
విశాఖపట్నం ఆర్‌కే బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం
విశాఖపట్నం నగరంలోని ఆర్‌కే బీచ్ రోడ్డు దగ్గర ఉన్న రాధా బీచ్ రెసిడెన్సీలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 9వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భవనంలో నివసించే ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు ప్రారంభించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం అందిన వెంటనే ఫైర్ టెండర్లు, పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత దిగజారకుండా నివారించగలిగారు. మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ఘటనను గంటలోపే పూర్తిగా నియంత్రించారు.
ఈ ఘటనపై మాట్లాడిన అక్కడి భావన నివాసి చిన్నపాటి అగ్ని ప్రమాదమే. పోలీసులు, ఫైర్ సిబ్బంది చాలా వేగంగా స్పందించారు. ఫైర్ టెండర్లు వచ్చి పర్యవేక్షించారు. అత్యంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించడంతో గంటలోపే పరిస్థితి సాధారణమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు” అని తెలిపారు.
పోలీసులు తెలిపిన ప్రకారం ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫ్లాట్‌లోని కొన్ని గదులు, ఫర్నిచర్‌కు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలా? అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
అగ్ని ప్రమాదం తరువాత భవనంలో ఫైర్ సేఫ్టీ పరికరాల పనితీరును అధికారులు పరిశీలించనున్నారు. ఈ ఘటనతో బీచ్ రోడ్ ప్రాంతంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ మంటలు వేగంగా అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
