డేటా సెంటర్ లు ఎక్కువగా ఉన్నాయి .ఈ దేశాలలో వాటికి మంచి విద్యుత్‌ సరఫరా, శీఘ్ర ఇంటర్నెట్ కనెక్టివిటీ, రాజకీయ స్థిరత్వం ఉన్నాయి.ఇటీవల భారతదేశం, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు కూడా డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి.

భారతదేశంలో డేటా సెంటర్లు

భారతదేశం ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్. మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ సర్వీసులు, స్ట్రీమింగ్ వల్ల డేటా వినియోగం విపరీతంగా పెరిగింది.

ప్రస్తుతం దేశంలో ముఖ్యమైన డేటా సెంటర్ నగరాలు ఇవి:

ఎందుకు విశాఖ?

• విశాఖపట్నం తూర్పు తీరంలో ఉన్న ఈ సిటీ, ఇప్పుడు భారతదేశం డేటా సెంటర్ రంగంలో కొత్త దిశ చూపిస్తోంది. ఈ నగరానికి భౌగోళికంగా, వనరుల పరంగా ఉన్న అనేక ప్రయోజనాలు, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

• సముద్ర తీరానికి సమీపంలో ఉండటం వల్ల అంతర్జాతీయ ఇంటర్నెట్‌ సముద్ర కేబుల్‌లను నేరుగా కలుపుకోవచ్చు. ఇది డేటా సెంటర్లకు వేగవంతమైన మరియు తక్కువ వ్యయంతో కూడిన కనెక్టివిటీని అందిస్తుంది. ఇక విద్యుత్‌ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పటికే సౌర మరియు వాయు విద్యుత్‌ ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఈ పచ్చ శక్తి వనరులు, విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్లకు సుస్థిర విద్యుత్‌ సరఫరా అందించనున్నాయి.

• అదనంగా, విశాఖ భారతదేశం ఉత్తరం–దక్షిణం భాగాల మధ్యలో ఉండటం వల్ల వ్యాపార కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం సృష్టిస్తోంది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహ మండలి (SIPB) ద్వారా భూమి కేటాయింపులు, పన్ను రాయితీలు, మౌలిక వసతుల సహాయం వంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమంటే, చెన్నై, ముంబై వంటి నగరాలతో పోలిస్తే విశాఖలో తుఫాన్‌ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది పెద్ద స్థాయి డేటా పార్క్‌లకు భద్రతను అందించే అంశంగా పరిగణించబడుతోంది.

విశాఖలో మూడు ప్రధాన డేటా సెంటర్ ప్రాజెక్టులు

• *గూగుల్‌ (రైడెన్ ఇన్ఫోటెక్‌) – భారీ క్లస్టర్

• ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌ విశాఖలో మూడు ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ₹87,520 కోట్ల పెట్టుబడి ఉంటుంది. సుమారు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అడవివరం, ఆనందపురం మరియు రాంబిల్లి ప్రాంతాల్లో మూడు కేంద్రాలు నిర్మించబడతాయి.

• ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు SIPB అక్టోబర్ 2025లో ఆమోదం ఇచ్చింది. నిర్మాణ పనులు 2026 మార్చిలో ప్రారంభమవుతాయని, 2028 మధ్య నాటికి మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతల్లో AI ఆధారిత సర్వర్ టెక్నాలజీ, తక్కువ నీరు వినియోగించే ఆధునిక కూలింగ్‌ వ్యవస్థ, పచ్చ విద్యుత్ ఆధారిత మౌలిక వసతులు ఉన్నాయి.

సిఫై ఇన్‌ఫినిట్ స్పేసెస్‌ – AI ఎడ్జ్ డేటా సెంటర్‌, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్

• ఇంటర్నెట్‌ సేవల రంగంలో ప్రముఖ సంస్థ సిఫై టెక్నాలజీస్‌ కూడా విశాఖలో కొత్త దశను ప్రారంభిస్తోంది. సంస్థ తన AI ఎడ్జ్ డేటా సెంటర్ మరియు సముద్ర కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం ₹1,500 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది. బీచ్ రోడ్‌ పరిసరాల్లో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించబడుతుంది.

• 2025 అక్టోబర్ 12న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సముద్ర కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ కావడం విశేషం. 5G మరియు AI సేవల కోసం వేగవంతమైన కనెక్టివిటీ అందించడం ఈ కేంద్ర లక్ష్యం. ప్రాజెక్టు ప్రారంభ దశలోనే 600 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.

• *అదానీకాన్నెక్స్‌ – సమగ్ర డేటా సెంటర్ & టెక్ బిజినెస్ పార్క్

• మాధురవాడలో స్థాపించబడుతున్న అదానీకాన్నెక్స్‌ సమగ్ర డేటా సెంటర్‌ మరియు టెక్నాలజీ బిజినెస్ పార్క్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రంలో మరో మైలురాయిగా నిలవనుంది. అదానీ గ్రూప్‌ మరియు అమెరికా సంస్థ ఎడ్జ్‌కాన్నెక్స్‌ కలిసి ₹20,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

• మొదటి దశలో 250 మెగావాట్ల సామర్థ్యంతో ఈ కేంద్రం నిర్మించబడుతుంది. 2023 మేలో శిలాఫలకం జరిగిన ఈ ప్రాజెక్టుకు 2025 జనవరిలో పర్యావరణ అనుమతి లభించింది. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

• ఇది దేశంలో మొదటి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్–టెక్ పార్క్‌ ప్రాజెక్ట్‌ కావడం విశేషం. దీనిలో డేటా సెంటర్‌లతో పాటు ఐటీ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు, పరిశోధనా యూనిట్లు ఉండనున్నాయి. మొత్తం క్యాంపస్‌ పచ్చ విద్యుత్ ఆధారంగా నడవడం, ప్రాజెక్టును పర్యావరణ అనుకూల మోడల్‌గా నిలబెడుతోంది.

విద్యుత్‌ , నీరు - ఈ డిజిటల్ నగరాల అవసరాలు

డేటా సెంటర్ అంటే ఓ చిన్న పట్టణం లాంటిది. ఇవి భారీగా విద్యుత్‌, నీటిని ఉపయోగిస్తాయి.

తక్కువ నీటి కూలింగ్ వ్యవస్థ వాడితే నీటి వినియోగం 70–90% వరకు తగ్గించవచ్చు. ఈ మూడు ప్రాజెక్టులు కలిపి సంవత్సరానికి 11,000 GWh విద్యుత్ అవసరం, అంటే మధ్యస్థాయి జిల్లాలో మొత్తం వినియోగించే విద్యుత్తుతో సమానం.

ఉద్యోగాలు - నిర్మాణం నుంచి ఇంజినీరింగ్‌ వరకూ

ఇవన్నీ కలిపి వేలకొద్దీ నిర్మాణ కార్మికులు, ఇంజినీర్లు, భద్రతా సిబ్బంది, డ్రైవర్లు, సాంకేతిక నిపుణులుకి ఉపాధి కలిగిస్తాయి.

ఆర్థిక ప్రభావం

ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో మొత్తం ₹1 లక్ష కోట్లు కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. విశాఖను ప్రభుత్వం "ఈస్ట్ కోస్ట్ డిజిటల్ గేట్వే" గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ ప్రభావాలు

డేటా సెంటర్లు ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తూనే కొన్ని సవాళ్లు కూడా తీసుకొస్తాయి —

విద్యుత్‌ అవసరం – ఎక్కువ లోడ్‌ వల్ల విద్యుత్‌ గ్రిడ్‌ పైన ఒత్తిడి పెరగొచ్చు.

నీటి వినియోగం – కూలింగ్ టవర్స్‌ వల్ల లక్షల లీటర్ల నీరు ఆవిరవుతుంది.

భూమి వినియోగం – తీర ప్రాంత పర్యావరణాన్ని కాపాడటానికి గ్రీన్‌ బెల్ట్‌లు అవసరం.

ఈ-వ్యర్థాలు – పాత సర్వర్లను సక్రమంగా రీసైకిల్‌ చేయాలి.

అన్ని సంస్థలు నెట్-జీరో ఎమిషన్ లక్ష్యాలను అనుసరించాలని ప్రతిజ్ఞించాయి.

సమతుల్యత - అభివృద్ధి & పర్యావరణం

విశాఖలోని ఈ ప్రాజెక్టులు డిజిటల్ విప్లవంకి కొత్త రూపాన్ని ఇస్తున్నాయి. కానీ అవి పర్యావరణాన్ని గౌరవించే విధంగా అమలైతేనే దీర్ఘకాల ప్రయోజనం లభిస్తుంది

విశాఖపట్నం - భారతదేశపు కొత్త డేటా కేంద్రం - Tholi Paluku