Let's talk: editor@tmv.in
విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు

Panthagani Anusha
8 డిసెంబర్, 2025

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాల్లో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న భారీ అంతరాయం కారణంగా చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. తూర్పు తీర రైల్వే జోన్‌లోని వాల్తేరు డివిజన్ పెరుగుతున్న రైలు టికెట్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఆరు రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

విమానాలు రద్దు కావడంతో రైలు టికెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని అదనపు ప్రయాణీకుల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు ఈసీఓఆర్ అధికారి దీపక్ రౌత్ వెల్లడించారు.

ప్రత్యేక రైలు వివరాలు

ఈ ఆరు ప్రత్యేక రైళ్లలో ఒకటి డిసెంబర్ 8న వాల్తేరు డివిజన్ కేంద్రమైన విశాఖపట్నం నుండి ఎస్ఎంవీటీ బెంగళూరుకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు డిసెంబర్ 9న విశాఖపట్నం చేరుకోనుంది.

అయితే విమాన సేవల్లో ఈ అంతరాయం మరో 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకుగాను సాధారణ రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించడంపై రైల్వే జోన్ దృష్టి సారిస్తోందని అవసరమైతే ఇతర రైల్వే జోన్‌లతో సమన్వయం చేసుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతామని దీపక్ రౌత్ స్పష్టం చేశారు.

ఇండిగోపై కేంద్రం ఆదేశాలు

ఇదిలావుండగా ఇండిగో విమాన కార్యకలాపాల్లో విమానాలు రద్దు ఆలస్యాల కారణంగా వేలాది మంది ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తడం అనేక సందర్భాల్లో ప్రయాణీకుల సామానుతప్పిపోవడంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.

రీఫండ్ల గడువు:

• రద్దైన లేదా అంతరాయం కలిగిన అన్ని విమానాల రీఫండ్‌ (డబ్బు వాపసు) ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలలోగా పూర్తి చేయాలని ఇండిగోకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సామాను అప్పగింత:

• విమానాల రద్దు కారణంగా ప్రయాణీకుల నుండి వేరు చేయబడిన సామానును గుర్తించి రాబోయే 48 గంటల్లో వారికి అందజేయాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది.

ప్రత్యేక సెల్స్:

• ప్రయాణీకులకు మద్దతు ఇచ్చేందుకు రీఫండ్‌లను సులభతరం చేయడానికిప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇండిగోను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

తిరుపతి, విజయవాడలో ఇండిగో విమానాలు రద్దు

మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో శనివారం విమాన సేవలు రద్దయ్యాయి మరికొన్ని ఆలస్యమయ్యాయి. ఈ సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తిరుపతి నుండి హైదరాబాద్‌కు తిరిగి హైదరాబాద్ నుండి తిరుపతికి నడిచే ఇండిగో విమాన సర్వీసులు శనివారం రాత్రి 9 గంటల వరకు రద్దయ్యాయి. అంతేకాకుండా శనివారం ఏడు విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు.

తిరుపతి విమానాశ్రయం డైరెక్టర్ డి. భూమినాథన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 10 విమానాలు రద్దయ్యాయి. సుమారు 1,000 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారికి ముందుగానే సమాచారం అందించడం వల్ల విమానాశ్రయంలో రద్దీ ఏర్పడలేదు అని పేర్కొన్నారు. విమానాల రద్దు కారణంగా విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణీకులకు ఇండిగో సంస్థ తాగునీరు, ఆహారం, సహా అన్ని ఏర్పాట్లు చేసిందని అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి పట్టణంలో 40 గదుల వరకు బుక్ చేసిందని భూమినాథన్ తెలిపారు.

మరోవైపు, విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు ఢిల్లీకి వెళ్లాల్సిన ఒక ఇండిగో విమానం మాత్రమే రద్దయిందని అయితే ఆ సంస్థకు చెందిన ఇతర విమానాలు రెండు గంటల వరకు ఆలస్యంగా నడిచాయని తెలిపారు.